రెండు రాష్ట్రాల నయా ఫార్ములా!

Two States New Formula! - Sakshi

ఐదు పంచాయతీలు ఇచ్చిపుచ్చుకునేలా ఒప్పందం 

కేంద్ర ప్రభుత్వం సైతం  సానుకూలం? 

ఇదే జరిగితే భద్రాచలం అభివృద్ధికి అవకాశాలు 

సాక్షి, కొత్తగూడెం: వీలిన మండలాల అంశం మళ్లీ తెరపైకి వచ్చినట్లు తెలుస్తోంది. తెలంగాణ నుంచి ఏపీలో వీలినమైన గ్రామాలపై చర్చ జరుగుతోంది. ముఖ్యంగా భద్రాచలం డివిజన్‌లోని అత్యధిక భాగం ఏపీలోకి వెళ్లడంతో భద్రాచలం అభివృద్ధిపై తీవ్ర ప్రభావం పడింది. అలాగే, ఏపీలోని గ్రామాలకు వెళ్లాలంటే తెలంగాణలోకి వచ్చి వెళ్లాల్సిన పరిస్థితి. దీంతో రెండు రాష్ట్రాలు ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో ముందుకు సాగుతున్నట్లు తెలుస్తోంది. భద్రాచలం చుట్టూ ఏపీ భూభాగం ఉండటంతో పాటు తెలంగాణలోనే ఉన్న చర్ల, దుమ్ముగూడెం మండలాలకు వెళ్లే రహదారిలో ఉన్న ఎటపాక, గుండాల, పిచుకలపాడు, కన్నాయిగూడెం గ్రామాలతో పాటు శ్రీ సీతారామచంద్రస్వామి వారి 900 ఎకరాల భూములున్న పురుషొత్తపట్నం పంచాయతీ సైతం తూర్పు గోదావరి జిల్లాలోకి వెళ్లాయి. దీంతో పట్టణ అభివృద్ధి నిలిచిపోయింది.

ఈ క్రమంలో ఈ ఐదు పంచాయతీలను భద్రాచలం మండలంలో కలపాలని తెలంగాణ కేంద్రాన్ని అడుగుతూనే ఉంది. పశ్చిమ గోదావరి జిల్లాలోకి వెళ్లిన కుక్కునూరు, వేలేరుపాడు మండలాల నుంచి ఏపీలోకి వెళ్లాలంటే తెలంగాణలోని అశ్వారావుపేట మీదుగా వెళ్లాల్సి వస్తోంది. దీంతో అశ్వారావుపేట మండలంలోని అనంతారం, బచ్చువారిగూడెం, నందిపాడు, నారాయణపురం, గుమ్మడవెల్లి గ్రామాల ద్వారా నేరుగా పశ్చిమ గోదావరి జిల్లాలోకి వెళ్లేందుకు అవకాశం ఉన్నందున ఈ ఐదు గ్రామాలను తమకివ్వాలని ఏపీ కోరుతోంది. రెండువైపులా చెక్‌పోస్టుల సమస్య కూడా అదనంగా ఉండటంతో రెండు రాష్ట్రాల వాహనాలకు ఇబ్బందులు తప్పడంలేదు. ఈ నేపథ్యంలో ఇచ్చిపుచ్చుకునే పద్ధతిలో ఇరు రాష్ట్రాలు ఒప్పందం చేసుకోవాలని నిర్ణయించాయి. ఈ ఫార్ములా పట్ల కేంద్ర ప్రభుత్వం కూడా సానుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది.  

భద్రాచలం అభివృద్ధికి అవకాశం 
విభజన సమయంలో భద్రాచలం డివిజన్‌ నుంచి చింతూరు, కూనవరం, వీఆర్‌పురం, భద్రాచలం(ప్రస్తుతం ఎటపాక మండలం), కుక్కునూరు, వేలేరుపాడు మండలాలు ఆంధ్రాలోకి వెళ్లడంతో పట్టణ అభివృద్ధిపై తీవ్ర ప్రభావం పడింది. చుట్టూ ఆంధ్రా, మరోవైపు గోదావరి ఉండడంతో భద్రాద్రి పట్టణ విస్తరణకు అవకాశం లేక అభివృద్ధి పూర్తిగా నిలిచిపోయింది. ఈ నేపథ్యంలో ఐదు పంచాయతీలు తిరిగి భద్రాచలం మండలంలో కలిపితే పట్టణం తిరిగి అభివృద్ధి బాటలోకి రావడంతో పాటు పురుషోత్తపట్నం పంచాయతీ పరిధిలోని 900 ఎకరాల రామాలయం భూములు, ఆస్తులు వస్తాయి.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top