వర్సిటీల ఆన్‌లైన్‌ బోధన

Universities Giving Importance For Online Classes Due To Coronavirus - Sakshi

ఆన్‌లైన్‌ విద్య వైపు మళ్లుతున్న వర్సిటీలు

అందుకు కలిసొచ్చిన కరోనా పరిస్థితులు

2030 నాటికి టాప్‌ వర్సిటీల్లో ఆన్‌లైన్‌ డిగ్రీ

సాక్షి, హైదరాబాద్‌: కరోనా దెబ్బతో విద్యాబోధన తీరులో మార్పు రానుంది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఇప్పటికే విద్యా రంగాన్ని డిజిటైజేషన్‌ వైపు తీసుకెళ్లింది. కరోనా ఏమో ఇప్పుడు ఆన్‌లైన్‌ తరగతులు, వర్చువల్‌ సమావేశాల వైపు వేగంగా తీసుకెళ్తోంది. భవిష్యత్తులోనూ ఆన్‌లైన్‌ విద్య కొన సాగించేందుకు ప్రపంచవ్యాప్తంగా యూనివర్సిటీలు సిద్ధమవుతున్నాయి. కరోనా కారణంగా ఇప్పటివరకు 191 దేశాల్లోని 158 కోట్ల విద్యార్థుల చదువులకు ఆటంకం ఏర్పడగా, ఇప్పటికే ప్రత్యామ్నాయ బోధన విధానానికి చర్యలు చేపట్టాయి. మన దేశంలోనూ సంప్రదాయ డిగ్రీలు కాకుండా ఇంజనీరింగ్, మేనేజ్‌మెంట్‌ వంటి కోర్సుల్లో ఆన్‌లైన్‌ తరగతుల నిర్వహణకు చర్యలు చేపట్టాయి.

ప్రైవేటు విద్యా సంస్థలైతే పాఠశాల విద్యలో ఈ విధానాన్ని అమలు చేస్తుండగా, ప్రభుత్వ రంగంలోనూ పలు చర్యలు చేపట్టాయి. అయితే ఉన్నత విద్యలో ఒక ప్రత్యేక విధానం ఉండాలన్న ఆలోచనతో కేంద్రం ‘భారత్‌ పఢే’పేరుతో దేశంలో ఈ–లెర్నింగ్‌ విద్యా విధానం ఉండాల్సిన తీరుపై విద్యావేత్తల నుంచి అభిప్రాయాలను సేకరించింది. డిగ్రీ కోర్సులను కూడా ఆన్‌లైన్‌లో నిర్వహించాలన్న ఆలోచనతో ముందుకు సాగుతున్నట్లు టైమ్స్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. యూనివర్సిటీస్‌ ఇన్‌ 2030 పేరుతో నిర్వహించిన ఈ సర్వేలో ప్రపంచంలోని టాప్‌ యూనివర్సిటీలకు చెందిన ప్రముఖులు, విద్యావేత్తలు, విద్యార్థులతో మాట్లాడినట్లు పేర్కొంది.

సర్వేలో వెల్లడైన ప్రధాన అంశాలివే 
► ప్రపంచంలోని ప్రఖ్యాత యూనివర్సిటీలు 2030 నాటికి ఆన్‌లైన్‌లో పూర్తిస్థాయి డిగ్రీ కోర్సులు ప్రవేశ పెడతాయని అంగీకరీస్తారా అని ప్రశ్నించగా, 5 శాతం మంది అసలే అంగీకరించబోమని చెప్పగా, 13 శాతం మంది అలా కుదరకపోవచ్చని పేర్కొన్నారు. 19 శాతం మంది ఏమీ చెప్పకపోగా, 45 శాతం మంది అవునని, 18 శాతం మంది కచ్చితంగా అవునని (మొత్తంగా 63 శాతం) స్పష్టం చేశారు. 
► పూర్తి స్థాయి డిగ్రీ కోర్సులను ప్రపంచ ప్రఖ్యాత యూనివర్సిటీలు ఆన్‌లైన్‌లో ప్రవేశ పెడతాయని చెప్పిన వారిలో యూరప్‌లో 54 శాతం మంది ఉండగా, ఉత్తర అమెరికాలో 79 శాతం మంది ఉన్నారు. ఆసియా దేశాల్లో 53 శాతం మంది, ఆస్ట్రేలియాలో 71 శాతం మంది ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. 
► డిగ్రీ కోర్సుల్లో ప్రత్యక్ష బోధన కంటే ఆన్‌లైన్‌ బోధన మెరుగ్గా ఉంటుందా అన్న ప్రశ్నకు ప్రత్యక్ష బోధన కంటే ఆన్‌లైన్‌ బోధన మెరుగ్గా ఉండదని అత్యధిక శాతం మంది స్పష్టం చేశారు. 53 శాతం మంది (ఇందులో 5 శాతం అసలే మెరుగైంది కాదని) మెరుగ్గా ఉండదన్న సమాధానమే చెప్పారు. యూరోప్‌లో 62 శాతం మంది, ఉత్తర అమెరికాలో 57 శాతం మంది, ఆసియాలో 37 శాతం మంది ఇదే విషయాన్ని చెప్పారు. ఆస్ట్రేలియాలో మాత్రం 54 శాతం మంది ప్రత్యక్ష బోధన కంటే ఆన్‌లైన్‌ బోధన మెరుగ్గా ఉం టుందని చెప్పడం గమనార్హం. అందులో 12 శాతం మంది అయితే ఆన్‌లైన్‌ బోధనే కచ్చితంగా మెరుగైందని పేర్కొన్నారు. 
► ప్రత్యక్ష విద్యా సంబంధ సమావేశాల స్థానంలో ఆన్‌లైన్‌లో వర్చువల్‌ అకడమిక్‌ కాన్ఫరెన్స్‌లు వస్తాయా అంటే 10 శాతం అసలే రావని చెప్పగా, 44 శాతం మంది రావని చెప్పారు. 22 శాతం మంది వస్తాయని వెల్లడించగా, 4 శాతం మంది కచ్చితంగా వస్తాయని స్పష్టం చేశారు. 20 శాతం మంది తెలియదని పేర్కొన్నారు. 
► ప్రత్యక్ష బోధన పోయి ఆన్‌లైన్‌ బోధనే ఉంటుందా అంటే 23 శాతం మంది అది అసలే సాధ్యం కాదని తెగేసి చెప్పగా, 42 శాతం మంది సాధ్యమని చెప్పారు. 16 శాతం మంది ఏమీ తెలియదని చెప్పగా, 19 శాతం మంది అవునని పేర్కొన్నారు. 
► కొత్త పరిశోధన పత్రాలు అన్నీ ఆన్‌లైన్‌లోనే అందుబాటులో ఉంటాయా.. అన్న ప్రశ్నకు 69 శాతం మంది అవుననే సమాధానమిచ్చారు. యూరప్‌లో 80 శాతం మంది అవునని చెప్పగా, ఉత్తర అమెరికాలో 43 శాతం మంది, ఆసియాలో 64 శాతం మంది, ఆస్టేలియాలో 65 శాతం మంది అవునని పేర్కొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top