చేనేత కార్మికులను ఆదుకుంటాం  | We are Helping Handloom Workers Says Kavitha | Sakshi
Sakshi News home page

చేనేత కార్మికులను ఆదుకుంటాం 

Apr 8 2019 3:48 AM | Updated on Apr 8 2019 8:49 AM

We are Helping Handloom Workers Says Kavitha - Sakshi

సాక్షి ప్రతినిధి, నిజామాబాద్‌: చేనేత కార్మికుల కోసం ఏ రాష్ట్రంలో లేనివిధంగా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని నిజామాబాద్‌ టీఆర్‌ఎస్‌ ఎంపీ అభ్యర్థి కల్వకుంట్ల కవిత అన్నారు. పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ప్రత్యేకించి చేనేత కార్మికులకు అండగా నిలుస్తున్న విషయం అందరికి తెలిసిందేనన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం నిజామాబాద్‌ నగరంలో నిర్వహించిన పద్మశాలి ఆత్మీయ సమ్మేళనంలో కవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి సోమవారం చేనేత వస్త్రాలను ధరించాలని కేటీఆర్‌ సూచించారని, అలాగే చేనేత ఉత్పత్తుల స్థాయిని, ప్రజల్లో ఈ దుస్తులకు ఆదరణ పెంచే ప్రయత్నం చేస్తున్నారని పేర్కొన్నారు. గత పాలకుల ఆదరణ లేకపోవడంతో చేనేత వృత్తి అంతరించి పోయే స్థితికి చేరిందని, మగ్గం మీద బట్టలు నేసే వారు చాలా చోట్ల కరువయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు.

చేనేత కార్మికులకు వృత్తిలో నైపుణ్యాన్ని పెంచే విధంగా రాష్ట్ర ప్రభుత్వం స్కిల్‌ డెవలప్‌మెంట్‌ శిక్షణ కార్యక్రమాలు చేపట్టేందుకు చర్యలు తీసుకుంటోందన్నారు. మే నెల నుంచి బీడీ కార్మికుల పింఛన్‌ మొత్తం రెట్టింపు అవుతుందని, పీఎఫ్‌ కార్డున్న కార్మికులందరికీ బీడీ భృతి లభిస్తుందని పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పద్మశాలీలకు ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తామని హామీ ఇచ్చారు. నామినేటెడ్‌ పదవుల కేటాయింపుల్లో కూడా ప్రాధాన్యం ఉంటుందన్నారు. రానున్న రోజుల్లో అర్హులైన వారందరికి డబుల్‌బెడ్‌రూం ఇళ్లు మంజూరు చేస్తామన్నారు. ఈ ఐదేళ్లలో ఎంపీగా నియోజకవర్గ అభివృద్ధి కోసం శక్తి వంచన లేకుండా పనిచేశానని, మరోసారి అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. సమావేశంలో నిజామాబాద్‌ అర్బన్‌ ఎమ్మెల్యే బిగాల గణేష్‌గుప్తా తదితరులు పాల్గొన్నారు.  

గ్రామగ్రామాన టీఆర్‌ఎస్‌ సైనికులు.. 
ఈ ఎన్నికల్లో నియోజకవర్గం పరిధిలో ప్రణాళికా బద్ధంగా తమ ఎన్నికల ప్రచారం కొనసాగుతోందని కవిత పేర్కొన్నారు. గ్రామగ్రామాన వందలాది మంది టీఆర్‌ఎస్‌ సైనికులు పార్టీ ఎజెండాను ప్రజల్లోకి తీసుకెళుతున్నారన్నారు. ఆదివారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. తాను ఇప్పటికే నియోజకవర్గంలోని అన్ని మండల కేంద్రాలు, వీలైనన్ని గ్రామాలను చుట్టి వచ్చానని, ఎమ్మెల్యేలు కూడా ఆయా అసెంబ్లీ నియోజకవర్గాలలో విస్తృతంగా పర్యటించి ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు.

వివిధ స్థాయిల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థుల ప్రచారం కొనసాగుతోందన్నారు. ఆడబిడ్డలే టీఆర్‌ఎస్‌కు ఆయువుపట్టుగా నిలుస్తున్నారని, మహిళలు స్వచ్ఛందంగా మద్దతు పలుకుతున్నారని పేర్కొన్నారు. నియోజకవర్గ ప్రజల దయతో తాను ఈసారి కూడా విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు. విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్, బిగాల గణేష్‌గుప్తా, ఎమ్మెల్సీ వీజీగౌడ్, మాజీ మంత్రి మండవ వెంకటేశ్వర్‌రావు, నాయకులు ఆనందర్‌రెడ్డి, అర్కల నర్సారెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement