ఏడింటిలో ఆరు మున్సిపాలిటీలు కారు కైవసం

TRS Wins Six Municipalities In Nalgonda - Sakshi

 ఒక్క చోటనే జెండా పాతిన కాంగ్రెస్‌

నల్లగొండలో ఐదు ఎక్స్‌ అఫీషియో ఓట్లతో టీఆర్‌ఎస్‌ గెలుపు

ఖంగుతిన్న కాంగ్రెస్‌

ఓటింగ్‌కు దూరంగా టీచర్స్‌ ఎమ్మెల్సీ నర్సిరెడ్డి

సాక్షి ప్రతినిధి, నల్లగొండ: పుర ఎన్నికల్లోనూ గులాబీ జెండా రెపరెపలాడింది. సోమవారం ముగిసిన మున్సిపాలిటీల చైర్మన్, వైస్‌ చైర్మన్‌ ఎన్నికల్లో ఆ పార్టీ తన పట్టును నిరూపించుకుంది. జిల్లాలోని ఏడు మున్సిపాలిటీల్లో ఆరు చోట్ల మున్సిపల్‌ పీఠాలను టీఆర్‌ఎస్‌ కైవసం చేసుకుంది. చండూరు మున్సిపాలిటీ మాత్రమే కాంగ్రెస్‌ పరం కాగా నల్లగొండ, మిర్యాలగూడ, హాలియా, నందికొండ, దేవరకొండ, చిట్యాల మున్సిపాలిటీల చైర్మన్,  వైస్‌ చైర్మన్‌ పదవులను ఆ పార్టీ గెలుచుకుంది. కాగా, నల్లగొండ మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ ఎన్నిక మాత్రం మంగళవారానికి వాయిదా పడింది. చైర్మన్, వైస్‌ చైర్మన్‌ పదవుల కోసం జరిగిన ఎన్నికలు ఉత్కంఠకు తెరలేపగా, మూడు మున్సిపాలిటీల్లో టీఆర్‌ఎస్‌కు ఎక్స్‌ అఫిషియో సభ్యుల ఓట్లే ఆధారమయ్యాయి. దీంతో మరీ ఎక్కువ నాటకీయ పరిణామాలేం లేకుండానే ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. ఆయా మున్సిపాలిటీల్లో కో–ఆప్షన్‌ సభ్యుల ఎన్నిక, నల్లగొండ మున్సిపాలిటీ వైస్‌ చైర్మన్‌ ఎన్నిక మాత్రమే మిగిలి ఉంది.

గండం గట్టెక్కించిన ఎక్స్‌ అఫీషియో ఓట్లు
మున్సిపల్‌ ఫలితాల్లో టీఆర్‌ఎస్‌ మిర్యాలగూడ, నందికొండ, దేవరకొండలో మాత్రమే స్పష్టమైన మెజారిటీ సాధించింది. హాలియా, నల్గొండ, చిట్యాల మున్సిపాలిటీల్లో సరిపడా మెజారిటీ రాలేదు. చండూరులో టీఆర్‌ఎస్‌కు అసలు అవకాశమే లేకుండా పోయింది. కాగా, మూడు మున్సిపాలిటీల్లో హాలియాలో స్వతంత్ర అభ్యర్ధి (టీఆర్‌ఎస్‌ తిరుగుబాటు) మద్దతు కూడగట్టడంతో ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే ఓటుతో బయట పడింది. చిట్యాల మున్సిపాలిటీలో సైతం ఆరు స్థానాలకు గెలుచుకుని యాభై శాతం మెజారిటీ సాధించిన ఆ పార్టీకి ఒక్క ఓటు అవసరం పడింది. స్థానిక ఎమ్మెల్యే ఓటుతో ఆ మున్సిపాలిటీ కూడా టీఆర్‌ఎస్‌ తన వశం చేసుకుంది.

నల్లగొండలో ఐదు ఎక్స్‌ అఫీషియో ఓట్ల వినియోగం
నల్లగొండ మున్సిపాలిటీలోని 48 వార్డుల్లో టీఆర్‌ఎస్‌ 20, కాంగ్రెస్‌ 20 వార్డులు గెలుచుకుని సమానంగా నిలిచాయి. ఆరు స్థానాలున్న బీజేపీ మద్దతు ఏ పార్టీకైనా కీలకం అయ్యింది. టీఆర్‌ఎస్‌ తిరుగుబాటు అభ్యర్థి ఓటు, ఎంఐఎం ఓటును టీఆర్‌ఎస్‌ కూడగట్టింది. ఈ పరిస్థితిలో మున్సిపాలిటీని దక్కించుకోవాలంటే బీజేపీ మద్దతు లేకుండా బయటపడాలంటే మరో ఐదు ఓట్లు అవసరం పడ్డాయి. దీంతో స్థానిక ఎమ్మెల్యే ఓటుకు తోడు మరో నలుగురు ఎమ్మెల్సీల ఓట్లను టీఆర్‌ఎస్‌ ఇక్కడ కేటాయించింది. దీంతో టీఆర్‌ఎస్‌కు 27 ఓట్లు సమకూరడంతో ఎన్నికల్లో సమస్యలేకుండా అయ్యింది. కాగా, చైర్మన్‌ పదవికి కాంగ్రెస్‌ నుంచి 32వ వార్డు కౌన్సిలర్‌ బుర్రి శ్రీనివాస్‌ రెడ్డి పోటీ పడగా, టీఆర్‌ఎస్‌ నుంచి 17వ వార్డు కౌన్సిలర్‌ మందడి సైదిరెడ్డి పోటీ చేశారు.

