
సాక్షి, హైదరాబాద్: కొన్ని సినిమాలకు ప్రభుత్వం ఇచ్చే వినోద పన్ను మినహాయింపు లబ్ధిని సినీ ప్రేక్షకులు కాకుండా ఆ చిత్రాల నిర్మాతలు పొందుతుండటంపై హైకోర్టు విస్మయం వ్యక్తం చేసింది. ప్రేక్షకుల కోసం ఇచ్చే పన్ను మినహాయింపులను నిర్మాతలు తీసుకోవడం ఏమిటని ప్రశ్నించింది. వినోద పన్ను లబ్ధి ప్రేక్షకులకు చెందాలా? లేక సదరు సినిమా నిర్మాతకు చెందాలా? అన్న విషయంపై స్పష్టతనివ్వాలని ఉభయ రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. తదుపరి విచారణను ఆగస్టు 16కు వాయిదా వేసింది.
ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ తొట్టతిల్ బి.రాధాకృష్ణన్, న్యాయ మూర్తి జస్టిస్ వి.రామసుబ్రమణియన్‌లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ చిత్రానికి ఉభయ రాష్ట్ర ప్రభుత్వాలు వినోదపన్ను మినహాయింపునివ్వడాన్ని సవాలు చేస్తూ న్యాయవాది ఆదర్శ్‌కుమార్ 2017లో దాఖలు చేసిన పిల్ బుధవారం ధర్మాసనం మరోసారి విచారణ జరిపింది. వినోదపన్ను మినహాయింపును సినీ ప్రేక్షకులకు ఇస్తారని, దీంతో టికెట్ ధర తగ్గే అవకాశం ఉంటుందని పిటిషనర్ తరఫు న్యాయవాది తెలిపారు.