మాటలొద్దు.. ఇంటికే వచ్చేయ్‌ – తమ్ముడూ జాగ్రత్త 

voice recorder on smartphones - Sakshi

పెద్దపల్లి : స్మార్ట్‌ఫోన్‌లో రికార్డ్‌ ఆప్షన్‌లున్నాయి జాగ్రత్త.. నిన్న మొన్నటి వరకు ఉన్న సెల్‌ఫోన్‌లో రికార్డ్‌ చేస్తున్నట్లు కనీసం అనుమానమైనా వచ్చేది.. కొత్త స్మార్ట్‌ఫోన్‌లతో ఇవతలి వ్యక్తి వాయిస్‌ రికార్డ్‌ అవుతోంది తస్మాత్‌ జాగ్రత్త.. మాజీ మంత్రి శ్రీధర్‌బాబుకే సెల్‌ఫోన్‌ వాయిస్‌ రికార్డు చుక్కలు చూపించడంతో అన్ని వర్గాల వారు జాగ్రత్త పడాల్సిన పరిస్థితి వచ్చి పడింది. రాజకీయ నాయకులైనా.. కార్యకర్తలైనా.. ఉద్యోగులు, అధికారులైనా.. అందరి మధ్య చిచ్చుపెట్టేందుకు వాయిస్‌ రికార్డు ప్రత్యర్థులు అస్త్రంగా వాడుకుంటున్నారు. పెద్దపల్లిలో సంచలనం సృష్టిస్తున్న వాయిస్‌ రికార్డు అన్ని వర్గాల వారిలో వణుకు పుట్టిస్తోంది. ఫోన్‌ మాట్లాడితే జాగ్రత్త.. జాగ్రత్త.. అంటూ హెచ్చరికలు అందుతున్నాయి. ఏ విషయమైనా గుట్టు చప్పుడు కాకుండా ఎడామాట్లాడితే అసలుకే ఎసరు వస్తుందని ఇటీవల జరిగిన వాయిస్‌ రికార్డు ఉదంతాలు సంచలనం రేపుతున్నాయి.

పెద్దపల్లి జిల్లాలో ఇద్దరు నేతల వాయిస్‌ రికార్డు ప్రస్తుతం పోలీస్‌ కేసుల వరకు చేరుకున్నాయి. కాల్వ శ్రీరాంపూర్‌ ఎంపీపీ సారయ్యగౌడ్‌ ఓ పంచాయతీలో పెద్దగా వ్యవహరిస్తూ చేసిన సంభాషణలు చట్టపరంగా విచారణ ఎదుర్కొనే స్థాయికి చేరుకుంది. మంగపేటలో మహిళకు జరిగిన అవమానంపై పెద్దపల్లిలో పంచాయతీ నిర్వహించగా, అందులో సారయ్యగౌడ్‌ మాటలను రికార్డు చేసి వాట్సాప్‌లో పోస్టు చేయడంతో వైరల్‌గా మారింది. చివరికి ఆయన మాటలపైనే పెద్దపల్లి పోలీసులు కేసు నమోదు చేయాల్సి వచ్చింది. ఇక మాజీ మంత్రి శ్రీధర్‌బాబు ముత్తారంకు చెందిన టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ నాయకుల మధ్య వివాదంలో చిక్కుకున్నారు. గంజాయి కేసు విచారణ మొదలైంది.

హైదరాబాద్‌ నుంచి మంథని వరకు ప్రస్తుతం వాయిస్‌ రికార్డు వాట్సాప్‌లో హల్‌చల్‌తో సెల్‌ఫోన్లు ఉన్న వారు ఎదుటి వ్యక్తులతో జాగ్రత్తగా మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది. రాజకీయాల్లో ఎదుటి వ్యక్తిని దెబ్బతీసేందుకు వాయిస్‌ రికార్డును అస్త్రంగా వాడుకుంటున్నారు. గతంలో కంటే కొత్త సెల్‌ఫోన్లు మార్కెట్‌లోకి రావడంతో వాయిస్‌రికార్డుపై ఎలాంటి అనుమానం రాకుండానే ప్రతి పదం రికార్డవుతోంది. చాలా మంది నాయకులు తమ గురించి ఎదుటి వారు మాట్లాడుకుంటున్న సంభాషణలను రికార్డు ద్వారా వినిపించాలని చేస్తున్న ప్రయత్నాలు చివరికి బెడిసి కొడుతున్నాయి. దగ్గర కావాలన్న ప్రయత్నంలో భాగంగా వాయిస్‌ రికార్డు వినిపించే వారి సంఖ్య పెరిగిపోతోంది. దీంతో ఫోన్‌లో మాట్లాడేందుకే జంకుతున్నారు.

 తాజా పరిణామాలతో వణుకు
పెద్దపల్లిలో తాజా రాజకీయ పరిణామాలతో అన్ని పార్టీల్లోనూ సెల్‌ఫోన్‌ వాయిస్‌ రికార్డు అప్రమత్తత తీసుకుంటున్నారు. టీడీపీ, కాంగ్రెస్, బీజేపీలకు చెందిన నాయకులు టీఆర్‌ఎస్‌లో చేరడంతో వేడి పుట్టింది. ఫోన్‌లో పలకరిస్తే అవతలి వ్యక్తి నీవెక్కడున్నావ్‌.. అక్కడికే వస్తా.. అంటూ సమాధానమివ్వాల్సిన పరిస్థితి వచ్చింది. విజయరమణారావు టీడీపీని వీడి కాంగ్రెస్‌లో చేరిన తర్వాత ఆయ న అనుచరులకు గాలం వేసే పనిలో ఇతర పార్టీల నాయకులు ఉన్నారు. అయితే ఎవరు ఎటు మాట్లాడుతున్నారో.. ఎవరి ఫోన్‌ కాన్ఫరెన్స్‌ ఉందో తెలియక ప్రముఖ నాయకులు సైతం ఇంటికి వస్తేనే మాట్లాడతామంటూ సమాధానమివ్వడం కొసమెరుపు. 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top