
ఎల్‌పీజీ, కిరోసిన్ ధరల పెంపు నిలుపుదల
ఎల్‌పీజీ, కిరోసిన్ ధరలను పెంచుతూ తీసుకున్న నిర్ణయాన్ని తాత్కాలికంగా నిలిపేయాలని కేంద్రం బుధవారం నిర్ణయించింది.
న్యూఢిల్లీ: ఎల్‌పీజీ, కిరోసిన్ ధరలను పెంచుతూ తీసుకున్న నిర్ణయాన్ని తాత్కాలికంగా నిలిపేయాలని కేంద్రం బుధవారం నిర్ణయించింది. కర్ణాటక, మధ్యప్రదేశ్, కేరళ వంటి రాష్ట్రాల్లో స్థానిక లెవీల కారణంగా ఇంధన ధరలు పెరగడంతో ప్రజలపై ఒకేసారి ఎక్కువ భారం పడకుండా ఈ నిర్ణయం తీసుకుంది. ప్రవేశ పన్ను, ఆక్ట్రాయ్ వంటి లెవీలు పెరగడంతో కేరళలో ఎల్‌పీజీ సిలిండరు రూ.4.50 మేర, కర్ణాటకలో రూ.3, మధ్యప్రదేశ్‌లో రూ.4.50, యూపీలో రూ.1 చొప్పున పెరిగింది.
హర్యానా, ఉత్తరప్రదేశ్‌లలో కిరోసిన్ ధర 2 పైసలు, 8 పైసల చొప్పున పెరిగింది. మరోవైపు రాష్ట్ర పన్నులు తగ్గడంతో అస్సాంలో సిలిండర్ ధర రూ.9.50, బీహార్‌లో రూ.1.50, మహారాష్ట్రలో రూ.3 మేర తగ్గింది. నవీ ముంబై, మహారాష్ట్రలలో కిరోసిన్ ధరలో లీటరుకు 11 పైసల నుంచి రూ.1.32 దాకా తగ్గుదల కనిపించింది. ఈ నేపథ్యంలో వివిధ రాష్ట్రాల్లో స్థానిక పన్నుల అంశంపై రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చించి ఒక నిర్ణయానికి వచ్చే వరకు పెంపును నిలుపుదల చేయాలని చమురు శాఖ ఆదేశాలు జారీచేసింది.