breaking news
octroi
-
ఎల్పీజీ, కిరోసిన్ ధరల పెంపు నిలుపుదల
న్యూఢిల్లీ: ఎల్పీజీ, కిరోసిన్ ధరలను పెంచుతూ తీసుకున్న నిర్ణయాన్ని తాత్కాలికంగా నిలిపేయాలని కేంద్రం బుధవారం నిర్ణయించింది. కర్ణాటక, మధ్యప్రదేశ్, కేరళ వంటి రాష్ట్రాల్లో స్థానిక లెవీల కారణంగా ఇంధన ధరలు పెరగడంతో ప్రజలపై ఒకేసారి ఎక్కువ భారం పడకుండా ఈ నిర్ణయం తీసుకుంది. ప్రవేశ పన్ను, ఆక్ట్రాయ్ వంటి లెవీలు పెరగడంతో కేరళలో ఎల్పీజీ సిలిండరు రూ.4.50 మేర, కర్ణాటకలో రూ.3, మధ్యప్రదేశ్‌లో రూ.4.50, యూపీలో రూ.1 చొప్పున పెరిగింది. హర్యానా, ఉత్తరప్రదేశ్‌లలో కిరోసిన్ ధర 2 పైసలు, 8 పైసల చొప్పున పెరిగింది. మరోవైపు రాష్ట్ర పన్నులు తగ్గడంతో అస్సాంలో సిలిండర్ ధర రూ.9.50, బీహార్‌లో రూ.1.50, మహారాష్ట్రలో రూ.3 మేర తగ్గింది. నవీ ముంబై, మహారాష్ట్రలలో కిరోసిన్ ధరలో లీటరుకు 11 పైసల నుంచి రూ.1.32 దాకా తగ్గుదల కనిపించింది. ఈ నేపథ్యంలో వివిధ రాష్ట్రాల్లో స్థానిక పన్నుల అంశంపై రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చించి ఒక నిర్ణయానికి వచ్చే వరకు పెంపును నిలుపుదల చేయాలని చమురు శాఖ ఆదేశాలు జారీచేసింది. -
భారీగా ఆక్ట్రాయ్ ఎగవేత
సాక్షి, ముంబై: చాలా మంది వ్యాపారులు ఆక్ట్రాయ్ (రవాణాసుంకం) ఎగ్గొట్టడానికి ప్రయత్నిస్తుండడంతో బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) అప్రమత్తమయింది. అలాంటి వ్యాపారస్తులను గుర్తించడానికి ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన బీఎంసీ దాదాపు కోటి రూపాయలు వసూలు చేసింది. కొంతమంది వ్యాపారులు ఆక్ట్రాయ్‌ను ఎగ్గొట్టేందుకు వస్తువులను రైళ్ల ద్వారా తరలిస్తున్నారు. రవాణాభారం కూడా తక్కువ కావడంతో చాలా మంది ఇదే దారిని ఎంచుకున్నారు. బీఎంసీ ఆక్ట్రాయ్ విభాగం అధికారులతో కూడిన మూడు బృందాలు మూడు రైల్వే లైన్ల వద్ద వీరిపై నిఘా ఉంచాయి. అంతేగాక ఈ వ్యాపారులు పెద్ద కాటన్ డబ్బాల్లో కాకుండా చిన్న ప్లాస్టిక్ సంచుల్లో వస్తువులను తరలిస్తూ ఆక్ట్రాయ్‌ను ఎగ్గొడుతున్నారని అధికారి ఒకరు తెలిపారు. అక్రమంగా గుట్కాలు తరలిస్తున్న వారిపై చర్యలు తీసుకోని ఇద్దరు అక్ట్రాయ్ ఇన్స్పెక్టర్లను గవర్నమెంట్ రైల్వే పోలీసులు (జీఆర్పీ) గతవారం అరెస్టు చేశారు. నిషేధించిన పాన్‌మసాలాను కిలోకు రూ.450 నుంచి రూ.500 వరకు అమ్ముతున్నారు. ఆక్ట్రాయ్‌ను చెల్లించకుండా ప్రతి నెలా లక్షకు పైగా ప్యాకెట్లను తరలిస్తున్నారు. దీంతో కార్పొరేషన్‌కు రూ.6.5 కోట్ల మేర నష్టం వాటిల్లుతోంది. దీంతో బీఎంసీ వెస్టర్న్, సెంట్రల్, హార్బర్లైన్లలో ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నది. ఈ స్టేషన్లలో దాదాపు 17 మంది అధికారులతో బృందాలు ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నాయి. ఒక్కో రోజు ఒక్కో ప్రదేశంలో తనిఖీలు నిర్వహిస్తున్నామని సీనియన్ విజిలెన్స్ అధికారి ఒకరు తెలిపారు. ప్రతిచిన్న ప్లాస్టిక్ బ్యాగును కూడా తనిఖీ చేస్తున్నామని పేర్కొన్నారు. ఫలితంగా వ్యాపారులు ఆక్ట్రాయ్ ఎగ్గొట్టడం సాధ్యం కాదని ఆక్ట్రాయ్ విభాగానికి చెందిన సీనియర్ విజిలెన్స్ అధికారి ఒకరు తెలిపారు. ఇదిలా వుండగా వెస్టర్న్రైల్వేలో రైళ్ల ద్వారా వస్తువులను తరలిస్తున్న వారి నుంచి దాదాపు రూ.60 లక్షలకుపైగా వసూలు చేశామని, మిగితాది సెంట్రల్, హర్బర్ మార్గాల్లో వసూలు చేశామని బీఎంసీ వర్గాలు తెలిపాయి. అయితే ఈ సీజ్ చేసిన వస్తువుల్లో ఇమిటేషన్ ఆభరణాలు, ఎలక్ట్రికల్ అలంకరణ వస్తువులు, టవల్స్, దుస్తుల వంటివి ఉన్నాయి. వీటిని దీపావళి విక్రయాల కోసం తరలిస్తున్నట్లు సీనియర్ ఆక్ట్రాయ్ అధికారి ఒకరు తెలిపారు. ఈ వస్తువులను బోరివలి, దాదర్, గ్రాంట్రోడ్డు, చర్నిరోడ్డు, మెరైన్లైన్, కుర్లా, ఘాట్కోపర్, కుర్లా, విక్రోలి, చెంబూరు, మాన్‌ఖుర్ద్, వడాలా స్టేషన్లలో జప్తు చేశామని పేర్కొన్నారు.