సుడా.. ఏదీ ప్రగతి జాడ!

where is suda development in karimnagar - Sakshi

సాక్షిప్రతినిధి, కరీంనగర్‌: ఇప్పటివరకు హైదరాబాద్, వరంగల్‌కు మాత్రమే అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీలు ఉన్నాయి. తెలంగాణలో మూడో పెద్ద నగరంగా పేరొందిన కరీంనగర్‌ అభివృద్ధి కోసం ‘సుడా’ను ఏర్పాటు చేస్తామని ప్రకటించడంతో ప్రగతి జాడలు కన్పిస్తాయని అందరూ ఆశించారు. ‘సుడా’ ప్రకటించిన ప్రభుత్వం అదేరోజూ తాత్కాలిక కమిటీని కూడా నియమించింది. జిల్లా కలెక్టర్‌ చైర్మన్‌గా, కార్పొరేషన్‌ కమిషనర్‌ వైస్‌చైర్మన్‌గా, కరీంనగర్‌ ఎమ్మెల్యే, సీడీఎంఏ, ఫైనాన్స్‌ డిపార్ట్‌మెంట్‌ ప్రిన్సిపల్‌ సెక్రటరీ, డీటీసీపీలు మెంబర్లుగా కమిటీ వేశారు. సుడా పరిధిలోకి వచ్చే మరో ఎమ్మెల్యేలను కూడా కమిటీలోకి తీసుకునే అవకాశం ఉందని పేర్కొన్నారు. నగర పాలక సంస్థ 50 డివిజన్లతో పాటు 580 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో 8 మండలాల పరిధిలోని 71 గ్రామాలను పట్టణాభివృద్ధి సుడాలో చేర్చారు. ప్రసుత్తం నగర జనాభా 3.15 లక్షలుగా ఉంది. సుడా పరిదిలోకి 71 గ్రామాలను కలిపితే జనాభా 6.12 లక్షల పైచిలుకుకు చేరింది. ఈ వివరాలన్నింటితో ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేయగా.. ఇప్పటివరకు కనీసం ‘సుడా’ కార్యాలయం ఏర్పాటు చేయలేదు. ప్రగతిజాడ కనిపించకపోవడంతో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నచందంగా మారింది. 

‘సుడా’ వేగం పెరిగితేనే అభివృద్ధి..  పక్కాగా ‘మాస్టర్‌ప్లాన్‌’
శాతవాహన అర్బన్‌ అథారిటీ ఏర్పాటుతో గ్రామాల అభివృద్ధి వేగంగా జరగనుంది. ఇప్పటివరకు గ్రామ, నగరస్థాయిలో ఎవరికి తగినట్లు వారికి మాస్టర్‌ ప్లాన్‌ అమలులో ఉంది. సుడాతో నగరానికి ధీటుగా అన్ని గ్రామాలకు సైతం సకల సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయి. 30 ఏళ్ల జనాభాకు తగ్గట్టుగా మాస్టర్‌ప్లాన్‌  తయారు చేసి ఆ దిశగా అభివృద్ధి చేపట్టనున్నారు. ఇప్పటివరకు నగరపాలక సంస్థ, గ్రామీణ ప్రాంతాల్లో ఆయా గ్రామపంచాయితీలు అనుమతులు జారీ చేసేవి. నగరం, గ్రామాలకు మధ్య వ్యత్యాసాలు ఉండేవి. సుడా ఏర్పాటుతో మాస్టర్‌ప్లాన్‌ ప్రకారం గ్రామాల్లో సైతం 60 ఫీట్లరోడ్లు, పక్కా డ్రైనేజీలు, వాటర్‌పైపులైన్‌లు, టెలికమ్యూనికేషన్‌ వ్యవస్థ, భౌతికంగా అన్ని రంగాల్లో అభివృద్ధి జరుగుతుంది. అర్బన్‌ అథారిటీ స్వతంత్ర ప్రతిపత్తి కలిగి ఉంటుంది. నగరం, గ్రామాలు ఒకేప్లానింగ్‌ ప్రకారం అభివృద్ధి చెందనున్నాయి. అర్బన్‌ అథారిటీ అభివృద్ధికి ఇండిపెండెంట్‌ బాడీని ఏర్పాటు చేస్తారు. చైర్మన్, అధికారుల ఆధ్వర్యంలో ప్రభుత్వ నిబంధనల ప్రకారం భవనాలు, కళాశాలలు, ఆసుపత్రులు, శ్మశానాలు, మార్కెట్లు, హరితస్థలాలు, జలవనరులు, పార్కులు, వ్యాపార కేంద్రాలు, ఎలగందుల ఖిల్లా, భవిష్యత్తుల్లో నిర్వహించనున్న మానేరు రివర్‌ఫ్రంట్‌ నిర్వహణ బాధ్యతలు సైతం సుడాకే దక్కనున్నాయి. 

పాలకవర్గం ఏర్పాటుకూ రాజకీయ గ్రహణం
ముఖ్యమంత్రి కేసీఆర్‌ సుడా ఏర్పాటుకు ఆమోదముద్ర వేసి.. అక్టోబర్‌ 24న జీవో ప్రతులను వెలువరించారు. ‘సుడా’ పీఠం కీలకమైందిగా మారడం.. చైర్మన్‌ పదవిని టీఆర్‌ఎస్‌ నాయకుల్లో చాలామంది ఆశించడంతో పోటీ మొదలైంది. టీఆర్‌ఎస్‌లో పార్టీ ప్రారంభం నుంచి ఉంటున్న జీవీ.రామక్రిష్ణారావు పేరు ఖరారైనట్లు వినిపించింది. కట్ల సతీష్, వై.సునీల్‌రావు కూడా ఎవరి స్థాయిలో వారు రాజధానిలో తమ పలుకుబడిని ఉపయోగించి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రచారం కూడా జరిగింది. మానకొండూర్‌ నియోజకవర్గానికి చెందిన జీవీ.రామక్రిష్ణారావు పార్టీ ఆవిర్భావం నుంచి పనిచేస్తున్నారు. ఇప్పటివరకు పార్టీ పదవులు తప్ప ఎలాంటి నామినేటెడ్‌ పదవులూ వరించలేదు. ఆ నియోజకవర్గం ఎస్సీలకు రిజర్వ్‌ చేయడంతో ఎన్నికల్లో పాల్గొనే అవకాశాలు కూడా లేకపోవడంతో పార్టీ కార్యక్రమాలకే పరిమితమయ్యారు. అధిష్టానంతో చనువుగా ఉండడం, పార్టీలో అగ్రనాయకత్వంతో కూడా సంబంధాలు, బంధుత్వాలు ఉండడంతో సుడా చైర్మన్‌ ఆయననే వరించే అవకాశం మెండుగా ఉందని ప్రచారం జరిగింది. ప్రపంచ తెలుగు మహాసభల హడావుడి అయిపోగానే రామక్రిష్ణారావు చైర్మన్‌గా తొమ్మిదిమందితో కమిటీ వేసే అవకాశం ఉందని పార్టీవర్గాలు కూడా భావించాయి. కానీ.. రెండు నెలలు కావస్తున్నా రాజకీయ జోక్యం కారణంగా ఇప్పటికీ ‘సుడా పాలకవర్గంపై మాత్రం సాగుతున్న సస్పెన్స్‌ తొలగడం లేదు.

