పాక్‌ రాయబారితో మిషెల్లీ ఫొటోపై దుమారం! | Sakshi
Sakshi News home page

పాక్‌ రాయబారితో మిషెల్లీ ఫొటోపై దుమారం!

Published Tue, Aug 30 2016 7:39 PM

పాక్‌ రాయబారితో మిషెల్లీ ఫొటోపై దుమారం! - Sakshi

అమెరికాలోని పాకిస్థాన్‌ ప్రధాన రాయబారి జలిల్‌ అబ్బాస్‌ జిలానీ ఇటీవల చేసిన ఓ ట్వీట్‌ దుమారం రేపింది. అమెరికా ప్రథమ పౌరురాలు మిషెల్లీ ఒబామాతో ఆయన, ఆయన భార్య దిగిన ఫొటోను ఆయన ట్విట్టర్‌లో పెట్టడం అగ్రరాజ్యానికి ఆగ్రహం తెప్పించినట్టు కథనాలు వచ్చాయి.

'ఫ్లోటస్‌కు పాకిస్థాన్‌ హౌస్‌లో ఆతిథ్యం ఇవ్వడం చాలా ఆనందం కలిగిస్తున్నది' అంటూ గత మే నెలలో జిలానీ ట్వీట్‌ చేశాడు. మిషెల్లీతో ఆయన, ఆయన భార్య కలిసి దిగిన ఫొటోను ఈ ట్వీట్‌కు జోడించారు. అమెరికా ప్రథమ పౌరురాలిని ఆంగ్ల సంక్షిప్త అక్షరాలతో కలిపి ఫ్లోటస్‌ అని సన్నిహితులు మాత్రమే పిలుస్తారు. అధికారికంగా ఇలా పిలువడాన్ని అనుమతించారు. ఈ నేపథ్యంలో కొంతసేపటికీ ఈ ట్వీట్‌ను ఆయన తొలగించారు. అయితే, ఈ విషయంలో పాక్‌ రాయబారిని తీవ్రంగా మందలిస్తూ అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్‌ తాజాగా ఓ లేఖ ఇచ్చినట్టు కథనాలు వచ్చాయి. ఒబామా కుటుంబంతో తనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయన్న అభిప్రాయం కలిగించేందుకు ఈ ఫొటోను జిలానీ ట్వీట్‌ చేశారని, ఇది సరికాదని వైట్‌హౌస్‌ పేర్కొన్నట్టు సమాచారం. పాక్‌ రాయబారి ఇంటికి మిషెల్లీ వెళ్లడం వ్యక్తిగత అంశమని, దీని నుంచి రాజకీయ ప్రయోజనాలు ఆశిస్తే సరికాదని వైట్‌హౌస్‌ కూడా ఓ ప్రకటనలో పేర్కొంది.

ఒబామా కూతుళ్లు, పాక్‌ రాయబారి జిలానీ కొడుకు ఒకే పాఠశాలలో చదువుతుండటంతో, జిలానీ కొడుకు గ్రాడ్యుయేషన్‌ పార్టీకి మిషెల్లీ హాజరైనట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. అయితే, తమ రాయబారిని మందలిస్తూ వైట్‌హౌస్‌ లేఖ రాసిందన్న వార్తలను పాక్‌ విదేశాంగ మంత్రిత్వశాఖ తోసిపుచ్చింది. ఈ విషయంలో వైట్‌హౌస్‌ ఎలాంటి లేఖ రాయలేదని పేర్కొంది.
 

Advertisement
Advertisement