ఆడపిల్లపై వివక్ష ఎందుకు? | Why discriminate against girls? | Sakshi
Sakshi News home page

ఆడపిల్లపై వివక్ష ఎందుకు?

Nov 15 2014 4:49 AM | Updated on Sep 2 2017 4:28 PM

‘ఆడబిడ్డ పుడితే మానసికంగా ఎందుకు బాధపడుతున్నారో అర్థం కావడంలేదు..

 ఇందూరు : ‘ఆడబిడ్డ పుడితే మానసికంగా ఎందుకు బాధపడుతున్నారో అర్థం కావడంలేదు.. బిడ్డను కనే తల్లి కూడా ఒకప్పుడు ఒక తల్లికి పుట్టిన ఆడబిడ్డేనన్న విషయం మరిచిపోయి గర్భంలోనే ఉండగానే ఆడపిల్లలను చంపుకుంటున్నారు..’ అని జిల్లా అదనపు కలెక్టర్ (ఏజేసీ) శేషాద్రి ఆవేదన వ్యక్తం చేశారు. బాలల హక్కుల వారోత్సవాలలో భాగంగా శుక్రవారం ఐసీడీఎస్ అనుబంధ శాఖ జిల్లా బాలల సంరక్షణ విభాగం, తదితర సంబంధిత శాఖల సమన్వయంతో బాలల హక్కుల దినోత్సవ కార్యక్రమాన్ని స్థానిక న్యూఅంబేద్కర్ భవన్‌లో నిర్వహించారు.  

ముఖ్య అతిథిగా హా జరైన ఏజేసీ నెహ్రూ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఆడప్లిల పుడితే ఏమవుతుందన్నారు. తల్లి దండ్రులను చివరి వరకు ప్రేమించేది కొడుకు కాదని కూతురేనన్నారు. పెళ్లి చేసుకుని అత్తారింటికి వెళ్లినంత మాత్రానా కూతురు తల్లి దండ్రులను మరిచిపోదన్నారు. కానీ ఈ కాలంలో  కొడుకులు కన్న తల్లిదండ్రులను పట్టించుకోకుండా వృద్ధాశ్రమంలో ఉంచుతున్నారని అన్నారు.

బరువయ్యారని ఆశ్రమంలో ఉంచిన కొడుకు గొప్పవాడా...? చివరి వరకు ప్రేమించి యోగ క్షేమాలు చూసుకునే కూతురు గొప్పదా.? అని ప్రశ్నించారు. ఇంతటి చరిత్ర కలిగిన ఆడబిడ్డను కనే తల్లి ముందస్తు పరీక్షలు చేయించుకుని ఆడబిడ్డ పుడుతుందని తెలుసుకుని కడుపులోనే చంపేయడం దారుణమన్నారు. ప్రతి ఒక్కరికీ జీవించే హక్కు ఉం దని, కానీ ఆడవాళ్లే ఆడవాళ్లకు ఇలా శత్రువులుగా మారడం దారుణమైన విషయమన్నారు. ఆడవాళ్లలో మార్పు వస్తే భ్రూణ హత్యలు తగ్గుతాయన్నారు. ఆడవాళ్లు భారం కాకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం కిశోర బాలికలు, కల్యాణ లక్ష్మి లాంటి ఆర్థిక సహాయ పథకాలను ప్రవేశపెట్టిందని వాటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

 పిల్లల హక్కులను హరించొద్దు
 పిల్లల హక్కులను హరించే హక్కు ఎవరికీ లేదని, అలా హరించిన వారెవరైనా, చివరికీ కన్న తల్లిదండ్రులైనా చట్ట ప్రకారం శిక్ష అర్హులవుతారని తెలిపారు. బడీడు పిల్లలను పనిలో పెట్టుకుంటే షాపు యజమానిపై కేసు నమోదుతో పాటు జైలు శిక్ష విధిస్తారనిహెచ్చరించారు. కార్యక్రమం అనంతరం సంతానం కలుగని దంపతులకు ఏడాదిన్నర పాపను ఏజేసీ చేతుల మీదుగా దత్తతనిచ్చారు.  ఉపాన్యాస, వ్యాసరచన పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు.

 బాల్య వివాహాల నిరోధకాలపై, బాల స్వచ్ఛ కార్యక్రమానికి సంబంధించిన బ్యానర్లు, కరపత్రాలను ఆవిష్కరించారు. పలువురు విద్యార్థులు ఆట, పాటలతో అలరించారు. కార్యక్రమంలో ఐసీడీఎస్ పీడీ రాములు, జిల్లా విద్యాశాఖధికారి శ్రీనివాసాచారి, జిల్లా వైద్యాధికారి గోవింద్ వాగ్మారే, ఎన్‌సీఎల్‌పీ పీడీ సుధాకర్ రావు తదితరులు పాల్గొన్నారు.

 ర్యాలీని ప్రారంభించిన ఎస్పీ
 బాలల హక్కుల వారోత్సవాల కార్యక్రమంలో భాగంగా ఐసీడీఎస్ ఆధ్వర్యంలో కలెర్టరేట్ నుంచి విద్యార్థులచే ర్యాలీ నిర్వహించారు. ఉదయం 10గంటలకు ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు.  ర్యాలీ  కలెక్టరేట్ నుంచి తిలక్‌గార్డెన్ మీదుగా న్యూ అంబేద్కర్ భవన్ వరకు చేరుకుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement