దొందూ.. దొందే.. | Opposition leaderNarasimha Mishra criticize the Modi government | Sakshi
Sakshi News home page

దొందూ.. దొందే..

May 26 2017 10:31 AM | Updated on Mar 29 2019 9:31 PM

దొందూ.. దొందే.. - Sakshi

దొందూ.. దొందే..

కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో బీజేడీ పార్టీలు ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చినట్లు రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు నరసింహ మిశ్రా అరోపించారు.

► కేంద్రంలో బీజేపీ.. రాష్ట్రంలో బీజేడీ
►ధ్వజమెత్తిన ఒడిశా ప్రతిపక్ష నాయకుడు నరసింహ మిశ్రా


బరంపురం: ఎన్నికల ముందు ప్రజలకు తప్పుడు హమీలు చేస్తూ కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో బీజేడీ పార్టీలు ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చినట్లు రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు నరసింహ మిశ్రా అరోపించారు. గురువారం బరంపురంలోని స్టేషన్‌ రోడ్‌లో గల సరనూయ్యట్‌ హౌస్‌లో ఒడిశా కాంగ్రెస్‌ పార్టీ తరఫున విలేకరుల  సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ప్రతిపక్ష నాయకుడు నరసింహ మిశ్రా మాట్లాడుతూ గత 2014లో సాధారణ ఎన్నికల్లో ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోడి విదేశాల్లో ఉన్న నల్లధనాన్ని దేశానికి తెచ్చి 6 నెలల్లో   దేశ ప్రజల ప్రతి ఒక్కరి బ్యాంక్‌ అకౌంట్‌లలో రూ.15 లక్షలు జమ చేస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు.

కేంద్రంలో బీజేపీ  ప్రభుత్వం ఏర్పడి 3 ఏళ్లు గడిచినా ఇంతవరకు ఒక బ్యాంక్‌ అకౌంట్లో కూడా 15 పైసలు జమకాలేదని ఎద్దేవా చేశారు. పార్లమెంట్‌ సమావేశాల్లో ఈ విషయమై ప్రతి పక్షనాయకులు ప్రశ్నించగా ఎన్నికల ముందు ఎన్నో హామీలు చేస్తామని అవన్నీ నేరవేర్చ వలసిన పనిలేదని స్వయాన ప్రధాని నరేంద్ర మోడి బదులు చెప్పడం ప్రజలను మోసం చేయడమేనన్నారు.

ఉద్యోగాలేవీ?
ఇదేవిధంగా దేశంలో ప్రతి ఏడాదికి కోటి ఉద్యోగాలు కల్పిస్తామని కేంద్రంలో బీజేపీ, ఒడిశాలో ఏడాదికి లక్ష ఉద్యోగాలు కల్పిస్తామని రాష్ట్రం లో బీజేడీ ప్రజలకు హామీలు   ఇచ్చాయన్నారు. కానీ అధికారంలోకి వచ్చిన బీజేపీ, బీజేడీ ప్రభుత్వాలు ఇంతవరకు ఒక్క ఉద్యోగం కూడా కల్పించ లేదన్నారు.   ఒడిశా రాష్ట్రానికి ప్రత్యేక హో దా సాధిస్తామని 2014 ఎన్నికల్లో స్వయానా ముఖ్యమంత్రి నవీన్‌ పట్నా యక్‌ చెప్పారని కానీ అధికారంలో వచ్చిన బీజేడీ ఇంతవరకు ఒక్క అడుగు ముందుకు వేయలేదని విమర్శించారు.   

ప్రాజెక్ట్‌లేవీ?
వ్యవసాయ రంగ అభివృద్ధి కోసం రైతులకు ఉచితంగా విద్యుత్‌ సరఫరా చేస్తామని ముఖ్యమంత్రి నవీన్‌ చెప్పారని కానీ రైతులకు ఉచిత విద్యుత్‌ ఇవ్వకుం డా మరో వైపు విద్యుత్‌ బిల్లు టారిఫ్‌ పెంచుకుంటూ పోతున్నారన్నారు.  రాష్ట్రంలో గడిచిన 17 ఏళ్ల బీజేడీ పాలనలో ఒక్క నీటి ప్రాజెక్ట్‌ కట్టలేదని, చెక్‌ డ్యామ్‌లు లేవని గుర్తు చేశారు.   ప్రజల ను మోసం చేయడంలో బీజేపీ, బీజేడీ అంతరంగికంగా సహకారం చేసుకుంటున్నాయని  ఆరోపించారు.

 కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న మోసాలను  ప్రజలు గ్రహిస్తున్నారని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో అయా పార్టీలకు బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. సమావేశంలో మాజీ కేంద్ర మంత్రి చంద్రశేఖర్‌ సాహు, పీసీసీ కార్యదర్శి విక్రమ్‌ పండా, డీసీసీ  అధ్యక్షుడు భగవాన్‌ గంగాయత్, బరంపురం పార్లమెంట్‌ సెగ్మెంట్‌ అధ్యక్షుడు అజిత్‌ కుమార్‌ పండా, జిల్లా కార్యదర్శి దుర్గా ప్రసాద్‌ పండా పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement