హైదరాబాద్: బడ్జెట్ సమావేశాలు పూర్తయ్యేవరకు తెలుగుదేశం పార్టీ సభ్యులను అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేయటాన్ని బీజేపీ తప్పుపట్టింది.
క్షమాపణ చెప్పే అవకాశమూ ఇవ్వరా?
Mar 10 2015 2:55 AM | Updated on Mar 29 2019 9:11 PM
హైదరాబాద్: బడ్జెట్ సమావేశాలు పూర్తయ్యేవరకు తెలుగుదేశం పార్టీ సభ్యులను అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేయటాన్ని బీజేపీ తప్పుపట్టింది. గవర్నర్ ప్రసంగం సమయం లో జాతీయగీతాలాపన సందర్భంగా ఆ పార్టీ సభ్యులు అనుచితంగా ప్రవర్తించారని తేలితే క్షమాపణ చెప్పేందుకు అవకాశం కూడా ఇవ్వకుండా సస్పెం డ్ చేస్తూ ఏకపక్ష నిర్ణయం తీసుకోవటం సరికాదని బీజేపీ శాసనసభా పక్ష నేత లక్ష్మణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
టీడీపీ సభ్యుల సస్పెన్షన్ తర్వాత మధ్యాహ్నం టీ విరామం అనంతరం సభ ప్రారంభమవుతూనే గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానానికి మద్దతుగా వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ ప్రసంగం ప్రారంభించారు. వెంటనే లక్ష్మణ్ లేచి టీడీపీ సభ్యుల సస్పెన్షన్ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాం డ్ చేశారు. టీడీపీ సభ్యులు అనుచితంగా వ్యవహరించారని సస్పెండ్ చేసినప్పుడు, అదేసమయంలో అధికారపక్ష సభ్యులు కూడా తమ స్థానాల నుంచి పక్కకు వచ్చిన విషయాన్ని ఎందుకు పరిగణించలేదని, వారిపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. దీనిపై హరీశ్ మాట్లాడుతూ జరిగిన పొరపాటుకు క్షమాపణ చెప్పాల్సిందిగా పేర్కొంటూ స్పీకర్ వారిని పలుమార్లు అడిగారని, అయినా వారు స్పందించలేదని, తప్పని పరిస్థితిలోనే సస్పెం డ్ చేయాల్సి వచ్చిందని అన్నా రు. దీనికి నిరసనగా బీజేపీ వాకౌట్ చేసింది.
ఆ రెండు పార్టీల మధ్య ఎన్నికల అవగాహన ఉండటం, త్వరలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నందున అందు లో లబ్ధి చేజారుతుందనే భావనతోనే వాకౌట్ చేశారని హరీశ్ ఎద్దేవా చేశారు. ప్రతిపక్షాల గొంతునొక్కే ఆలోచన అధికారపక్షానికి లేదని, టీడీపీ సభ్యుడు ఆర్.కృష్ణయ్య సభలో ఉన్నా తామేమీ అభ్యంతరం వ్యక్తం చేయకపోవటమే దీనికి నిదర్శనమన్నారు. జాతీయ గీతాలాపన సమయంలో అధికారపార్టీ సభ్యుల ప్రవర్తనపై వీడియో ఫుటేజ్ పరిశీలించి చర్యలు తీసుకోవాలని సీఎల్పీ నేత జానారెడ్డి డిమాండ్ చేశారు.
Advertisement
Advertisement