చదువు చదువు అని విసిగించడంతో తల్లి మెడకు ఉరి బిగించేసి..

Daughter Assassinated Her Mother With Karate Belt - Sakshi

కరాటే బెల్టుతో తల్లిని దారుణంగా హతమార్చిన కూతురు

కప్పిపుచ్చేందుకు ఆత్మహత్యగా చిత్రీకరణ

బెడిసి కొట్టి ఇప్పుడు జువైనల్‌ హోంలో బాలిక

ముంబైలోని ఎయిరోలీలో ఘటన

ముంబై: కుమార్తెను డాక్టర్‌ను చేద్దామని ఆ తల్లి తపనపడింది. వైద్య విద్య చదివేందుకు ప్రోత్సహించింది. అయితే ఆ కుమార్తె మాత్రం పట్టించుకోకుండా ఇష్టారీతిన వ్యవహరించింది. వైద్య విద్య ప్రవేశాలకు నిర్వహించే నీట్‌కు సిద్ధం కావాలని పుస్తకాలు.. శిక్షణ అంతా ఇస్తున్న తల్లిని ఆ బాలిక హతమార్చింది. ఈ ఘటనను కప్పిపుచ్చుతూ ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు చేసిన ప్రయత్నం బెడిసికొట్టింది. డాక్టర్‌ కావాల్సిన అమ్మాయి ఇప్పుడు జువైనల్‌ హోంలో ఉంది.

మహారాష్ట్ర నేవీ ముంబైలోని ఎయిరోలీ ప్రాంతానికి చెందిన 15 ఏళ్ల ఈ అమ్మాయి ఇటీవల పదో తరగతి పాసయ్యింది. వైద్య విద్య చదివేందుకు నీట్‌కు సిద్ధం కావాలని తల్లి (40) చెప్పగా గొడవ మొదలైంది. తరచూ చదవాలని తల్లి చెబుతుండడంతో ఆ బాలిక చిరాకు పడుతోంది. ఈ క్రమంలో జూలై 30వ తేదీన ఆ బాలిక రబౌలీ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి తన తల్లి చనిపోయిందని ఫిర్యాదు చేసింది. తన మేనమామకు ‘అమ్మ గదిలోకి వెళ్లి తలుపు వేసుకుని తీయడం లేదు’ అని చెప్పింది. దీంతో వీరిద్దరి సమాచారం మేరకు పోలీసులు ఆత్మహత్య కేసుగా నమోదు చేశారు. అయితే పోస్టుమార్టమ్‌ చేయగా ఆ కుమార్తె చేసిన దారుణం తాజాగా వెలుగులోకి వచ్చింది.

ఎప్పుడూ చదువు చదువు అని విసిగిస్తోందని బాలిక కోపం తట్టుకోలేక కరాటే బెల్ట్‌ తీసుకుని తల్లి మెడకు బిగించింది. ఆమె అపస్మారక స్థితికి చేరుకుని చివరకు ఊపిరాడక మృతి చెందింది. ఈ హత్యను కప్పి పుచ్చేందుకు మేనమామతో ఆత్మహత్యగా పేర్కొంది. హత్య బయటపడడంతో బాలికను జువైనల్‌ హోమ్‌కు తరలించినట్లు పోలీస్‌ అధికారి దినేశ్‌ పాటిల్‌ తెలిపారు. ఆ బాలిక నెలకిందట సొంత తల్లిపైనే పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. తనను తల్లి వేధిస్తుందోనని పేర్కొంది. దీంతో ఆ అమ్మాయికి పోలీసులు కౌన్సిలింగ్‌ ఇచ్చి వదిలేశారు. ఇప్పుడు ఆ అమ్మాయి ఇప్పుడు తల్లిని హత్య చేయడం పోలీసులను నివ్వెరపరిచింది. దీంతోపాటు హత్యను కప్పిపుచ్చేందుకు చేసిన డ్రామా కూడా వారిని విస్మయానికి గురి చేసింది. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top