ప్యాకేజీ డొల్ల.. రాజధాని కల్ల !


* విభజనకు ముందు కేంద్రం చెప్పినవన్నీ ఓటి మాటలే

* ఛత్తీస్‌గఢ్ చెబుతున్న సత్యమిదే

* ప్యాకేజీలిస్తాం.. రాజధాని నిర్మాణానికి సహకరిస్తామంటూ హామీలు.. ఆ తర్వాత మొండిచేయి

* రాష్ట్రం ఏర్పడి 13 ఏళ్లయినా రూపుదిద్దుకోని కొత్త రాజధాని

*  పథకాలకు నేటికీ నిధుల కొరత

* ‘సాక్షి’ క్షేత్రస్థాయి పర్యటనలో విస్తుపోయే వాస్తవాలు


 

* ఆంధ్రప్రదేశ్ రాజధానిలో.. ఒక్క అంతర్జాతీయ విమానాశ్రయం కోసం 5 వేల ఎకరాలు.. రూ.6 వేల కోట్ల ఖర్చు.. మెట్రో రైలుకు ఏకంగా రూ.15 వేల కోట్లు.. 11.6 కిలోమీటర్ల పీవీ ఎక్స్‌ప్రెస్ రహదారి నిర్మించడానికి రూ.630 కోట్లు.. 158 కిలోమీటర్ల ఔటర్ రింగ్ రోడ్డుకు రూ.7 వేల కోట్లు!!

- ఆధునిక నగరాల్లో మౌలిక వసతుల కల్పనకు అవుతున్న ఖర్చుల్లో ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే..

- అలాంటిది ఏకంగా ఒక కొత్త రాజధానినే నిర్మించాలంటే ఎంత ఖర్చవుతుంది...???

- రాష్ట్ర విభజన తర్వాత కొత్త రాజధాని నిర్మాణానికి సహకరిస్తామని కేంద్రం నమ్మబలుకుతున్న మాటల్లో వాస్తవమెంత?

*  ఎంతో తెలుసుకోవాలంటే ఓసారి ఛత్తీస్‌గఢ్  వైపు చూడాలి.

- రాష్ట్ర విభజన తర్వాత రాజధాని నిర్మాణానికి ఆ రాష్ట్రం అడిగిందే రూ. 10 వేల కోట్లు

- కేంద్ర ప్రభుత్వం విదిల్చింది ఎంతో తెలుసా..? రూ. 400 కోట్లు. అదీ రెండు విడతల్లో!




2000లో మధ్యప్రదేశ్‌ను విభజించి ఈ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసే సమయంలో కేంద్రం చెప్పిందేమిటి? అక్కడ నిజంగా జరిగిందేమిటి? విభజన కష్టాలేమిటి? ఈ అంశాలను తెలుసుకోవటానికి ‘సాక్షి’ అక్కడ పర్యటించింది. ఇందులో విస్తుపోయే వాస్తవాలు బయటపడ్డాయి. విభజనకు ముందు కేంద్రం చెప్పిన మాటలన్నీ ఉత్తివే అని తేలింది. ఛత్తీస్‌గఢ్ ఏర్పడి 13 ఏళ్లు గడిచినా అక్కడ నేటికీ ‘కొత్త రాజధాని’ కలగానే మిగిలింది.


(నయా రాయ్‌పూర్ నుంచి గౌరీభట్ల నర్సింహమూర్తి): కోటి ఆశలతో కొత్త రాష్ట్రాన్ని సాధించుకున్న ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర వాసులకు కేంద్రం చుక్కలు చూపిస్తోంది. విభజనకు ముందు అరచేతిలో కొత్త రాజధానిని, ప్యాకేజీని చూపించి ఆచరణలో తూచ్ అంటూ వెక్కిరిస్తోంది. రాష్ట్రం ఆవిర్భవించి 13 సంవత్సరాలు గడిచినా ‘కొత్త రాజధాని’ అవతరించలేదు. ప్రస్తుత రాజధాని రాయ్‌పూర్ మరీ చిన్నది కావడంతో దానికి 25 కి.మీ దూరంలో కొత్త రాజధాని నిర్మాణం చేయాలన్నది ప్రతిపాదన. కానీ ఇది ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా ఉంది. దశాబ్దం గడిచిపోయినా ప్రస్తుతం సచివాలయంతోపాటు ఒకట్రెండు భవనాలే కనిపిస్తున్నాయి. మిగతా నిర్మాణాలన్నీ అసంపూర్తిగా దర్శనమిస్తున్నాయి. గత్యంతరం లేక ఇప్పటికీ ఇరుకుఇరుకుగా ఉండే పాత రాయ్‌పూర్‌లోనే రాజధాని కొనసాగుతోంది.

