
చెత్త ఫీల్డింగ్ వల్లే ఓడిపోయాం: వాపోయిన కెప్టెన్
చెత్త ఫీల్డింగ్ వల్లే ఈ బాధాకరమైన ఓటమి ఎదురైందని మ్యాచ్ ఆవేదన వ్యక్తం చేశాడు...
ముంబై: ప్రస్తుత ఐపీఎల్‌లో తాము ఆడిన మొదటి మ్యాచ్‌లో పది వికెట్ల తేడాతో గుజరాత్ లయన్స్‌పై గెలుపొంది జోష్ మీద ఉన్న కోల్‌కతా నైట్ రైడర్స్‌కు ముంబై ఇండియన్స్ దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. ఆదివారం రాత్రి వాంఖడే స్టేడియంలో జరిగిన జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో కోల్‌కతాపై నాలుగు వికెట్ల తేడాతో ముంబై జట్టు థ్రిల్లింగ్ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో ఓటమితో కంగుతిన్న నైట్ రైడర్స్ కెప్టెన్ గౌతం గంభీర్.. చెత్త ఫీల్డింగ్ వల్లే ఈ బాధాకరమైన ఓటమి ఎదురైందని మ్యాచ్ అనంతరం ఆవేదన వ్యక్తం చేశాడు.
‘హార్థిక్ పాండ్యా ఇచ్చిన క్యాచ్ ను పట్టుకొని ఉంటే.. మ్యాచ్ గతి మారిపోయి ఉండేది. మా బౌలర్లు చక్కగానే బౌలింగ్ చేశారు. క్రిస్ వోక్స్, ట్రెంట్ బౌల్ట్ అనుభవజ్ఞులైన బౌలర్లు కూడా. మేం ఇంకాస్తా నింపాదిగా ప్రశాంతంగా ఉండాల్సింది. చివర్లో క్యాచ్ వదిలేయడం, మిస్ ఫీల్డిండ్ వల్ల మేం కొంత భయానికి లోనయ్యాం’ అని చెప్పారు. ముంబై ఆటగాళ్లు హార్థిక్ పాండ్యా, నితీశ్ రాణా అద్భుతంగా ఆడి.. మ్యాచ్‌ను తమవైపు తిప్పుకున్నారని గంభీర్ ప్రశంసల జల్లు కురిపించాడు.
నితీశ్ రాణా (29 బంతుల్లో 50; 5 ఫోర్లు, 3 సిక్సర్లు) హార్దిక్ పాండ్యా (11 బంతుల్లో 29 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) తుఫాన్ ఇన్నింగ్స్‌తో చెలరేగడంతో సొంతగడ్డపై ముంబై ఇండియన్స్ అద్భుతంగా బోణీ చేసింది. చివరి 18 బంతుల్లో 49 పరుగులు చేయాల్సిన దశలో ఈ జోడి బౌండరీల వర్షంతో కోల్‌కతాను వణికించింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లకు 178 పరుగులు చేసింది. మనీశ్ పాండే (47 బంతుల్లో 81 నాటౌట్; 5 ఫోర్లు, 5 సిక్సర్లు) కదంతొక్కాడు. 179 పరుగుల లక్ష్య ఛేదనకు బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ 19.5 ఓవర్లలో ఆరు వికెట్లకు 180 పరుగులు చేసి నెగ్గింది.
ఏడో ఓవర్ తర్వాత వరుసగా మూడు ఓవర్లలో పార్థివ్ (30; 3 ఫోర్లు, 1 సిక్స్), బట్లర్ (28; 1 ఫోర్, 2 సిక్సర్లు), కెప్టెన్ రోహిత్ (2) వికెట్లు కోల్పోవడంతో ముంబై ఇబ్బందుల్లో పడింది. అయితే నితీశ్ రాణా మాత్రం ఎలాంటి ఒత్తిడి లేకుండా ఆడాడు. చివరి మూడు ఓవర్లలో నితీశ్ రాణా బౌండరీలతో చెలరేగాడు. నితీశ్ 19వ ఓవర్‌లో వెనుదిరగడంతో ఆందోళన నెలకొంది. అయితే చివరి ఓవర్‌లో హార్దిక్ పాండ్యా మెరవడంతో మరో బంతి మిగిలి ఉండగానే ముంబై విజయం సాధించింది.