breaking news
Karate girl
-
చదువు చదువు అని విసిగించడంతో తల్లి మెడకు ఉరి బిగించేసి..
ముంబై: కుమార్తెను డాక్టర్‌ను చేద్దామని ఆ తల్లి తపనపడింది. వైద్య విద్య చదివేందుకు ప్రోత్సహించింది. అయితే ఆ కుమార్తె మాత్రం పట్టించుకోకుండా ఇష్టారీతిన వ్యవహరించింది. వైద్య విద్య ప్రవేశాలకు నిర్వహించే నీట్‌కు సిద్ధం కావాలని పుస్తకాలు.. శిక్షణ అంతా ఇస్తున్న తల్లిని ఆ బాలిక హతమార్చింది. ఈ ఘటనను కప్పిపుచ్చుతూ ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు చేసిన ప్రయత్నం బెడిసికొట్టింది. డాక్టర్ కావాల్సిన అమ్మాయి ఇప్పుడు జువైనల్ హోంలో ఉంది. మహారాష్ట్ర నేవీ ముంబైలోని ఎయిరోలీ ప్రాంతానికి చెందిన 15 ఏళ్ల ఈ అమ్మాయి ఇటీవల పదో తరగతి పాసయ్యింది. వైద్య విద్య చదివేందుకు నీట్‌కు సిద్ధం కావాలని తల్లి (40) చెప్పగా గొడవ మొదలైంది. తరచూ చదవాలని తల్లి చెబుతుండడంతో ఆ బాలిక చిరాకు పడుతోంది. ఈ క్రమంలో జూలై 30వ తేదీన ఆ బాలిక రబౌలీ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి తన తల్లి చనిపోయిందని ఫిర్యాదు చేసింది. తన మేనమామకు ‘అమ్మ గదిలోకి వెళ్లి తలుపు వేసుకుని తీయడం లేదు’ అని చెప్పింది. దీంతో వీరిద్దరి సమాచారం మేరకు పోలీసులు ఆత్మహత్య కేసుగా నమోదు చేశారు. అయితే పోస్టుమార్టమ్ చేయగా ఆ కుమార్తె చేసిన దారుణం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఎప్పుడూ చదువు చదువు అని విసిగిస్తోందని బాలిక కోపం తట్టుకోలేక కరాటే బెల్ట్ తీసుకుని తల్లి మెడకు బిగించింది. ఆమె అపస్మారక స్థితికి చేరుకుని చివరకు ఊపిరాడక మృతి చెందింది. ఈ హత్యను కప్పి పుచ్చేందుకు మేనమామతో ఆత్మహత్యగా పేర్కొంది. హత్య బయటపడడంతో బాలికను జువైనల్ హోమ్‌కు తరలించినట్లు పోలీస్ అధికారి దినేశ్ పాటిల్ తెలిపారు. ఆ బాలిక నెలకిందట సొంత తల్లిపైనే పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. తనను తల్లి వేధిస్తుందోనని పేర్కొంది. దీంతో ఆ అమ్మాయికి పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చి వదిలేశారు. ఇప్పుడు ఆ అమ్మాయి ఇప్పుడు తల్లిని హత్య చేయడం పోలీసులను నివ్వెరపరిచింది. దీంతోపాటు హత్యను కప్పిపుచ్చేందుకు చేసిన డ్రామా కూడా వారిని విస్మయానికి గురి చేసింది. -
పోకిరీలను కరాటే కిక్‌తో తరిమేసింది!
ఆమె వయసు 17 సంవత్సరాలు. ఉండేది పశ్చిమబెంగాల్ రాష్ట్రం. కోల్‌కతాకు 40 కిలోమీటర్ల దూరంలోని దోల్తలా బస్టాపు సమీపంలో ఇద్దరు వ్యక్తులు ఆమెను వేధించాలని బయల్దేరారు. కానీ వాళ్లకు అసలు విషయం తెలియదు. ఆమె ఓ కరాటే ఫైటర్. వేధించేందుకు వచ్చిన ఇద్దరికీ ఆమె తనదైన శైలిలో నాలుగు కరాటే కిక్‌లు ఇచ్చి సన్మానం చేసి పంపింది. దాంతో దెబ్బకు వాళ్లిద్దరూ తోక ముడిచి పారిపోయారు. ఆ ధైర్యశాలి పేరు మున్నాదాస్. ఆమె కరాటే క్లాసు నుంచి ఇంటికి తిరిగి వస్తుండగా ఇద్దరు వ్యక్తులు సైకిళ్ల మీద వస్తూ ఆమెను వేధించారు. ఒకరు ఆమె చెయ్యి పట్టుకుని లాగాడు. దాంతో ఆమె కింద పడిపోయినా.. వెంటనే లేచి, కాలు గాల్లోకి లేపి ఒక్క కిక్కు ఇచ్చుకుంది. ఈ ఏడాది ప్రారంభంలోనే ఆమకు రాష్ట్రస్థాయి కరాటే పోటీలలో రెండు స్వర్ణపతకాలు వచ్చాయి. వాళ్లలో ఒకడి పీక పట్టుకున్నానని, తర్వాత అతడి ముఖం మీద ఓ పంచ్ ఇచ్చానని మున్నాదాస్ తెలిపింది. మెడమీద కొన్ని స్నాప్ కిక్‌లు, కొన్ని గ్రోయిన్ కిక్‌లు ఇవ్వడంతో అతడు పడిపోయాడని, వాళ్లు పారిపోతుంటే మరికొన్ని కిక్‌లు ఇచ్చానని ఆమె తెలిపింది. తన విద్యార్థిని సాహసం చూసి ఆమె కరాటే గురువు భోలానాథ్ షా మురిసిపోయారు. ఆయన కూడా 1996లో జాతీయ స్థాయి బంగారు పతకం సాధించారు. ఈమె రాష్ట్రంలోని వేలాదిమందికి స్ఫూర్తినిస్తుందని ఆయన చెప్పారు. -
కీచకులకు కరాటే పంచ్!
బరసాత్: తనను చెరబట్టేందుకు వచ్చిన ఇద్దరు దుండగులకు 16 ఏళ్ల బాలిక గట్టిగా బుద్ధి చెప్పింది. తాను నేర్చుకున్న కరాటేతో కామాంధుల పనిపట్టింది. తోకముడిచిన కీచకులు ఆమెను వదిలేసి పారిపోయారు. పశ్చిమ బెంగాల్ లోని కోల్ కతా ఉత్తర శివారులోని మధ్యగ్రామ్ ప్రాంతంలో సోమవారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుంది. కరాటే క్లాసు నుంచి ఇంటికి తిరిగొస్తున్న బాలికను సైకిళ్లపై వచ్చిన ఇద్దరు దుండగులు అడ్డగించారు. ఆమెను బలవంతంగా లాక్కేందుకు ప్రయత్నించారు. అయితే ఆ బాలిక వారిని ధైర్యంగా ఎదుర్కొంది. తాను నేర్చుకున్న మార్షల్ ఆర్ట్స్ తో వారిని ఉతికి పారేసింది. దీంతో దుండగులు ఆమెను వదిలేసి పారిపోయారు. తమ ప్రాంతంలో లైంగిక దాడులు పెరిగిపోవడంతో ఏడాది నుంచి కరాటే నేర్చుకుంటున్నానని బాలిక తెలిపింది. ఆత్మరక్షణ కోసం అభ్యసించిన కరాటే ఆపత్కాలంలో తనకు అక్కరకొచ్చిందని చెప్పింది. కొద్ది రోజుల క్రితం తనతో పాటు స్నేహితురాలిని వేధించిన ఐదుగురిపై స్థానిక పెద్దలకు ఫిర్యాదు చేశానని వెల్లడించింది. వీరిపై ఎటువంటి చర్య తీసుకోలేదని వాపోయింది. వాళ్లే తనపై దాడికి యత్నించివుంటారని అనుమానం వ్యక్తం చేసింది. తాజా ఘటనపై పోలీసులకు బాలిక ఫిర్యాదు చేసింది. నిందితుల్లో గుర్తించామని పోలీసులు తెలిపారు. తాను కరాటే నేర్చుకుంటానంటే తన తల్లిదండ్రులు అడ్డుచెప్పారని, ఇప్పుడు వద్దనబోరనే నమ్మకాన్ని ఆ బాలిక వ్యక్తం చేసింది.