శశికళ కూడా నామినేషన్‌ వేయలేదు! | AIADMK to elect general secretary tomorrow | Sakshi
Sakshi News home page

శశికళ కూడా నామినేషన్‌ వేయలేదు!

Dec 28 2016 7:47 PM | Updated on Sep 4 2017 11:49 PM

శశికళ కూడా నామినేషన్‌ వేయలేదు!

శశికళ కూడా నామినేషన్‌ వేయలేదు!

జయ మరణం తర్వాత పార్టీలో శశికళ స్థానం ఏమిటనేది మరికొన్ని గంటల్లో తేలిపోనుంది.

చెన్నై: జయలలిత మరణం తర్వాత ఆల్‌ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం(ఏఐఏడీఎంకే) పార్టీ పగ్గాలు ఎవరు చేపట్టబోయేది మరికొద్ది గంటల్లో తేలిపోనుంది. పార్టీ ప్రధాన కార్యాలయంలో రేపు(గురువారం) జరగబోయే కీలక సమావేశంలో జనరల్‌ సెక్రటరీని ఎన్నుకుంటామని ఏఐఏడీఎంకే అధికార ప్రతినిధి సి.పొన్నయ్యన్‌ బుధవారం మీడియాకు తెలిపారు. జనరల్‌ సెక్రటరీ పదవికి సంబంధించి ఇప్పటివరకు శశికళ సహా ఏ ఒక్కరూ నామినేషన్‌ దాఖలు చేయలేదని ఆయన పేర్కొన్నారు.

శశికళను పార్టీ జనరల్‌ సెక్రటరీగా కాకుండా ఏకంగా ముఖ్యమంత్రిగానే ఎన్నుకోబోతున్నారన్న వార్తలపై పొన్నయ్యన్‌ ఆచితూచి స్పందించారు. సీఎం మార్పునకు సంబంధించి మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానం దాటవేశారు. 'రేపటి సమావేశం జనరల్‌ సెక్రటరీ ఎన్నిక కోసం మాత్రమే'అని వ్యాఖ్యానించారు. దివంగత జయకు ఆప్తురాలైన శశికళా నటరాజనే పార్టీ పగ్గాలు చేపడతారని కొంతకాలంగా ప్రచారం జరుగుతున్నా, అధికారికంగా నిర్వహించబోయే ఎన్నిక ప్రక్రియలో ఏం జరగబోతుందనే దానిపై ఇప్పుడు సర్వత్రా ఆసక్తి నెలకొంది. బుధవారం ఏఐఏడీఎంకే ఆఫీసు వద్ద చోటుచేసుకున్న ఉద్రిక్త పరిణామాలు ఆ ఆసక్తిని రెట్టింపు చేసేలా ఉన్నాయి.

ఏఐఏడీఎంకే బహిషృత ఎంపీ శశికళా పుష్ప పార్టీ జనరల్‌ సెక్రటరీ పదవికి పోటీచేస్తానని ఇదివరకే ప్రకటించినట్లు.. బుధవారం తన లాయర్‌ ద్వారా నామినేషన్‌ వేసే ప్రయత్నం చేశారు. కానీ శశికళా నటరాజన్‌ వర్గీయులు.. శశికళా పుష్ప లాయర్‌ను అడ్డుకుని చితకబాదారు. అంతటితో ఆగకుండా కారులో కూర్చున్న శశికళా పుష్ప భర్తను, అతని వెంట వచ్చినవారిపైనా దాడి చేశారు. ఈ గలాటా కారణంగా పార్టీ ఆఫీసు వద్ద కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. కాగా, గురువారం జరగబోయే సమావేశానికి ఎంపీ శశికళా పుష్ప స్వయంగా హాజరవుతారని సమాచారం. అయితే పార్టీ నుంచి బహిష్కృతురాలైన ఆమెను కార్యాలయంలోనికి అనుమతించకుండదని ఇప్పటికే ఆదేశాలు జారీ అయ్యాయి. సమావేశం ప్రారంభానికి కొద్ది నిమిషాల ముందు నామినేషన్‌ తంతును నిర్వహించి, శశికళను పార్టీ చీఫ్‌గా ఎన్నుకోనున్నట్లు సమాచారం. (శశికళ పుష్ప లాయర్‌ను చితక్కొట్టారు)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement