కేంద్రం తమకు వరద సహాయంగా రూ.5000 కోట్లను ఇవ్వాలని తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ప్రధానికి విన్నవించారు.
చెన్నై: కేంద్రం తమకు వరద సహాయంగా రూ.5000 కోట్లను ఇవ్వాలని తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ప్రధానికి విన్నవించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో గురువారం ఆమె ఏరియల్ సర్వే నిర్వహించారు. అనంతరం ఆమె మంత్రులు, అధికారులతో సమావేశమై వరద బీభత్సానికి గురైన చెన్నైతో పాటు ఇతర జిల్లాల్లో సహాయక చర్యలను ముమ్మరం చేయాలని ఆదేశించారు. పన్నీర్ సెల్వంతో పాటు ఇతర మంత్రులకు వివిధ జిల్లాల్లో సహాయక చర్యల బాధ్యతలను అప్పగించారు. చెన్నైతో పాటు వరద ప్రభావానికి గురైన తిరువళ్లూరు, కాంచీపురం, కడలూరు జిల్లాల్లో ఏర్పాటు చేసిన 460 పునరావాస కేంద్రాల్లో మొత్తం 1.64 లక్షల మంది ఆశ్రయం పొందుతున్నట్లు జయలలిత ఓ ప్రకటనలో వెల్లడించారు.
అలాగే బాధితులకు 41 లక్షల ఆహార ప్యాకెట్లను అందించినట్లు తెలిపారు. అపార్టుమెంట్ల నుంచి బయటకు రాలేకపోతున్న వారికి బోట్ల ద్వారా ఆహారం, మంచినీరు అందిస్తున్నట్లు చెప్పారు. వరద బాధిత ప్రాంతాల్లో నీరు తగ్గుముఖం పట్టగానే విద్యుత్ పునరుద్ధరిస్తామని తెలిపారు.