
కీచకులకు కరాటే పంచ్!
తనను చెరబట్టేందుకు వచ్చిన ఇద్దరు దుండగులకు 16 ఏళ్ల బాలిక గట్టిగా బుద్ధి చెప్పింది.
బరసాత్: తనను చెరబట్టేందుకు వచ్చిన ఇద్దరు దుండగులకు 16 ఏళ్ల బాలిక గట్టిగా బుద్ధి చెప్పింది. తాను నేర్చుకున్న కరాటేతో కామాంధుల పనిపట్టింది. తోకముడిచిన కీచకులు ఆమెను వదిలేసి పారిపోయారు. పశ్చిమ బెంగాల్ లోని కోల్ కతా ఉత్తర శివారులోని మధ్యగ్రామ్ ప్రాంతంలో సోమవారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుంది.
కరాటే క్లాసు నుంచి ఇంటికి తిరిగొస్తున్న బాలికను సైకిళ్లపై వచ్చిన ఇద్దరు దుండగులు అడ్డగించారు. ఆమెను బలవంతంగా లాక్కేందుకు ప్రయత్నించారు. అయితే ఆ బాలిక వారిని ధైర్యంగా ఎదుర్కొంది. తాను నేర్చుకున్న మార్షల్ ఆర్ట్స్ తో వారిని ఉతికి పారేసింది. దీంతో దుండగులు ఆమెను వదిలేసి పారిపోయారు. తమ ప్రాంతంలో లైంగిక దాడులు పెరిగిపోవడంతో ఏడాది నుంచి కరాటే నేర్చుకుంటున్నానని బాలిక తెలిపింది. ఆత్మరక్షణ కోసం అభ్యసించిన కరాటే ఆపత్కాలంలో తనకు అక్కరకొచ్చిందని చెప్పింది.
కొద్ది రోజుల క్రితం తనతో పాటు స్నేహితురాలిని వేధించిన ఐదుగురిపై స్థానిక పెద్దలకు ఫిర్యాదు చేశానని వెల్లడించింది. వీరిపై ఎటువంటి చర్య తీసుకోలేదని వాపోయింది. వాళ్లే తనపై దాడికి యత్నించివుంటారని అనుమానం వ్యక్తం చేసింది. తాజా ఘటనపై పోలీసులకు బాలిక ఫిర్యాదు చేసింది. నిందితుల్లో గుర్తించామని పోలీసులు తెలిపారు. తాను కరాటే నేర్చుకుంటానంటే తన తల్లిదండ్రులు అడ్డుచెప్పారని, ఇప్పుడు వద్దనబోరనే నమ్మకాన్ని ఆ బాలిక వ్యక్తం చేసింది.