ఇండియన్‌ ఐడల్‌గా రేవంత్‌

ఇండియన్‌ ఐడల్‌గా రేవంత్‌


- రూ. 25 లక్షల నగదు

- యూనివర్సల్‌ మ్యూజిక్‌తో ఒప్పందం


ముంబై: మరోసారి ఇండియన్‌ ఐడల్‌ కిరీటం తెలుగువారి సొంతమైంది. బాహుబలి గాయకుడిగా గుర్తింపు పొందిన తెలుగు కుర్రాడు ఎల్‌వీ రేవంత్‌(25) ఇండియన్‌ ఐడల్‌ సీజన్‌– 9 ఫైనల్లో తన గాన మాధుర్యంతో, స్టెప్పులతో అందర్నీ కట్టిపడేసి విజేతగా నిలిచాడు.



షో మొదటి నుంచి ప్రధాన ఆకర్షణగా నిలిచిన రేవంత్‌.. మరో ఇద్దరు పోటీదారులు పీవీఎన్‌ఎస్‌ రోహిత్, ఖుదా భక్ష్‌లతో హోరాహోరీగా సాగిన ఫైనల్లో సత్తా చాటాడు. క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌ నుంచి ఇండియన్‌ ఐడల్‌ ట్రోఫీని అందుకున్నాడు. హిందీ సరిగా పలకడం రాదన్న విమర్శకులకు సమాధానం చెపుతూ.. సీజన్‌ మొత్తం హిందీ పాటల్ని ఎంతో అలవోకగా పాడి న్యాయమూర్తులతో పాటు దేశవ్యాప్తంగా ఎందరో అభిమానాన్ని సంపాదించుకున్నాడు.



ఇక ఆదివారం జరిగిన ఫైనల్లో తన పాటలతో స్టేజంతా తిరుగుతూ ఉర్రూతలూగించాడు. చక్‌దే సినిమా నుంచి ‘మర్‌ జాయోన్‌ యా జీ లూన్‌ జరా’ పాట పాడి జవాన్లను అంకితమిచ్చాడు. అలాగే ‘లడ్కీ కా గయీ చుల్‌’ పాట పాడుతూ అమ్మాయిలతో డ్యాన్స్‌ చేస్తూ ఆకట్టుకున్నాడు. ఇండియన్‌ ఐడల్‌ కిరీటంతో పాటు యూనివర్సల్‌ మ్యూజిక్‌ కంపెనీతో ఒప్పందం, రూ. 25 లక్షల నగదు బహుమతిని రేవంత్‌ గెలుచుకున్నాడు.  రోహిత్‌ సెకండ్‌ రన్నరప్‌గా నిలిచాడు. తెలుగుతో పాటు దక్షిణాది భాషల్లో దాదాపు 200 పాటలు పాడిన రేవంత్‌కు బాహుబలి సినిమా లోని మనోహరి పాట ఎంతో పేరు తీసుకొచ్చింది. గతంలో శ్రీరామచంద్ర ఇండియన్‌ ఐడల్‌ సీజన్‌– 5 టైటిల్‌ గెలుచుకున్నాడు.



నా జీవితాన్ని మార్చేసింది..

పోటీ అనంతరం రేవంత్‌ మాట్లాడుతూ...‘నేను ఇప్పుడు మబ్బుల్లో తేలుతున్నాను. ఈ షో గెలిచినందుకు చాలా ఆనందంగా ఉంది. నా జీవితం ఇప్పుడే మొదలైందని నేను చెప్పగలను. ఒక దక్షిణాది గాయకుడిగా ఇండియన్‌ ఐడల్‌ గెలవడం అంత సులువు కాదు. ఈ షోను పెద్ద అవకాశంగా భావించాను. నాలుగు నెలల ఈ ప్రయాణం పూర్తిగా నా జీవితాన్ని మార్చేసింది. నేను ఇంటికి వెళ్లి స్నేహితులతో ఈ విజయాన్ని పంచుకోవాలి. అయితే బాలీవుడ్‌కి వచ్చి ఇక్కడే స్థిరపడతా అని చెప్పారు. రేవంత్‌ పూర్తి పేరు లొల్ల వెంకట రేవంత్‌ కుమార్‌ శర్మ. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లాలో ఫిబ్రవరి 10, 1990లో జన్మించాడు. శ్రీకాకుళం, విశాఖపట్నంలో చదువుకున్నాడు. సినిమాల్లో పాటలు పాడాలనే లక్ష్యంతో హైదరాబాద్‌కు వచ్చాడు. ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి ప్రోత్సహంతో రేవంత్‌ కెరీర్‌ మలుపు తిరిగింది.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top