 

ప్యాకేజీ.. పరిహాసం!

ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర పాలన కొత్త రాజధాని నిర్మాణంతోనే ప్రారంభించాలనేది మొదట్లో నిర్ణయం. విభజన సమయంలోనే ఉన్న రాయ్‌పూర్ ఏమాత్రం సరిపోదనీ, కొత్త రాజధాని నిర్మాణానికి కేంద్ర సాయం అందిస్తామంటూ అప్పటి కేంద్రంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం ప్రకటించింది. కానీ రాష్ట్రం ఏర్పడి నెలలు గడుస్తున్నా కేంద్రం నుంచి పైసా ప్యాకేజీ రాలేదు. దీంతో నాటి అజిత్‌జోగి ప్రభుత్వం పలుమార్లు కేంద్రానికి మొరపెట్టుకుంది. ఇలా రెండేళ్లు గడిచాక కేంద్రం తాపీగా కేవలం రూ.300 కోట్లు విదిల్చేందుకు సిద్ధం కావటంతో ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం కంగుతిన్నది. ఇంత చిన్న మొత్తంతో ఏం చేస్తామని బావురుమనేసరికి మరో రూ.100 కోట్లు ప్రకటించింది. వాస్తవానికి కొత్త రాజధానికి రాష్ట్ర ప్రభుత్వ అంచనా 10 వేల కోట్లు! కేంద్రం ప్యాకేజీ రూపంలో ఇచ్చింది మాత్రం రూ.400 కోట్లు. అంటే 4 శాతం! ఈ నిధులతో రాజధానికి అవసరమైన భూసేకరణ కూడా జరగలేదు. ఇదంతా తెలిసినా కేంద్రం నిధులివ్వటానికి ముందుకురాలేదు. విభజన సమయంలో ‘ప్యాకేజీ’ అన్న పదం తప్ప కచ్చితంగా ఇన్ని నిధులిస్తామని ఎక్కడా చెప్పకపోవడంతో కేంద్రం సులభంగా తప్పించుకుంది. కేంద్రం ఇచ్చిన షాక్ నుంచి తేరుకోలేక, సొంత వనరులతో రాజధాని నిర్మాణం చేపట్టలేక ఆ ప్రభుత్వం మూడేళ్ల పాటు చేష్టలుడిగింది.

 

అదనంగా చిల్లిగవ్వ లేదు..

కొత్త రాజధాని పాత రాయ్‌పూర్‌కు దూరంగా ఉంది కాబట్టి రాకపోకల కోసమంటూ జేఎన్‌ఎన్‌ఆర్‌ఎంయూ కింద కేంద్రం 100 బస్సులను మంజూరు చేసింది. ఇది తప్ప అదనంగా చిల్లిగవ్వ కూడా అందలేదు. కొత్త నగరం కోసం దాదాపు 20 వేల ఎకరాలు సేకరించారు. సచివాలయం, అసెంబ్లీ, రాజ్‌భవన్, ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రభుత్వ సిబ్బంది గృహ సముదాయాలు, విశ్వవిద్యాలయం, స్టార్ హోటళ్లు, వాణిజ్య సముదాయాలు, రైల్వే స్టేషన్, ఉద్యానవనాలు, జూ, మ్యూజియం, సాఫ్ట్‌వేర్ కేంద్రం, క్రీడా ప్రాంగణాలు ఉండాలనేది ప్రణాళిక. ఎంతలేదన్నా కనీసం రూ.10 వేల కోట్లు అవసరమవుతాయన్నది అంచనా. రూ.5 వేల కోట్లతో తొలి దశ నిర్మాణాలు ప్రారంభించారు. ఇది పూర్తయితే గాంధీనగర్, చండీగఢ్, భువనేశ్వర్ తర్వాత దేశంలోనే నాలుగో ప్రణాళికాబద్ధ నగరంగా నిలిచేది. కానీ కేంద్రం మొండిచేయి చూపడంతో ప్రస్తుతం సచివాలయం (మంత్రాలయ్) తప్ప పూర్తిస్థాయిలో రూపుదిద్దుకున్న మరో నిర్మాణం లేదు. ఇదంతా కొలిక్కి రావాలంటే మరో పదేళ్లు పడుతుందని నిపుణుల అంచనా. వచ్చే ఐదేళ్ల కాలంలో కూడా తొలి దశలో కొన్ని ప్రభుత్వ విభాగాలు, రోడ్లు, ఆసుపత్రి, ఒకట్రెండు హోటళ్లు, అధికారులు-సిబ్బంది గృహాలు, కొన్ని కాలనీలు మాత్రమే పూర్తి కానున్నాయి.

 

పథకాలకు నిధుల్లేక...


కేంద్రం తీరుతో ఛత్తీస్‌గఢ్‌ను సవాళ్లు చుట్టుముట్టాయి. నిధుల్లో ఎక్కువ మొత్తం కొత్త రాజధాని కోసమే వెచ్చిస్తుండడంతో పథకాలకు నిధుల కొరత ఏర్పడింది. రాయ్‌పూర్ అడ్డదిడ్డంగా విస్తరించటంతో ఆ మేరకు సౌకర్యాల కల్పన అసాధ్యమైంది. రోడ్లు, మంచినీళ్లు, వైద్యం, పచ్చదనం.. లాంటివి అంతంత మాత్రమే. కనీసం రెండోశ్రేణి పట్టణ వాతావరణం కూడా లేదు. ఐదేళ్ల క్రితం ‘కమల్ విహార్ యోజన’ పేరుతో పాత నగర అభివృద్ధి పథకానికి రూపకల్పన చేశారు. నగరాన్ని నాలుగు భాగాలు చేసి 65:35 పద్ధతిలో అభివృద్ధి చేయాలని యోచించారు. 35 శాతం భూమిని అభివృద్ధి చేసి ప్రజలకు ఇచ్చి, మిగతా భూమిని రోడ్లు, పార్కులు, ఇతర ప్రజోపయోగ పనులకు వినియోగిస్తారు. ఈ పనులు పోను మిగిలిన భూమిని బహిరంగ వేలం ద్వారా విక్రయించి ప్రభుత్వం నిధులు సమకూర్చుకుంటోంది. ఇప్పుడిప్పుడే ఈ పనులు మొదలయ్యాయి.

 

సొంత వనరులే దిక్కు..

తీవ్ర ఇబ్బంది ఏర్పడడంతో బీజేపీ నేతృత్వంలోని రమణ్‌సింగ్ ప్రభుత్వం సొంతంగా నిధుల సేకరణకు నడుం బిగించింది. బొగ్గు, ముడి ఇనుము, బాక్సైట్ వెలికి తీసే సంస్థలు కచ్చితంగా ఇక్కడే పరిశ్రమలు ఏర్పాటు చేయాలనే నిబంధనను తీసుకువచ్చింది. రాయల్టీ మొత్తాన్ని, పన్నుల శాతాన్ని బాగా పెంచారు. హోటళ్లు తదితర సేవలపై 5 శాతం అభివృద్ధి పన్ను వేశారు. భూమి విలువ పెంపు, రిజిస్ట్రేషన్ ఛార్జీలు సరేసరి. కొత్తగా వచ్చే సంస్థలు ఇక్కడే విద్యుదుత్పత్తి కేంద్రాలు (పిట్ హెడ్) ఏర్పాటు చేయాలనే నిబంధనతోపాటు నిర్ధారిత మొత్తంలో ఉత్పత్తి ధరకే కరెంటును కేటాయించాలనే షరతు విధించారు. ఫలితంగా విద్యుత్ ఉత్పత్తి సంస్థల నుంచి పన్నులు, రాయల్టీతోపాటు అతి తక్కువ ధరకు కరెంటు వచ్చి పడుతుంది.. మిగిలిన కరెంటును ఎక్కువ ధరకు ఇతర రాష్ట్రాలకు అమ్ముకోవాలని నిర్ణయించారు. కానీ ఉత్పత్తి సామర్థ్యం కేవలం 2,800 మెగావాట్లుగానే ఉంది. దాన్ని 49 వేల మెగావాట్లకు పెంచాలనే ప్రణాళికలో భాగంగా 65 కంపెనీలతో ఒప్పందాలు కుదిరాయి. జగదల్‌పూర్‌లో స్టీల్ పరిశ్రమకు రూ.20 వేల కోట్ల అంచనాతో ఎన్‌ఎండీసీ, రూ.5 వేల కోట్ల అంచనాతో టాటా, రూ.12 వేల కోట్లతో మరో కంపెనీ ముందుకొచ్చాయి. వీటి నుంచి ఆశించిన ఆదాయం వస్తేగానీ ఛత్తీస్‌గఢ్ అభివృద్ధి, కొత్త రాజధాని సాకారమయ్యే అవకాశాలు లేవు.

 

రాజకీయ సహాయ నిరాకరణ..

ఛత్తీస్‌గఢ్ ఏర్పడ్డప్పుడు కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం ఉండగా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ప్యాకేజీ రూపంలో భారీగా నిధులిస్తే అది స్థానికంగా కాంగ్రెస్‌కు ఉపయోగపడుతుందని కేంద్రం భావించి పట్టించుకోలేదు. ఆ త ర్వాత రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే కేంద్రంలో యూపీఏ ఉంది. ఫలితం మళ్లీ అదే. దీనికితోడు రాష్ట్ర విభజన సమయంలో మాట్లాడుకున్న మేరకు మధ్యప్రదేశ్ నుంచి ఆస్తులు పంచలేదని అధికారులు చెబుతున్నారు. అప్పుల్ని మాత్రం జనాభా నిష్పత్తి ప్రకారం పంచారు. ఛత్తీస్‌గఢ్ ప్రధాన ఆదాయ వనరు సహజ సంపదే. బొగ్గు, ఇనుము, బాక్సైట్ గనులు. వీటి కోసం కొత్త రైల్వే లైన్లను నిర్మించాలని రాష్ట్రం కోరుతున్నా... కేంద్రం సహకరించడం లేదు. దీంతో రైల్వే కారిడార్ల ఆలోచన కాగితాలకే పరిమితమైంది. ప్రస్తుతం రెండు జాతీయ రహదారులు మాత్రమే ఉన్నాయి. చాలా నగరాలకు అనుసంధాన మార్గాలు సరిగ్గా లేవు. రాయ్‌పూర్ విమానాశ్రయానికి అంతర్జాతీయ గుర్తింపు వచ్చినా.. సౌకర్యాలు లేవు. సిబ్బంది లేరు. ఫలితంగా రాత్రి వేళ విమానాలు దిగే పరిస్థితి లేదు.

 

 ‘ఆప్షన్స్’తోనే ఉద్యోగుల కేటాయింపు


ఛత్తీస్‌గఢ్ జనాభా పాత ఉమ్మడి రాష్ట్ర జనాభాలో 26 శాతంగా ఉండేంది. ఉద్యోగులనూ ఇదే నిష్పత్తిలో విభజించారు. ఉద్యోగుల ‘ఆప్షన్స్’ తీసుకున్న తర్వాతే కేటాయింపులు చేశారు. ఆంధ్రప్రదేశ్ విభజన జరిగితే ఎక్కడి  ప్రాంతం వారు అక్కడికి వెళ్లిపోవాలనే కొందరు నేతల తరహాలో కాకుండా ఉద్యోగుల అభిప్రాయం తీసుకుని వారు ఏ ప్రాంతంలో పనిచేసేందుకు మక్కువ చూపారో ఆ ప్రాంతానికే కేటాయించారు.

 

కొత్త రాజధానిపై కిరణ్ కసరత్తు!

పైకి సమైక్యం మాటలు వినిపిస్తున్నా.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తెర వెనుక మాత్రం విభజన ప్రక్రియ తాలూకు కసరత్తును సాగిస్తున్నారు. ఈయన సూచనల మేరకు ఏపీకి చెందిన ఓ సీనియర్ ఐఏఎస్ అధికారి, మరో విశ్రాంత ఐఏఎస్ అధికారి ఛత్తీస్‌గఢ్ అధికారులతో సంప్రదింపులు జరిపారు. కొత్త రాజధాని కోసం అనుసరిస్తున్న పద్ధతులను తెలుసుకున్నారు. త్వరలో ఓ బృందాన్ని పంపుతామని, కొత్త రాజధాని ప్రణాళికలు, పనులను చూపాలని వారు కోరారు. వాటిని సీమాంధ్ర రాజధాని విషయంలో అనుసరిస్తామని, ఆ విశ్రాంత ఐఏఎస్ అధికారి దానికి నేతృత్వం వహిస్తారని సదరు అధికారులు వెల్లడించారు.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top