‘శ్యామల చెప్పింది నిజమైతది’

VH Hanumantha Rao Agree With Jogini Shyamala Comments - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఉజ్జయిని అమ్మవారి బోనాల ఏర్పాట్లలో ప్రభుత్వం, పోలీసు శాఖ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన జోగిని శ్యామలకు కాంగ్రెస్‌ మాజీ ఎంపీ వి. హన్మంతరావు మద్దతు తెలిపారు. శ్యామల చెప్పింది నిజమైతదని, తెలంగాణలో కేసీఆర్‌ నియంతృత్వపాలన ముగియక తప్పదని జోస్యం చెప్పారు. తెలంగాణలో సర్పంచులకు అధికారాలు ఇవ్వకుండా, నిధులు ఇవ్వకుండా కేసీఆర్‌ అన్యాయం చేశారని దుయ్యబట్టారు. ప్రభుత్వం పంచాయతీ ఎన్నికలు కావాలనే నిర్వహించడంలేదని వీహెచ్‌ అభిప్రాయపడ్డారు. గ్రామాలకు ప్రత్యేక అధికారుల వస్తే తరిమి కొట్టండని వీహెచ్‌ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.  

తెలంగాణలో డిక్టేకర్‌ రాజ్యం నడుస్తోందని, ప్రజలు ఈ ప్రభుత్వంపైన తిరగబడితే కాంగ్రెస్‌ పార్టీ మీ వెంట ఉంటుందని వీహెచ్‌ స్పష్టం చేశారు. కేసీఆర్‌ పాలనలో బీసీలకు తీవ్ర అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. బీసీలను టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అనగదొక్కాలనే ప్రయత్నం చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.  బీసీలకు తాయిలాలే తప్ప రాజకీయంగా న్యాయం చేయడం లేదని మండిపడ్డారు.  సమగ్ర కుటుంబ సర్వేలో బీసీల సంఖ్య చెప్పి, ఇప్పుడు మళ్లీ బీసీల గణన అంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.   

ప్రచార కమిటీ చైర్మన్‌ పదవిని త్వరగా ప్రకటించాలని కాంగ్రెస్‌ అధిష్టానాన్ని వీహెచ్‌ కోరారు.  కాంగ్రెస్‌ పార్టీలో ముఖ్యమంత్రి అభ్యర్థిని అధిష్టానమే నిర్ణయించే ఆనవాయితీ ఉందని తెలిపారు. ప్రజల్లో తిరిగే ఓపిక ఇంకా ఉందని, కాంగ్రెస్‌ కోసం ఒక కార్యకర్తలా పనిచేస్తానని పేర్కొన్నారు. 

 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top