ఆర్టీసీలో కొత్త కొలువులకు ప్రతిపాదనలు సిద్ధం! 

TS RTC Strike: New Jobs Proposed In RTC By IAS Committee - Sakshi

ప్రభుత్వామోదం తర్వాత నోటిఫికేషన్లు ఇచ్చే అవకాశం 

ఖాళీ అయిన స్థానాలను భర్తీ చేసేందుకు చర్యలు 

సాక్షి, హైదరాబాద్‌: ఆర్టీసీలో సమ్మె చేస్తున్న కార్మికుల సెల్ఫ్‌ డిస్మిస్‌తో ఖాళీ అయిన పోస్టుల భర్తీకి యాజమాన్యం చర్యలు వేగిరం చేస్తోంది. పక్షం రోజుల్లోగా ఆర్టీసీని పూర్వ స్థితికి తీసుకురావాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు స్పష్టం చేసిన నేపథ్యంలో ఆ మేరకు ఏర్పాట్లలో అధికారులు తలమునకలయ్యారు. 7 రోజులుగా సమ్మె కొనసాగుతుండగా.. ఆర్టీసీ యాజమాన్యం, ప్రభుత్వం ఇచ్చిన గడువులోపు చేరని వారంతా సెల్ఫ్‌ డిస్మిస్‌ అయినట్లు ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. దీంతో ఈ గణాంకాలను ప్రాతిపదికన తీసుకున్న ఆర్టీసీ అధికారులు.. ఎన్ని పోస్టులు కొత్తగా భర్తీ చేయాలనే దానిపై కసరత్తు దాదాపు పూర్తి చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 97 బస్‌ డిపోల పరిధిలో డ్రైవర్లు, కండక్టర్లు, శ్రామిక్‌లు, సూపర్‌వైజర్లు తదితర కేటగిరీల లెక్కలు తేల్చిన ఆర్టీసీ యాజమాన్యం.. ప్రాథమిక నివేదిక రూపొందించింది. ఆర్టీసీలో మూడు పద్ధతుల్లో బస్సులు నడపాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో సిబ్బంది అవసరం ఏ మేరకు ఉంటుందనే దానిపై అంచనాలు తయారు చేసిన అధికారులు ఏ విధంగా నియామకాలు చేపట్టాలనే దానిపై ప్రతిపాదనలు సైతం సిద్ధం చేసినట్లు సమాచారం. కొత్తవిధానం ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా డ్రైవర్లు, కండక్టర్లు, శ్రామిక్‌లు ఇతర సిబ్బంది కలుపుకొంటే దాదాపు 25 వేల మంది వరకు అవసరమని అధికారులు భావిస్తున్నారు. ఈ మేరకు ప్రతిపాదనలు రూపొందించిన ఆర్టీసీ.. సీఎం కేసీఆర్‌కు సమర్పించేందుకు సిద్ధమైంది. వాస్తవానికి శుక్రవారం సాయంత్రం కల్లా సీఎంవోలో సమర్పించాల్సి ఉన్నా.. అనివార్య కారణాల వల్ల జాప్యం జరిగినట్లు తెలిసింది.

టిమ్స్‌ ద్వారా టికెట్లు.. 
ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తున్న వారికి టిమ్స్‌ ద్వారా టికెట్లు జారీ చేసే ప్రక్రియపై అధికార యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించిందని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌ స్పష్టం చేశారు. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండాలనే ఉద్దేశంతో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ప్రభుత్వం చేసిందని, ప్రజా రవాణా సేవల్ని మరింత మెరుగు పరుస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. విజిలెన్స్‌ స్ట్రెంత్‌ను పెంచడంతో పాటు బస్‌ సర్వీసులలో టిమ్స్‌ ద్వారా టికెట్ల జారీ ప్రక్రియ త్వరితంగా అందుబాటులోకి తీసుకురావాలని సంస్థ అధికారులకు ఆదేశించారు. ఆయా పాయింట్ల వద్ద సర్వీసులు చెక్‌ చేసేందుకు ఆర్టీవో అధికారుల సహకారం తీసుకోనున్నట్లు పేర్కొన్నారు. ప్రయాణ సమయంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు పర్యవేక్షించాలని సంబంధిత అధికారులకు మౌఖిక ఆదేశాలు జారీ చేశారు. శుక్రవారం సాయంత్రం 5 గంటల వరకు అందిన సమాచారం 5788 బస్సులు నడిపినట్లు తెలిపారు. ఇందులో 3,766 ఆర్టీసీ, 2,022 అద్దె బస్సులున్నాయన్నారు. 6 వేల ప్రైవేట్‌ వాహనాలను కూడా తిప్పినట్లు చెప్పారు.
 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top