‘సుడా’ పరిధిలోకి వచ్చే గ్రామాలు.. మండలాలవారీగా
కరీంనగర్‌ అర్బన్‌ మండలం: కరీంనగర్‌ పట్టణం
కొత్తపల్లి: సీతారాంపూర్, రేకుర్తి, మల్కాపూర్, చింతకుంట, పద్మనగర్, కమాన్‌పూర్, కొత్తపల్లి(హవేలి), లక్ష్మిపూర్, బద్దిపల్లి, నాగులమల్యాల, ఆసిఫ్‌నగర్, ఖాజీపూర్, ఎలగందుల.
కరీంనగర్‌ రూరల్‌: వల్లంపహాడ్, దుర్శేడ్, నగునూరు, చేగుర్తి, బొమ్మకల్, ఆరెపల్లి, ఇరుకుల్ల, మగ్దుంపూర్, చెర్లబూత్కూర్, చామన్‌పల్లి, తాహెర్‌ కొండాపూర్, పకీర్‌పేట్, జూబ్లీనగర్, ఎలబోతారం. 
మానకొండూర్‌: మానకొండూర్, సదాశివపల్లి, జగ్గయ్యపల్లి, శ్రీనివాస్‌నగర్, ముంజంపల్లి, ఈదులగట్టెపల్లి, అన్నారం, చెంజర్ల, లింగాపూర్‌.
తిమ్మాపూర్‌: తిమ్మాపూర్, అల్గునూరు, పొరండ్ల, రేణికుంట, కొత్తపల్లి (పీఎన్‌), నుస్తులాపూర్,     నేదునూర్, పచ్చునూర్, మన్నెంపల్లి.
గన్నేరువరం: చెర్లాపూర్, సంగెం, గోపాల్‌పూర్, పంతులుకొండాపూర్,  పోత్గల్, హస్నాపూర్, యాశ్వాడ, గునుకుల కొండాపూర్, గన్నేరువరం, పారువెల్ల, కాశీంపెట, మైలారం, మాదాపూర్, జంగపల్లి.
రామడుగు: వన్నారం, కొక్కెరకుంట, దేశ్‌రాజ్‌పల్లి, కిష్టాపూర్, వెదిర, వెలిచాల.
చొప్పదండి: కోనేరుపల్లి, రుక్మాపూర్, కొలిమికుంట, చాకుంట, ఒద్యారం.

ప్రభుత్వానికి  ప్రతిపాదనలు
కరీంనగర్‌ను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ‘సుడా’ను ప్రకటించింది. ఈ మేరకు కార్యాలయం ఏర్పాటు, సిబ్బంది వివరాలతో ప్రభుత్వానికి లేఖ రాశాం. అక్కడినుంచి వచ్చిన ఉత్తర్వుల ఆధారంగా కార్యాచరణ చేపడతాం. ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు సుడా కార్యకలాపాలు సాగుతాయి.   – కె.శశాంక, కార్పొరేషన్‌ కమిషనర్‌

సుడా కమిటీ ఏర్పాటు చేయాలి
అక్టోబర్‌ 24 సుడాను ప్రకటించిన ప్రభుత్వం ఇంతవరకూ కమిటీని ప్రకటించలేదు. మానకొండూర్‌ మండలంలోని సదాశివపల్లి, శ్రీనివాస్‌నగర్, జగ్గయ్యపల్లి, ఈదులగట్టెపల్లి, చెంజర్ల, ముంజంపల్లి గ్రామాలు సుడా పరిధిలోకి వెళ్లాయి. సుడా పరిధిలోకి వెళ్లడంతో ఈ గ్రామాల్లో మరింత అభివృద్ధి జరుగనుంది. సుడా కమిటీని ఏర్పాటుకు ప్రభుత్వం కృషి చేయాలి.  - జక్కం రామలింగం, రిటైర్డు ఉపాధ్యాయుడు, మానకొండూర్‌

అమలు చేస్తే బాగుంటుంది
ప్రభుత్వం కరీంనగర్‌ నగరంతోపాటు శివారు గ్రామాలను కలుపుతూ సుడాగా ఎంపిక చేయడం హర్షణీయం. అయితే మూడునెలలు గడుస్తున్నా ఓ రూపం తేవకపోవడం విచారకరం. తక్షణమే పాలకవర్గాన్ని నియమించి అధికారాలు బదలాయించి అభివృద్ధి ప్రక్రియను వేగవంతం చేస్తే బాగుంటుంది.   –శాతర్ల క్రిష్ణయ్య, రిటైర్డు ఉద్యోగి 

అభివృద్ది వేగవంతం
సుడా ఎంపిక సబబే. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి నిధుల కేటాయింపు ఉంటుంది. తద్వారా అభివృద్ధి వేగవంతమవుతుంది. ప్రభుత్వం సుడా ఏర్పాటుపై దృష్టిసారించి ప్రత్యేక కార్యాలయం, పాలకవర్గాన్ని నియమించాలి. రాజకీయాలకు అతీతంగా వ్యవహరిస్తే ఫలితాలు బాగుంటాయి.   – మండల రాజలింగం,రిటైర్డు తహసీల్దార్‌ 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top