1.09 కోట్ల వృక్షాలు నరికారు!

Union Minister Babul Supriyo Speaks Over Cutting Of Trees In India - Sakshi

5 ఏళ్లలో ఈ మేరకు చెట్ల నరికివేతకు కేంద్రం అనుమతి

తొలిస్థానంలో తెలంగాణ, తరువాత మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌

అభివృద్ధి పనుల కోసమేనంటున్న కేంద్రమంత్రి బాబుల్‌ సుప్రియో

చెట్లకు మొక్కలు ప్రత్యామ్నాయమా.. అని ప్రశ్నిస్తున్న పర్యావరణవేత్తలు

సాక్షి, హైదరాబాద్‌: అభివృద్ధి పేరిట పచ్చని చెట్లు నేలకూలుతున్నాయి. పట్టణాభివృద్ధి, నగరాల విస్తరణ, ఉత్పత్తి, ఉపాధి, ఇతర అవసరాల కోసం మౌలిక సదుపాయాల కల్పన, ఇతర ప్రాజెక్టుల నిర్మాణం ఇలా పేరు ఏదైనా చివరకు చెట్లే అందుకు ఆహుతవుతున్నాయి. అత్యంత వేగంగా చోటుచేసుకుంటున్న వాతావరణ మార్పులు, వాటి వల్ల తలెత్తుతున్న ఉపద్రవాలు, ఇతరత్రా సమస్యలకు ప్రకృతి సమతుల్యత దెబ్బతినడం, పచ్చదనం తగ్గిపోవడం ప్రధాన కారణాలుగా పర్యావరణ నిపుణులు చేస్తున్న హెచ్చరికలు పట్టించుకుంటున్న దాఖలాలు లేవు.

1.09 కోట్ల చెట్ల కొట్టివేత...
2014–19 మధ్య కాలంలో దేశవ్యాప్తంగా వివిధ అభివృద్ధి ప్రాజెక్టుల కోసం 1,09,75,000 చెట్ల నరికివేతకు కేంద్ర అటవీ, పర్యావరణశాఖ అనుమతిచ్చింది. ఇటీవల లోక్‌సభలో కేంద్ర అటవీ, పర్యావరణ వాతావరణ మార్పుæ శాఖ చెప్పిన సమాచారం మేరకు పలు అంశాలు వెల్లడయ్యాయి. దేశంలోనే అత్యధికంగా తెలంగాణలో 2016–19 మధ్యకాలంలో 12,12,753 లక్షల చెట్లను కొట్టేసేందుకు అనుమతినిచ్చినట్లు స్పష్టమైంది. దాదాపు 11 లక్షల చెట్లతో మహారాష్ట్ర రెండో స్థానంలో, 10 లక్షల చెట్లతో మధ్యప్రదేశ్‌ మూడోస్థానంలో నిలిచాయి. లోక్‌సభలో ఒకప్రశ్నకు కేంద్ర సహాయమంత్రి బాబుల్‌ సుప్రియో సమాధానమిస్తూ వివిధ అభివృద్ధి ప్రాజెక్టుల కోసం దేశవ్యాప్తంగా గత ఐదేళ్లలో మొత్తం 1.09 కోట్ల చెట్లను కూల్చేందుకు అనుమతినిచ్చినట్లు తెలియజేశారు. ముఖ్యంగా 2018–19లో ఇతర రాష్ట్రాలతో పోల్చితే తెలంగాణలో అత్యధిక సంఖ్యలో 5,22,242 చెట్లు కూల్చేందుకు అనుమతినిచ్చినట్టు కేంద్ర ప్రభుత్వ గణాంకాలను బట్టి వెల్లడైంది.

చెట్లకు మొక్కలు ప్రత్యామ్నాయమా ?
గత మూడేళ్లలో 76,72,337 చెట్లను తొలగించగా, 7.87 కోట్ల కంటే ఎక్కువగా మొక్కలను కంపల్సరీ ఎఫారెస్టేషన్‌ కింద నాటినట్లు లోక్‌సభలో కేంద్ర మంత్రి వెల్లడించారు. తప్పని పరిస్థితుల్లో మాత్రమే చెట్లను తొలగిస్తున్నామని, ప్రభుత్వ విధానంలో భాగంగా ప్రత్యామ్నాయంగా పెద్ద సంఖ్యలో మొక్కలు నాటి వాటిని సంరక్షిస్తున్నట్లు తెలియజేశారు. సిటిజన్స్‌ ఆఫ్‌ హైదరాబాద్‌కు చెందిన కాజల్‌మహేశ్వరీ మాత్రం నరికేసే పాత వృక్షాలు, చెట్లకు మొక్కలు ప్రత్యామ్నాయం కాలేవని, వాటి స్థానంలో మొక్కలను చూడలేమని అభిప్రాయపడ్డారు. ‘40–50 ఏళ్ల పాత చెట్లకు హరితహారంలో నాటే మొక్కలు ప్రత్యామ్నాయం కాలేవు. ఎందుకంటే పెద్ద వృక్షాలు వాతావరణంలోకి విడుదల చేసే ఆక్సిజన్, పీల్చుకునే కార్బన్‌ డయాక్సైడ్‌ శాతాన్ని మొక్కలు భర్తీ చేయలేవు. కాబట్టి, చెట్ల నరికివేతతో జీవవైవిధ్యానికి జరుగుతున్న నష్టం అంచనా వేయలేని స్థాయిలో ఉంది’అని పేర్కొన్నారు.

చెట్లు (లక్షల్లో) నరికారు ఇలా
సంవత్సరం    చెట్లు
2014–15    23.3 
2015–16    16.9 
2016–17    17.01
2017–18    25.5 
2018–19    17.38

భారత్‌లో తలసరికి 28 చెట్లే
2018లో ఐక్యరాజ్యసమితి నివేదిక ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా చూస్తే వివిధ దేశాల్లో ఒక్కొక్కరికి ఉన్న చెట్ల నిష్పత్తి కంటే భారత్‌ పరిస్థితి మరీ దారుణంగా ఉంది. కెనడాలో అత్యధికంగా ఒక్కో వ్యక్తికి 8,953, రష్యాలో 4,461, బ్రెజిల్‌లో 1,494, అమెరికాలో 716, చైనాలో 102 చెట్లు ఉండగా, మన దేశంలో మాత్రం ఒక్కొక్కరికి 28 చెట్లే ఉన్నాయి. ఒకవైపు చెట్ల సంఖ్య గణనీయంగా తగ్గిపోతుండటంతో పాటు, అభివృద్ధి ప్రాజెక్టుల పేరిట ఉన్న చెట్లను కొట్టేస్తుండటంతో ఈ పరిస్థితి తలెత్తిందని పర్యావరణవేత్తలు హెచ్చరిస్తున్నారు. దీనిని బట్టి మన దేశంలో చెట్ల సంఖ్య ఏ మేరకు గణనీయంగా తగ్గిపోతోందో స్పష్టమవుతోంది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top