మధ్యాహ్న భోజనం ఉడుతలు..ఎలుకలే! | No Mid-Day Meal, Jharkhand 9-Year-Old Hunts Rats, Squirrels | Sakshi
Sakshi News home page

మధ్యాహ్న భోజనం ఉడుతలు..ఎలుకలే!

Mar 17 2017 10:53 PM | Updated on Sep 5 2017 6:21 AM

మధ్యాహ్న భోజనం ఉడుతలు..ఎలుకలే!

మధ్యాహ్న భోజనం ఉడుతలు..ఎలుకలే!

జార్ఖండ్‌లోని సాహెబ్‌గంజ్‌ జిల్లా రాజ్‌మహల్‌ హిల్స్‌ ప్రాంతం చుహా పహర్‌ అనే ఓ కుగ్రామం ఉంది.

ఆకలిబాధ తట్టుకోలేక ఉడుతల్ని, ఎలుకల్ని తింటున్న జార్ఖండ్‌ గిరిజన బాలలు 
అధికారుల జేబుల్లోకి చేరుతున్న మధ్యాహ్న భోజనం నిధులు


ఈ చిత్రంలో కనిపిస్తున్న చిన్నారి పేరు పింకి. మధ్యాహ్నం కాగానే ఉడతలు పట్టడం పింకి దినచర్య. దొరకకపోతే ఎలుకలు కూడా పడుతుంది. వాటితో ఆడుకోవడానికో.. సరదా కోసమో పింకి ఉడతలను, ఎలుకలను పట్టడంలేదు. కడుపు కాలి.. ఆకలి బాధను భరించలేక ఈ పనిచేస్తోంది. ఆమె మధ్యాహ్న భోజనం ఇదే అంటే ఆశ్చర్యమేస్తోంది కదూ! కానీ ఇది నిజం.

మరి పింకి అలా.. ఉడుతలను, ఎలుకలనే ఎందుకు తింటోంది? ...ఎందుకంటే అధికారుల రూపంలో ఉన్న పందికొక్కులు పింకి నోటికాడి ముద్దను లాగేసుకుంటున్నాయి. మధ్యాహ్న భోజనానికి వందలు.. కాదు వేలు.. కాదు కాదు లక్షల కోట్ల రూపాయలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కేటాయిస్తున్నా అవేవీ దేశంలోని చాలామంది పిల్లల వద్దకు చేరడంలేదనేందుకు ఈ పింకే నిదర్శనం. వివరాల్లోకెళ్తే...  

జార్ఖండ్‌లోని సాహెబ్‌గంజ్‌ జిల్లా రాజ్‌మహల్‌ హిల్స్‌ ప్రాంతం చుహా పహర్‌ అనే ఓ కుగ్రామం ఉంది. ఇక్కడ కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఓ పాఠశాల ఉంది. ఐదేళ్ల వయసున్నప్పుడే పింకిని పాఠశాలలో చేర్చారు. ఇప్పుడు పింకి వయసు తొమ్మిదేళ్లు. పింకి వయసు పెరుగుతోందే తప్ప.. తరగతి పెరగడంలేదు. కారణం.. పాఠశాల ఉంది పేరుకు మాత్రమే. ఆ ఊరిలో బడి ఈడు పిల్లలున్నా పాఠశాలలో మాత్రం ఒక్కరు కూడా ఉండరు. ఎందుకంటే చదువు చెప్పేందుకు అసలు టీచరే ఉండడు.

ప్రభుత్వ లెక్కల్లో పక్కాగా..
రాష్ట్ర ప్రభుత్వ లెక్కల్లో మాత్రం గత నాలుగు సంవత్సరాలుగా పింకి పేరుమీద నిధులు విడుదలవుతూనే ఉన్నాయి. స్కూల్‌ యూనిఫారంకు, పోషకాహారాలతో కూడిన మధ్యాహ్న భోజనానికి రూపాయి రూపాయి లెక్కగడుతూ నిధులు విడుదల చేస్తూనే ఉన్నారు. వీటితో పింకికి యూనిఫారం ఇచ్చినట్లు, ఆకుకూరలు, అన్నం, రోజుకో గుడ్డుతో భోజనం పెడుతున్నట్లు ప్రభుత్వానికి నివేదికలు కూడా అందుతున్నాయి. అయితే ఇక్కడ పింకి తింటోంది మాత్రం ఎలుకలు, ఉడతలు. ఎంత దారుణం!!

పదివేల కోట్లు...
ఈ ఏడాది బడ్జెట్‌లో పాఠశాల పిల్లల కోసం కేంద్ర ప్రభుత్వం పదివేల కోట్ల రూపాయలను కేటాయించింది. వీటితో 10.03 కోట్ల మంది చిన్నారుల చదువు, పోషకాహారం అందించనున్నట్లు ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ప్రతి రూ.6కు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తమవంతుగా మరో రూ.4 కలిపి మొత్తం రూ.10తో పిల్లలకు పోషకాహారం పెట్టాలి. నిధులైతే మంజూరవుతున్నాయి. అయినా పింకి మాత్రం పస్తూలుంటూనే ఉంది. జార్ఖండ్‌లోని చాలా ప్రాంతాల్లో ఇలాంటి పింకిలు ఎంతోమంది కనిపిస్తారు.

సొమ్మంతా అధికారుల జేబుల్లోకి..
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కేటాయిస్తున్న వేలాది కోట్ల రూపాయల నిధులు ఏమవుతున్నాయంటే... సమాధానం సుస్పష్టం. అవన్నీ అధికారుల జేబుల్లోకి చేరుతున్నాయి.

పిల్లల నోటికాడి ముద్దను మాత్రమే కాదు... వారి భవిష్యత్తునూ లాగేసుకుంటున్నారు విద్యాశాఖ అధికారులు. ఎందుకంటే... బడిలో భోజనం పెడతారనే ఆశతో పాఠశాలకు వచ్చే చిన్నారులు మనదేశంలో ఇప్పటికే కోట్లాదిమందే ఉన్నారు. ఆ భోజనం దొరకనప్పుడు వారు బడికి రారు. దీంతో వారి భవిష్యత్తు నాశనమైనట్లే కదా?
–సాక్షి, స్కూల్‌ ఎడిషన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement