Sakshi News home page

అమ్మకానికి ఐడీపీఎల్ భూములు!

Published Mon, Jun 1 2015 4:34 AM

అమ్మకానికి ఐడీపీఎల్ భూములు!

న్యూఢిల్లీ: హైదరాబాద్‌కు చెందిన ఇండియన్ డ్రగ్స్ అండ్ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్(ఐడీపీఎల్) వద్ద నిరుపయోగంగా ఉన్న భూములను విక్రయించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఐడీపీఎల్‌తో పాటు ప్రభుత్వ రంగ ఫార్మా కంపెనీలకు చెందిన నిరుపయోగ భూమిని విక్రయించాలనే యోచన ఉందని ప్రభుత్వ ఉన్నతాధికారొకరు చెప్పారు. బెంగాల్ కెమికల్స్ అండ్ ఫార్మాస్యూటికల్స్(బీసీపీఎల్), హిందూస్తాన్ యాంటిబయాటిక్స్(హెచ్‌ఏఎల్), హిందూస్తాన్ ఆర్గానిక్ కెమికల్స్(హెచ్‌ఓసీఎల్) తదితర కంపెనీలకు ముంబై, పుణే, తదితర ప్రధాన నగరాల్లో వేల కోట్ల విలువ చేసే  భూములు నిరుపయోగంగా ఉన్నాయని వివరించారు.
 
 ఈ భూముల విక్రయంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని, విక్రయించాలనే అభిప్రాయం ప్రాథమికంగా వ్యక్తం అయిందని పేర్కొన్నారు. ఐడీపీఎల్‌కు హైదరాబాద్, గుర్గావ్, హరిద్వార్‌ల్లో, బీసీపీఎల్‌కు కోల్‌కతా, ముంబై, కాన్పూర్‌లలో హెచ్‌ఏఎల్‌కు పుణే లో, హెచ్‌ఓసీఎల్‌కు మహారాష్ట్ర, కేరళల్లో భూములున్నాయన్నారు. డిజిన్వెస్ట్‌మెంట్‌కు సమస్యల నేపథ్యంలో వాటా విక్రయం ద్వారా కాకుండా ఇతర మార్గాల ద్వారా నిధులు సమీకరించాలని యోచిస్తోందని, దీంట్లో భాగంగానే ఈ భూ ముల విక్రయం తెరపైకి వచ్చిందని సమాచారం.
 

Advertisement
Advertisement