‘ఎన్నో ప్రశ్నలు.. అందుకే ఈ జాబ్‌ చేస్తున్నా’

Woman Works As Swiggy Delivery Girl In Hyderabad - Sakshi

హైదరాబాద్‌ : ప్రస్తుతం వివిధ పట్టణాల్లో ఆన్‌లైన్‌ ఫుడ్‌ డెలివరీ సంస్థలు స్విగ్గీ, జొమాటోల హవా నడుస్తుందన్న విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎక్కడ చూసినా ఆయా సంస్థల లోగోలతో టీ షర్టులు ధరించిన డెలివరీ బాయ్స్‌ బైక్‌లపై రయ్‌మంటూ దూసుకుపోవడం మనలో చాలా మంది చూసే ఉంటారు. అయితే అన్ని రంగాల్లో పురుషులతో సమాన అవకాశాలు దక్కించుకున్న మహిళలు.. ఫుడ్‌ డెలివరీ విషయంలో మాత్రం ఎందుకు వెనుకబడి ఉండాలనే ఆలోచన... జననీ రావు అనే అమ్మాయిని హైదరాబాదీ స్విగ్గీ డెలివరీ గర్ల్‌గా అవతారం ఎత్తించింది. పురుషాధిక్యం ఉన్న సమాజంలో ఆత్మవిశ్వాసం, ధైర్యం ఉంటే ఏ రంగంలోనైనా తమదైన ముద్ర వేయగలరనే విషయాన్ని మరోసారి స్పష్టం చేసింది. హైదరాబాద్‌కు చెందిన జననీ రావు(21) నగరంలోని విల్లామేరీ కాలేజీలో విద్యనభ్యసిస్తున్నారు. సైకాలజీలో మాస్టర్స్‌ చేస్తున్న జననీకి సవాళ్లు ఎదుర్కోవడం అంటే ఇష్టం. అందుకే ఇంతవరకూ నగరంలో ఎక్కడా లేని విధంగా ఫుడ్‌ డెలివరీ సంస్థలో డెలివరీ గర్ల్‌గా పనిచేయడం ప్రారంభించారు. స్కూటీపై దూసుకుపోయే జనని.. బంజారా హిల్స్‌, జూబ్లీహిల్స్‌, సోమాజిగూడ వంటి ప్రాంతాల్లో స్విగ్గీ కస్టమర్లకు ఫుడ్‌ డెలివరీ చేస్తున్నారు. 

ఈ విషయం గురించి జనని మాట్లాడుతూ... ‘ ఫుడ్‌ డెలివరీ విభాగంలో నేను ఇంతవరకు ఒక్క మహిళను కూడా చూడలేదు. అందుకే ఈ జాబ్‌ను ఎంచుకున్నాను. చాలా మంది నేను చేసే పనిని సంప్రదాయ విరుద్ధమైనదిగా చూస్తారు. అయితే ఈ విషయంలో నా కుటుంబ సభ్యులు, స్నేహితులు, కొంతమంది కస్టమర్లు ప్రోత్సహించడం నాలో ఉత్తేజాన్ని నింపుతుంది. ఫుడ్‌ డెలివరీకి వెళ్లినపుడు చాలా మంది నన్ను చూసి ఆశ్చర్యపోతుంటారు. చాలా ప్రశ్నలు వేస్తుంటారు. నిజానికి స్విగ్గీ ఫుడ్‌ డెలివరీ చేసే అమ్మాయిల కోసం చాలా జాగ్రత్తలు తీసుకుంటోంది. పెప్పర్‌ స్ప్రే అందుబాటులో ఉంచడంతో పాటుగా .. ఆపదలో ఉన్న సమయాల్లో ఫోన్‌లో ఉన్న కాంటాక్టులకు ఎమర్జెన్సీ కాల్‌ వెళ్లేట్లుగా యాప్‌ను రూపొందిస్తోంది’ అని పేర్కొన్నారు. తన లాగే మరికొంత మంది అమ్మాయిలు ఈ జాబ్‌ను ఎంచుకుంటే బాగుంటుందని అభిప్రాయపడ్డారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top