భారత్‌ టాప్‌.. పాకిస్థాన్‌ సెకండ్‌

భారత్‌ టాప్‌.. పాకిస్థాన్‌ సెకండ్‌


న్యూఢిల్లీ: టెక్నాలజీ అభివృద్ది చెందిన తర్వాత ప్రపంచం ఓ కుగ్రామంలా మారిపోయింది. సెల్‌ఫోన్‌తోనే ఎన్నో వ్యవహారాలను చక్కదిద్దుతున్నారు. ఇంటర్నెట్, సోషల్‌ మీడియా, మొబైల్‌ ఫోన్.. ఏదైనా సరైన పద్ధతిలో ఉపయోగించుకుంటేనే ప్రయోజనం ఉంటుందని, వాటికి బానిసలుగా మారినా, దుర్వినియోగం చేసినా దుష్పరిణామాలు తప్పవని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సెల్ఫీ మరణాలే ఇందుకు ఉదాహరణ అని చెబుతున్నారు.



తాజ్‌మహల్‌ లేదా ఏ చారిత్రక కట్టడం ముందో దర్జాగా సెల్ఫీ తీసుకోవచ్చు. అయితే రన్నింగ్‌ ట్రైన్‌ ముందు, గన్‌తో పోజులిస్తూ, కొండ అంచున నుంచుని సెల్ఫీ తీసుకోవాలనుకుంటే ప్రమాదం తప్పకపోవచ్చు. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా ప్రాణాలు దక్కవు. ఇలా ప్రయత్నించి మరణించిన వారు చాలా మంది ఉన్నారు. విషాదం ఏంటంటే సెల్ఫీ మరణాల్లో భారత్‌ ప్రథమ స్థానంలో ఉంది. పొరుగుదేశం పాకిస్థాన్‌ తర్వాతి స్థానంలో ఉంది.



అమెరికాకు చెందిన కార్నెగీ మెలాన్‌ యూనివర్శిటీ, ఢిల్లీలోని ఇంద్రప్రస్థ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ సెల్ఫీ మరణాలపై అధ్యయనం చేశాయి. 2014 మార్చి నుంచి ఇప్పటివరకు 127 మంది సెల్ఫీ మరణాలు సంభవించాయని గుర్తించారు. భారత్‌లో సెల్ఫీ తీసుకుంటూ 76 మంది మరణించారు. పాకిస్థాన్లో తొమ్మిదిమంది, అమెరికాలో ఎనిమిదిమంది, రష్యాలో ఆరుగురు ఇలాగే చనిపోయారు. మిగిలిన దేశాలతో పోలిస్తే భారత్‌ జనాభా ఎక్కువని, అందుకే సెల్ఫీ మరణాలు ఎక్కువ సంభవించాయని అధ్యయనం చేసిన వారు అభిప్రాయపడ్డారు. అయితే ప్రపంచంలోనే అత్యధిక జనాభా గల చైనాలో సెల్ఫీ తీసుకుంటూ చనిపోయినవారు కేవలం నలుగురేనని వెల్లడించింది.



గతవారం ఉత్తర భారతదేశంలో రన్నింగ్‌ ట్రైన్‌ ముందు నిల్చుని సెల్ఫీ దిగేందుకు ప్రయత్నించిన ముగ్గురు విద్యార్థులు దుర్మరణం చెందారు. అలాగే పడవలో సెల్ఫీ తీసుకునేందుకు ప్రయత్నించి మరణించినవారు ఉన్నారు. ప్రమాదకర పరిస్థితుల్లో సెల్పీలు తీసుకోవడానికి యువత మోజు పడుతుండటమే ప్రమాదాలకు కారణమని అధ్యయనంలో తేలింది.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top