రక్తదానం వల్ల ఆరోగ్యానికి ప్రమాదం ఉండదని వైద్య నిపుణులు అవగాహన కల్పిస్తున్నా.. ఇప్పటికీ చాలామంది భయపడుతుంటారు.
లండన్ : రక్తదానం వల్ల ఆరోగ్యానికి ప్రమాదం ఉండదని వైద్య నిపుణులు అవగాహన కల్పిస్తున్నా.. ఇప్పటికీ చాలామంది భయపడుతుంటారు. అయితే రక్తదానంతో ఆరోగ్యం పాడవదు సరికదా.. గుండెకు కూడా మేలు చేస్తుందంటున్నారు ఆస్ట్రియాలోని యూనివర్సిటీ ఆఫ్ ఇన్స్‌బ్రక్ శాస్త్రవేత్తలు. శరీరంలో జీవగడియారం ప్రభావితం అయ్యేలా రాత్రిపూట విధులు నిర్వర్తించేవారికి, విమానాల్లో ప్రయాణిస్తూ గంటల వ్యవధిలోనే రాత్రి నుంచి పగలుకు, పగటి నుంచి రాత్రి పరిస్థితులకు మారిపోయి ‘జెట్‌లాగ్’ సమస్యకు గురయ్యేవారికి రక్తదానం ఎంతో మేలు చేస్తుందని వారు చెబుతున్నారు. షిఫ్టుల్లో విధులు నిర్వర్తించేవారికి గుండెజబ్బుల ముప్పు 30 శాతం ఎక్కువగా ఉంటుందని, వారు రక్తదానం చేస్తే పాత ఎర్ర రక్తకణాల స్థానంలో కొత్త కణాలు ఏర్పడి గుండె జబ్బుల ముప్పు తగ్గుతుందని అంటున్నారు.
మనుషుల మాదిరిగానే పగటిపూట క్రియాశీలంగా ఉండే జీబ్రా చేపల్లో కనబడే జెట్ లాగ్ సమస్యపై వీరు అధ్యయనం చేయగా.. ఎక్కువ వయస్సున్న ఎర్ర రక్తకణాల సంఖ్య పెరిగి అవి రక్తనాళాల్లో పోగుపడుతున్నట్లు తేలిందట. అలాగే ఆ చేపలకు ఆక్సిజన్ తక్కువగా అందేలా చేయడంతో వాటిలో కొత్త ఎర్ర రక్తకణాల ఉత్పత్తి పెరిగిందట. అందువల్ల రక్తదానం చేస్తే కొత్త రక్తకణాలు ఉత్పత్తి అయి గుండెజబ్బుల ముప్పు తగ్గుతుందని వీరు చెబుతున్నారు.