కరువు కాటేస్తోంది | drought problems with farmers | Sakshi
Sakshi News home page

కరువు కాటేస్తోంది

Dec 10 2015 5:01 AM | Updated on Oct 1 2018 2:09 PM

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఎదుర్కొంటున్న కరువు పరిస్థితులను రెండు రాష్ట్రాల ఎంపీలు కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు.

* రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు
* కేంద్ర ప్రభుత్వం ఆదుకోవాలి
* లోక్‌సభలో కరువుపై చర్చలో వైఎస్సార్‌సీపీ, టీడీపీ, టీఆర్‌ఎస్ ఎంపీల వినతి

సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఎదుర్కొంటున్న కరువు పరిస్థితులను రెండు రాష్ట్రాల ఎంపీలు కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు. ‘దేశంలోని విభిన్న ప్రాంతాల్లో నెలకొన్న కరువు పరిస్థితులు’ అన్న అంశంపై 193వ నిబంధన కింద బుధవారం లోక్‌సభలో జరిగిన స్వల్పకాలిక చర్చలో రెండు తెలుగు రాష్ట్రాల ఎంపీలు ప్రసంగించారు.

వైఎస్సార్‌సీపీ ఎంపీ బుట్టా రేణుక, టీడీపీ ఎంపీ నిమ్మల కిష్టప్ప, టీఆర్‌ఎస్ ఎంపీ బీబీ పాటిల్ మాట్లాడారు. కరువు ధాటికి పల్లెలు వలస బాట పడుతున్నాయని ఆందోళన వ్యక్తంచేశారు.
 
ప్రతి బాధితుడికి సాయం అందాలి: బుట్టా రేణుక
‘‘నేను ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం నిత్యం కరువు బారిన పడే ప్రాంతం. దీంతో ప్రజలంతా ఉపాధి కోసం వలస వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. కరువును తట్టుకోలేక రైతులు, రైతు కూలీలు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.

కరువు ప్రభావం పరిశ్రమలు, వాణిజ్యం, ఎగుమతులపై పడుతోంది. స్టాక్‌మార్కెట్లను కూడా ప్రభావితం చేస్తోంది. తెలంగాణలోని 443 మండలాల్లో 231 మండలాలు తీవ్రమైన కరువును ఎదుర్కొంటున్నాయి. ఏపీలోని 670 మండలాల్లో 196 మండలాల్లో తీవ్ర కరువు నెలకొంది. రాయలసీమలోని నాలుగు జిల్లాలు ఏటా ఇవే పరిస్థితిని కొనసాగుతున్నాయి.

ప్రభుత్వం ఆదుకోకపోవడంతో బాధిత రైతులు అప్పులు ఊబిలో కూరుకుపోతున్నారు. కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని ఒక అత్యున్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేయాలి. మెరుగైన పరిహార పథకాలను అధ్యయనం చేయాలి. ప్రతి బాధితుడికి సాయం అందేలా చూడాలి’’ అని కర్నూలు ఎంపీ బుట్టా రేణుక విజ్ఞప్తి చేశారు.
 
కరువుతోనే కాపురం: నిమ్మల కిష్టప్ప
‘‘అనంతపురం జిల్లా రైతులు కరువుతో కాపురం చేస్తున్నారు. 20 లక్షల ఎకరాల్లో పంటలు వేయాల్సి ఉండగా 4 లక్షల ఎకరాల్లోనే వేశారు. పంటలు వేయకపోతే దేశానికి అరిష్టం. కరువు బారిన పడినవారికి ప్రభుత్వాలు భరోసా ఇవ్వలేకపోతున్నాయి. రాయలసీమ జిల్లాలు జిల్లా తీవ్ర కరువును ఎదుర్కొంటున్నాయి.

నదుల అనుసంధానానికి కేంద్ర ప్రభుత్వం ఇతోధికంగా నిధులు ఇవ్వాలి. గతంలో యూపీఏ ప్రభుత్వం వాతావరణ బీమా అనే పథకం తెచ్చింది. దీని వల్ల ఒరిగిందేమీ లేదు. దీనిలో మార్పులు చేయాలి. ఎంతైతే నష్టం జరుగుతుందో ఆ మేరకు పరిహారం ఇవ్వాలి’’ అని ఎంపీ నిమ్మల కిష్టప్ప డిమాండ్ చేశారు.
 
పల్లెలు వలసబాట పడుతున్నాయ్: బీబీ పాటిల్
‘తెలంగాణలో 231 మండలాలు కరువు బారిన పడ్డాయి. తాగడానికి నీళ్లు లేవు. తినడానికి తిండి లేదు. పశువులకు మేత లేదు. బావులు ఎండిపోయాయి. పల్లెలు వలసబాట పడుతున్నాయి. రైతులు తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు. వర్షాలు పడకపోవడంతో 12.23 లక్షల హెక్టార్లలో పంట నష్టపోయాం. 12.48 లక్షల మెట్రిక్ టన్నుల పంట ఉత్పత్తులను నష్టపోయాం.

20.91 లక్షల మంది రైతులు కరువు బారిన పడి నష్టపోయారు. మహబూబ్‌నగర్, మెదక్, కరీంనగర్, రంగారెడ్డి, నల్గొండ, వరంగల్, ఆదిలాబాద్ జిల్లాలు కరువు ధాటికి విలవిల్లాడుతున్నాయి. కరువు వల్ల ఉపాధి కోల్పోయిన బాధితులను ఆదుకోవడానికి రూ.2,514 కోట్లు అవసరం. కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని ఆర్థిక సాయం అందజేయాలి’’ అని ఎంపీ బీబీ పాటిల్ కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement