
పది నిమిషాల్లోనే ఘోరం..
హిమాచల్‌ప్రదేశ్‌లో 24 మంది ప్రాణాలు నీటిపాలైన ఘటనలో ప్రాణాలతో బయటపడ్డ కాగజ్‌నగర్ పట్టణానికి చెందిన వెంకటసాయిశ్రీకర్ బుధవారం కాగజ్‌నగర్‌కు చేరుకున్నాడు.
హిమాచల్‌ప్రదేశ్ ఘటన నుంచి క్షేమంగా ఇంటికి చేరిన సాయిశ్రీకర్
కాగజ్‌నగర్ రూరల్ : హిమాచల్‌ప్రదేశ్‌లో 24 మంది ప్రాణాలు నీటిపాలైన ఘటనలో ప్రాణాలతో బయటపడ్డ కాగజ్‌నగర్ పట్టణానికి చెందిన వెంకటసాయిశ్రీకర్ బుధవారం కాగజ్‌నగర్‌కు చేరుకున్నాడు. తల్లిదండ్రులు గానుగపాటి ప్రసాద్-కనకదుర్గమ్మతో కలిసి తన అనుభవాలను పంచుకున్నాడు. తన కొడుకు క్షేమంగా కళ్లెదుటకు రావడంతో ఆ తల్లిదండ్రుల్లో సంతోషం వెల్లివిరిసింది. ఈ సందర్భంగా వెంకటసాయి శ్రీకర్ అక్కడి భయానక వాతావరణాన్ని ‘సాక్షి’తో పంచుకున్నాడు.
‘ఆ రోజు సాయంత్రం 6.20 నిమిషాలు. ఆ సమయంలో బియాస్ నది పరిసర ప్రాంతాలు సుందరంగా కనిపించాయి. మా షెడ్యూల్‌లో అక్కడ ఆగాలని లేకపోవడంతో మా ఫ్యాకల్టీ వద్దని చెప్పారు. అయినా మేమే ఫోటోలు దిగేందుకు బాగుంటుందని రెండు బస్సుల నుంచి అందరం దిగాం. నదిలో నీళ్లు ఎక్కువగా లేవు. రాళ్ల మధ్యన అక్కడక్కడ మాత్రమే కొద్దికొద్దిగా నీటి ప్రవాహం ఉంది. డ్యాం నుంచి నీరు వదిలితే సైరన్ మోగుతుందని, అక్కడి అధికారులు మాతో చెప్పారు.
అందుకే నదిలోకి దిగాం. నదిలో నీళ్లు చల్లగా ఉంటాయని అక్కడి అధికారులు చెప్పారు. దీంతో అందరం నది ఒడ్డునే చెప్పులు విడిచి నీటిలోకి దిగి మధ్యలో ఉన్న బండరాళ్ల మీద నిల్చున్నాం. నీళ్లు మరీ చల్లగా ఉండి అరికాళ్లు మండుతుండడంతో నేను ‘చెప్పులు తెచ్చుకునేందుకు ఒడ్డుకు చేరుకున్నా’. అదే సమయంలో నీటి ప్రవాహం పెరిగింది. సైరన్ మాత్రం వినిపించలేదు. కొంత మంది నా వెనకే పరుగులు తీసుకుంటూ ఒడ్డుకు రాగా వారిని నేను చేతులతో లాగి ఒడ్డుమీదకు చేర్చాను.
48 మందిలో 24 మంది వరద ప్రవాహంలో కొట్టుకుపోయారు. ఏం జరిగిందో తెలిసేలోపే అంతా అయిపోయింది. అదే రోజు రాత్రి గాలింపు చర్యలు సక్రమంగా చేపడితే కొద్ది మంది ప్రాణాలతో బయటపడేవారు. ఫ్లడ్‌లైట్స్ లైఫ్‌బోట్‌లు ఏర్పాటు చేయాలని అక్కడి అధికారులకు ఎంత చెప్పినా కనికరించలేదు. పోలీసులు సైతం ఆ ఏరియా ఎవరి పరిధిలోకి వస్తుందనే వాదనలోనే ఉన్నారే తప్పా మా గోడును పట్టించుకోలేదు. అదే రోజు రాత్రి మమ్మల్ని మండి జిల్లా కేంద్రానికి తరలించి మరుసటి రోజు ప్రత్యేక హెలీకాప్టర్‌లో ఛండీఘడ్ తీసుకువచ్చారు. ఛండీఘడ్ నుంచి మరో హెలీకాప్టర్‌లో హైదరాబాద్‌కు తీసుకువచ్చారు. బుధవారం తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌లో కాగజ్‌నగర్‌కు చేరుకున్నా.’