అక్రమంగా ఎంజాయ్‌ | Land Scams By TDP Leaders And Revenue Officers | Sakshi
Sakshi News home page

అక్రమంగా ఎంజాయ్‌

Jun 14 2019 9:00 AM | Updated on Jun 14 2019 9:02 AM

Land Scams By TDP Leaders And Revenue Officers - Sakshi

తిరుపతి సబ్‌ కలెక్టర్‌ కార్యాలయంలో ఫైళ్లను తనిఖీ చేస్తున్న అధికారులు

భూరాబందులకు కొందరు అధికారులు అనుభవ ధ్రువీకరణ పత్రాలు ఇచ్చేశారు. ఆ తరువాత అమ్మి సొమ్ముచేసుకున్నారు. వాటిని రిజిస్ట్రేషన్‌ కూడా చేయించారు. కొన్నాళ్లకు వాటికి పట్టాలు ఇచ్చారు. రేణిగుంట మండల పరిధిలో రెవెన్యూ అధికారులు, టీడీపీ నాయకులు కుమ్మక్కై చేసిన అక్రమాలు ఒక్కొక్కటి వెలుగుచూస్తున్నాయి. జిల్లా కలెక్టర్‌ నియమించిన కమిటీ విచారణలో వాస్తవాలు బయటపడుతున్నాయి. మొత్తం 70 ఎకరాల ప్రభుత్వ భూమిని 3,470 ప్లాట్లుగా విక్రయించినట్లు తెలిసింది. వాటన్నింటికీ ఎంజాయ్‌మెంట్‌ సర్టిఫికెట్లు కూడా జారీ చేసినట్లు విశ్వసనీయ సమాచారం.  

సాక్షి, తిరుపతి: గత ప్రభుత్వంలో టీడీపీ నాయకులు, రెవెన్యూ అధికారులు కుమ్మక్కై చేపట్టిన భూకుంభకోణాలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి. రేణిగుంట మండల పరిధిలో గత ప్రభుత్వ హయాంలో జరిగిన భూ ఆక్రమణలపై జిల్లా కలెక్టర్‌ నారాయణ భరత్‌ గుప్త  బుధవారం విచారణ కమిటీని నియమించారు. ఏడుగురు తహశీల్దార్లు, మరో ఏడుగురు సర్వేయర్లు ఉన్న ఈ కమిటీ  విచారణను వేగవంతంచేసింది. రేణిగుంట మండల పరిధిలో కరకంబాడి పంచాయతీ తారకరామ నగర్‌లో గురువారం పర్యటించింది.  గత ప్రభుత్వ హయాంలో ఇచ్చిన ఎంజాయ్‌మెంట్‌ సర్టిఫికెట్ల ప్రకారం ఒక్కొక్కరిని విచారించారు.

టీడీపీ అధికారంలోకి వచ్చిన ఐదేళ్ల కాలంలో జిల్లావ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ భూములు, చెరువులు, కాలువలు, వంక, మేత, డీకేటీ భూములు ఆక్రమణకు గురైన విషయం తెలిసిందే. టీడీపీ నేతలు ప్రభుత్వ, పోరంబోకు భూములను ప్రధాన ఆదాయ వనరుగా మార్చుకున్నారు. సందట్లో సడేమియా అంటూ.. కొందరు రెవెన్యూ అధికారులు సైతం ప్రభుత్వ, పోరంబోకు భూములను ఇతరులకు కట్టబెట్టి జేబులు నింపుకుంటున్నారు. ఈ నేపథ్యంలో భూ ఆక్రమణలపై ‘సాక్షి’ వరుస కథనాలు ప్రచురించింది.

అంగట్లో ఎంజాయ్‌మెంట్‌ సర్టిఫికెట్లు
గత ప్రభుత్వంలో అధికార పార్టీకి చెందిన నాయకులు, మరికొందరు అధికారులు అక్రమాలను సక్రమం చేసుకునేందుకు ఆక్రమిత భూముల్లో తాత్కాలిక షెడ్లు ఏర్పాటు చేసుకున్నారు. అయితే అవన్నీ ఆక్రమించుకున్న భూములే అని ఎన్నికలకు ముందే పత్రికల్లో కథనాలు రావడంతో కొనుగోలు చేసిన వారు నాయకులు, అధికారులను నిలదీశారు. తాము నిర్మించుకున్న నివాస స్థలాలు ఆక్రమించుకున్నవని పత్రికల్లో వస్తున్నాయని, ఇచ్చిన డబ్బులు వెనక్కు ఇచ్చేయమని గట్టిగా అడగడం మొదలు పెట్టారు. డబ్బులు ఇవ్వకపోతే తమ స్థలాలకు పట్టాలు ఇప్పించమని, లేదంటే కేసులు పెడుతామని హెచ్చరించారు. ఓ వైపు కొనుగోలు చేసిన వారు.. మరో వైపు పత్రికలో వస్తున్న కథనాలతో ఇటు టీడీపీ నేతలకు, అటు అధికారులకు దిక్కు తోచడం లేదు.

ఎన్నికలు సమీపించే ముందు ఇబ్బందులు ఎదురవుతా యని గ్రహించిన నాయకులు, అధికారులు తాత్కాలిక షెడ్లు నిర్మించుకున్న వాటన్నింటికీ ‘ఎంజాయ్‌మెంట్‌’ సర్టిఫికెట్లు ఇచ్చేశారు. ప్లాటుకు రూ.2 లక్షలు, ఎంజాయ్‌మెంట్‌ సర్టిఫికెట్‌కు రూ.50వేల చొప్పున వసూలు చేసినట్లు బాధితులు కమిటీ సభ్యులకు వివరించినట్లు తెలిసింది. ఈ లెక్కన రేణిగుంట పరిధిలో మొత్తం 70 ఎకరాల ప్రభుత్వ భూమిని రూ.86.75 కోట్లకు అమ్మి సొమ్ము చేసుకున్నట్లు అధికారులు అంచనా వేసినట్లు విశ్వసనీయ సమాచారం. అక్కడితో ఆగని అక్రమార్కులు కొన్ని ప్లాట్లను రెండో వ్యక్తికి విక్రయించారు. అతనికి ఏకంగా రిజిస్ట్రేషన్‌ కూడా చేసి అప్పజెప్పారు. ఆ తరువాత పట్టా కూడా ఇచ్చి పక్కా పట్టా అని నమ్మించడం గమనార్హం.

ఈ విషయంపై కొందరు జిల్లా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. అయితే టీడీపీ పెద్దల ఒత్తిడి మేరకు అక్రమార్కులపై ఎటువంటి చర్యలు తీసుకోలేకపోయారు. నూతనంగా బాధ్యతలు చేపట్టిన కలెక్టర్‌ నారాయణ భరత్‌ గుప్త భూ అక్రమాలపై ఫిర్యాదులు అందడంతో వెంటనే 14 మందితో కూడిన కమిటీని వేసి విచారణ మొదలు పెట్టారు. ఈ విచారణలో నాయకులు, రెవెన్యూ అధికారుల బాగోతాలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నట్లు తెలిసింది. కమిటీ సభ్యులు విచారణ పూర్తయ్యాక కలెక్టర్‌కు నివేదిక సమర్పించనున్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement