ఏప్రిల్‌ 2 నుంచి టీఎస్‌–బీపాస్‌

TS Bpass Starts From April 2 - Sakshi

21 రోజుల్లో భవన నిర్మాణ అనుమతులు ఇవ్వాల్సిందే..

జాప్యం చేసిన అధికారులపై జరిమానాకు యోచన

మున్సిపల్‌ కమిషనర్లు, టౌన్‌ ప్లానింగ్‌ అధికారులతో సమావేశంలో కేటీఆర్‌

సాక్షి, హైదరాబాద్‌: పురపాలక శాఖలో ప్రవేశపెట్టబోతున్న ‘టీఎస్‌–బీపాస్‌’విధానం కింద 21 రోజుల్లో భవన నిర్మాణ అనుమతులు జారీ చేయాల్సిందేనని, ఈ విషయంలో రాజీపడబోమని పురపాలక శాఖ మంత్రి కె.తారకరామారావు స్పష్టంచేశారు. ఏప్రిల్‌ 2 నుంచి రాష్ట్రంలోని 141 మున్సిపాలిటీలు, నగరపాలక సంస్థలతో పాటు ఆరు పట్టణాభివృద్ధి సంస్థల పరిధిలో టీఎస్‌–బీపాస్‌ను అమలు చేస్తామన్నారు. టీఎస్‌–ఐపాస్‌ ద్వారా పరిశ్రమలకు 35 రకాల అనుమతులను వేగంగా జారీ చేస్తున్నామన్నారు. భవన నిర్మాణాలకు అగ్నిమాపక, విద్యుత్, ట్రాఫిక్, టౌన్‌ ప్లానింగ్‌ శాఖల అనుమతులను టీఎస్‌–బీపాస్‌ ద్వారా సింగిల్‌ విండోలో జారీ చేస్తామన్నారు. అనుమతుల జారీలో జాప్యం చేసే అధికారులను బాధ్యు లు చేసి వారిపై జరిమానాలు విధించాలని యోచిస్తున్నామన్నారు. మున్సిపల్‌ కమిషనర్లు, టౌన్‌ ప్లానింగ్‌ సిబ్బందితో మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో గురువారం కేటీఆర్‌ సమావేశం నిర్వహించారు. రాష్ట్ర పారిశ్రామిక విధానం టీఎస్‌–ఐపాస్‌ తరహాలోనే టీఎస్‌–బీపాస్‌ను ప్రభు త్వం తెస్తోందని, దీనికి అమలుకు సమాయత్తం కావాలన్నారు.

హైదరాబాద్‌ నుంచి పర్యవేక్షిస్తాం 
పురపాలనలో అవినీతి అరికట్టేలా కఠిన చట్టాలు, విధానాలు రూపకల్పన చేస్తున్నామని, వీటి అమలులో కూడా అంతే కఠినంగా వ్యవహరిస్తామని కేటీఆర్‌ అన్నారు.  ఎవరైనా అధికారి అవినీతికి పాల్పడినట్లు రుజువైతే సస్పెన్షన్‌ వంటి నామమాత్రపు చర్యలు కాకుండా విధుల నుంచి పూర్తిస్థాయిలో తొలగించే కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు. భవన నిర్మాణ అనుమతులను హైదరాబాద్‌ నుంచి ప్రత్యేకంగా పర్యవేక్షిస్తామన్నారు. టౌన్‌ ప్లానింగ్‌ విభాగంలో సిబ్బంది కొరతను అధిగమించేందుకు ఔట్‌సోర్సింగ్‌ సిబ్బంది నియామకాలకు అనుమతిస్తామన్నారు. టీఎస్‌పీఎస్సీ ద్వారా రెగ్యులర్‌ నియామకాలు జరిగే వరకు ఈ వెసులుబాటు కల్పిస్తామన్నారు.

పౌరులే కేంద్రంగా పాలన 
పౌరులే కేంద్రంగా పురపాలన జరగాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి కేటీఆర్‌ స్పష్టం చేశారు. కొత్త మున్సిపల్‌ చట్టాన్ని మున్సిపల్‌ కమిషనర్లు జాబ్‌చార్ట్‌గా పరిగణించాలని సూచించారు. ప్రజల ఆకాంక్షలకు తగ్గట్టు పని చేయాలన్నారు. వికేంద్రీకరణ ఫలాలు ప్రజలకు అందా లంటే స్థానిక కమిషనర్లు తమతో పాటు పనిచేసే సిబ్బందితో, స్థానిక ప్రజలతో కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు.

పారిశుద్ధ్యమే ప్రాథమిక విధి.. 
కొత్త మున్సిపల్‌ చట్టంలోని పారిశుద్ధ్యం, పచ్చదనం, పౌర సేవలు, పురపాలనలో ఆన్‌లైన్‌ సేవ లు, సాంకేతిక వినియోగం, ఫిర్యాదుల పరి ష్కారం, అవినీతి నిర్మూలనకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తోందని గుర్తించుకోవాలని కేటీఆర్‌ చెప్పారు. పారిశుద్ధ్యం ప్రాథమిక విధి అని, తెల్లవారు జాము 4:30 గంటలకే కమిషనర్లు రోడ్ల మీదకు వచ్చిన పారిశుద్ధ్య పనులను పర్యవేక్షించాలన్నారు. పట్టణాలు, నగరాల్లో అవసరమైన రీతిలో పబ్లిక్‌ టాయిలెట్లను ఏర్పాటు చేయాలన్నారు. మహిళలకు ‘షీ టాయి లెట్ల’ను ఏర్పాటు చేయాలన్నారు. కొత్త మున్సిపల్‌ చట్టం ప్రకారం మున్సిపల్‌ బడ్జెట్‌లో 10% నిధులను హరిత ప్రణాళిక అమలుకు ఖర్చు చేయాలన్నారు.    

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top