అసెంబ్లీ మీడియా పాయింట్ | Assembly Media Point | Sakshi
Sakshi News home page

అసెంబ్లీ మీడియా పాయింట్

Oct 2 2015 1:05 AM | Updated on Oct 1 2018 2:36 PM

రైతుల ఆత్మహత్యలపై ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు...

సమస్య తీవ్రతపై సీఎం నిర్లక్ష్యం
రైతుల ఆత్మహత్యలపై ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. సమస్యను దాటవేస్తూ రైతాంగాన్ని కించపరుస్తున్నారు. ఏకమొత్తంగా రుణమాఫీ వర్తింపజేయడంతోపాటు, వ్యవసాయ సంక్షోభం, ఆత్మహత్యల నివారణ, గిట్టుబాటు ధరల కల్పన, బ్యాంకర్ల ద్వారా కొత్త రుణాలిప్పించేందుకు చర్యలు తీసుకోవాలి. దీర్ఘకాలిక రుణాలపై వడ్డీ మాఫీ చేయాలి. నిజాంషుగర్ ఫ్యాక్టరీని ప్రభుత్వమే టేకోవర్ చేసి రైతులకు బకాయిలు చెల్లించాలి.     
- టి.జీవన్‌రెడ్డి, సీఎల్పీ ఉపనేత
 
గ్రామసభల ద్వారా ఆత్మహత్యల నిర్ధారణ
ఆత్మహత్య చేసుకున్న రైతుల సంఖ్యను గ్రామసభల ద్వారా నిర్ధారించాలి. రైతుల సమస్యలను చర్చించకుండానే సభను అర్ధంతరంగా వాయిదా వేయడం అన్యాయం. ప్రభుత్వం ఏడాదిన్నరగా బాధ్యతను విస్మరించడంతోనే 1,300 మందికి పైగా రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. రుణమాఫీ చేసే వరకు మా పోరాటం ఆగదు.
- రవీంద్రకుమార్, సీపీఐ శాసనసభాపక్ష నేత
 
ఎన్‌కౌంటర్‌పై న్యాయవిచారణ జరపాలి
వరంగల్ జిల్లా తాడ్వాయిలో జరిగిన శ్రుతి, సాగర్‌ల బూటకపు ఎన్‌కౌంటర్‌పై న్యాయవిచారణ జరిపించాలి. చిత్రవధ చేసి హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలి. అసెంబ్లీ ముట్టడికి బయలుదేరిన ప్రజాసంఘాల నేతలను,మేధావులను బలవంతంగా అరెస్టు చేసి గృహనిర్బంధం చేయడం దారుణం.       
- సున్నం రాజయ్య, సీపీఎం
 
కార్మికులను విధుల్లోకి తీసుకోవాలి

సమ్మె సందర్భంగా విధుల్లో నుంచి తొలగించిన 1200 మంది జీహెచ్‌ఎంసీ పారిశుద్ధ్య కార్మికులను తక్షణం విధుల్లోకి తీసుకోవాలి. జీతాలు పెంచి పొట్ట నింపమని ఆందోళన చేస్తే వారి పొట్టకొట్టడం దారుణం. పిచ్చుకపై బ్రహ్మాస్త్రం సంధించడం న్యాయం కాదు. బంగారు తెలంగాణలో కార్మికుల భవిష్యత్‌ను అంధకారం చేయొద్దు.
- డాక్టర్ లక్ష్మణ్, బీజేపీ శాసనసభాపక్ష నేత
 
రుణమాఫీ జరిగే వరకు పోరాటం
వందశాతం రుణమాఫీ జరిగే వరకు మా పోరాటం ఆగదు. రైతుల ఆత్మహత్యలు ఆగాలంటే తక్షణం పూర్తిగా రుణాలు మాఫీ చేయాలి. ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన అంశాలను అమలుచేయాలి. ఇచ్చినమాట నిలపుకోకుండా ప్రభుత్వం అర్ధంతరంగా సభను వాయిదా వేయడం దారుణం.
- రామ్మోహన్‌రెడ్డి, కాంగ్రెస్ ఎమ్మెల్యే
 

రీ డిజైన్‌పై కలర్ సినిమా చూపిస్తాం
-ఇరిగేషన్ ప్రాజెక్టుల రీ డిజైన్‌పై ప్రతిపక్ష సభ్యులకు శాసనసభలోనే రెండు గంటల పాటు సీఎం కేసీఆర్ కలర్ సినిమా చూపిస్తారు. ఎందుకు డిజైన్ మార్చాల్సి వచ్చిందో విశదీకరించి చెబుతారు. రైతుల ఆత్మహత్యకు గత ఇరవై ఏళ్ల ఆర్థిక పరిస్థితే కారణం. రుణమాఫీపై సీఎం స్పష్టమైన సమాధానం ఇచ్చినా ప్రతిపక్షాల సభ్యులు విచిత్రంగా ప్రవర్తిస్తున్నారు. విద్యుత్ సంక్షోభానికి గత పాలకులే కారణం.     
-  జీవన్‌రెడ్డి, టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే
 
ఏకమొత్తంలో రుణమాఫీ చేయాలి

రైతులందరికీ వన్‌టైమ్ సెటిల్‌మెంట్ కింద ఒకేసారి రుణమాఫీ చేయాలి. ప్రభుత్వం ఈ విషయంలో అనవసర కాలయాపన చేయడంతో 1400 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. రైతుల సంక్షేమంపై ప్రభుత్వానికి చిత్తశుద్ధిలేదు.రుణమాఫీ,కరువు ప్రాంతాలను ప్రకటించే  విషయంలో సర్కారు వైఫల్యం చెందింది.పంటల భీమా పథకం రైతులకు ఉపయోగపడడంలేదు. సభలో రైతుల సమస్యలపై చర్చించేందుకు అవకాశం ఇవ్వకుండా అర్ధంతరంగా వాయిదా వేశారు.
-  పాయం వెంకటేశ్వర్లు, వైఎస్సార్సీపీ పక్షనేత

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement