అమ్మ కమ్మగా వండిపెడుతుంది.. వెళ్లి తినాలంటూ షిఫ్టు మార్చుకున్నాడు. అదే అతడి ప్రాణాలు తీసింది.
అమ్మ కమ్మగా వండిపెడుతుంది.. వెళ్లి తినాలంటూ షిఫ్టు మార్చుకున్నాడు. అదే అతడి ప్రాణాలు తీసింది. అతడెవరో కాదు.. భారత సంతతికి చెందిన సంజిద్ సింగ్ సంధు. ఆయన విమానంలో స్టివార్డుగా పనిచేస్తున్నారు. స్వతహాగా పంజాబీ అయిన సంధు నిజానికి ఎంహెచ్-17 విమానంలో వెళ్లాల్సిన వాడు కాదు. కానీ, వేరే సహచరుడితో షిఫ్టు మార్చుకుని మరీ ఆమ్స్టర్డామ్ నుంచి కౌలాలంపూర్ వెళ్లే విమానం ఎక్కాడు.
సంధు మలేషియాలోని పెనాంగ్ నగరంలో ఉన్న తమ ఇంటికి రాగానే అతడికి ఇష్టమైన వంటకాలన్నీ చేసి పెట్టాలని ఆయన తల్లి భావించినట్లు తండ్రి జిజర్ సింగ్ తెలిపారు. విమానం ఎక్కడానికి కొద్ది సేపటి ముందే తనతో ఫోన్లో మాట్లాడాడని, అదే తమ అబ్బాయితో చిట్టచివరి సంభాషణ అని అన్నారు. ఎందుకిలా జరిగిందంటూ ఆయన కన్నీటి పర్యంతం అయ్యారు. సంధు భార్య కూడా మలేషియా ఎయిర్లైన్స్లో స్టివార్డెస్గా పనిచేస్తున్నారు. ఆమె ద్వారానే అత్తమామలకు ఈ విషయం తెలిసింది. జిజర్ సింగ్ దంపతులకు సంజిద్ ఒక్కడే కుమారుడు.