చత్తీస్గఢ్ లో 67 శాతం పోలింగ్ నమోదైంది.
రాయ్పూర్: చత్తీస్గఢ్ లో 67 శాతం పోలింగ్ నమోదైంది. 18 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటింగ్ ను బహిష్కరించాలని నక్సల్స్ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో పోలింగ్ శాతం తగ్గవచ్చనే అనుమానాలు రేకెత్తాయి. కాగా, ప్రజలు మాత్రం భారీ సంఖ్యలో ఓటింగ్ లో పాల్గొని ఓటు హక్కును వినియోగించుకున్నారు. నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో 70శాతం పోలింగ్ జరిగినట్లు ఎలక్షన్ కమీషన్ తెలిపింది. ఈ మేరకు జాయింట్ ఎన్నికల అధికారి డి.డి.సింగ్ ఓ ప్రకటన విడుదల చేశారు. చత్తీస్గఢ్ జిల్లాలోని బస్తార్, రాజ్నంద్గావ్ గ్రామాల్లో నక్సల్స్ ప్రాబల్యం అధికంగా ఉన్నాఅధిక సంఖ్యలో ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారన్నారు.
ఇదిలా ఉండగా తొలివిడత పోలింగ్ మొదలైన కొన్నిగంటలకే మావోయిస్టులు దాడి చేసి పోలింగ్ స్టేషన్లు చేయడానికి యత్నించారు. నయనార్ గ్రామంలో పోలింగ్ జరుగుతుండగా మావోయిస్టులు పేట్రేగిపోయారు. ఒక్క ఉదుటున దూసుకొచ్చిన మావోలు పోలింగ్ సిబ్బందిపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో మృతి చెందిన జవాను186 బెటాలియన్ చెందినవాడని పోలీస్ ఉన్నతాధికారి తెలిపారు.