కాంగ్రెస్‌ సభ్యులంతా బుర్రి శ్రీనివాస్‌ రెడ్డికి అనుకూలంగా చేతులు ఎత్తి తమ మద్దతు తెలపగా.. టీఆర్‌ఎస్‌ అభ్యర్థి మందడి సైదిరెడ్డి అనుకూలంగా 22 మంది సభ్యులతోపాటు ఐదుగురు ఎక్స్‌ అఫీషియో సభ్యులు చేతులు ఎత్తడంతో 27 ఓట్లు వచ్చాయి. దీంతో ఆయన చైర్మన్‌గా ఎన్నికైనట్లు ప్రకటించారు. కాగా చైర్మన్‌ ఎన్నిక సమయంలో బీజేపీ ఎవరికీ మద్దతు ఇవ్వకుండా తటస్థంగా ఉంది. శాసన మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి, డిప్యూటీ చైర్మన్‌ నేతి విద్యాసాగర్, మండలిలో ప్రభుత్వ చీఫ్‌ విప్‌ పల్లా రాజేశ్వర్‌ రెడ్డి, తేరా చిన్నపరెడ్డి నల్లగొండ మున్సిపాలిటీలో తమ ఓటును వినియోగించుకున్నారు.

రాత్రికి రాత్రి ప్లేటు మార్చిన బీజేపీ
నల్లగొండ మున్సిపల్‌ ఎన్నికల్లో అభ్యర్థుల ఖరారు, టికెట్ల కేటాయింపు దశ నుంచే కాంగ్రెస్, బీజేపీ అవగాహనతో కలిసి పనిచేశాయి. ఈ మేరకు కొన్ని వార్డుల్లో కాంగ్రెస్‌ తన అభ్యర్థులను కూడా పోటీకి పెట్టలేదు. మరికొన్ని చోట్ల బలహీనమైన అభ్యర్థులను నిలబెట్టింది. ఎన్నికల ఫలితాల తర్వాత కాంగ్రెస్, బీజేపీ కలిసి ఉమ్మడిగా మున్సిపల్‌ పాలకవర్గాన్ని ఏర్పాటు చేస్తాయని ప్రచారం జరిగింది. దీంతో టీఆర్‌ఎస్‌ జాగ్రత్త పడి ఎక్స్‌ అఫీషియో ఓట్లతో బయటపడేలా ప్లాన్‌ చేసుకుంది. అయితే.. చైర్మన్‌ ఎన్నిక సందర్భంగా బీజేపీ సభ్యులు కాంగ్రెస్‌ అభ్యర్థికి అనుకూలంగా చేతులు ఎత్తలేదు. అలా అని టీఆర్‌ఎస్‌ అభ్యర్థికీ అనుకూలంగా ఎత్తలేదు.

ఇలా తటస్థంగా ఉండేందుకు బీజేపీ సభ్యులు కొందరు టీఆర్‌ఎస్‌తో ఒప్పందం చేసుకున్నారని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. పెద్దమొత్తంలోనే డబ్బు చేతులు మారడంతో పాటు మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ పోస్టును బీజేపీ కేటాయించేలా ఒప్పందం కూడా జరిగిందని సమాచారం. మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ అభ్యర్థిగా 36వ వార్డు కౌన్సిలర్‌ బండారు ప్రసాద్‌ పేరు ప్రచారంలోకి కూడా వచ్చింది. కేవలం కొన్ని సాంకేతిక కారణాలతో వైస్‌ చైర్మన్‌ ఎన్నికను మంగళవారానికి వాయిదా వేయించారని అంటున్నారు. రాత్రికి రాత్రి బీజేపీ ప్లేటు ఫిరాయించి టీఆర్‌ఎస్‌ చంకలో చేరడంతో కాంగ్రెస్‌ ఖంగుతిన్నది. మొత్తంగా జిల్లాలో నల్లగొండలో ఈ పరిణామం మినహా ఏడు మున్సిపాలిటీల్లో ఎన్నికలు ఎలాంటి నాటకీయ పరిణామాలు లేకుండా ముగిశాయి.

► నీలగిరి మున్సిపాలిటీలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి మందడి సైదిరెడ్డికి అనుకూలంగా 22 మంది సభ్యులతోపాటు ఐదుగురు ఎక్స్‌ అఫీషియో సభ్యులవి కలిపి 27 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్‌ అభ్యర్థి బుర్రి శ్రీనివాస్‌రెడ్డికి అనుకూలంగా 20 ఓట్లు వచ్చాయి. దీంతో మందడి సైదిరెడ్డిని చైర్మన్‌గా ఎన్నికైనట్లు ప్రకటించారు. కాగా చైర్మన్‌ ఎన్నిక సమయంలో బీజేపీ ఎవరికీ మద్దతు ఇవ్వకుండా తటస్థంగా ఉంది.
-మందడి సైదిరెడ్డి, చైర్మన్‌ (టీఆర్‌ఎస్‌)

► హాలియా మున్సిపాలిటీలో టీఆర్‌ఎస్‌ పార్టీకి 6 ఓట్ల(ఒకరు టీఆర్‌ఎస్‌ రెబెల్‌)తో పాటు ఎక్స్‌ అఫీషియోగా ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య ఓటుతో కలిసి ఏడు రాగా,  కాంగ్రెస్‌ పార్టీకి మాత్రం ఆరు ఓట్లు వచ్చాయి. దీంతో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి వెంపటి పార్వతమ్మశంకరయ్యను మున్సిపల్‌ చైర్మన్‌గా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి ప్రకటించారు. 
- వెంపటి పార్వతమ్మ, చైర్మన్‌ (టీఆర్‌ఎస్‌)

► మిర్యాలగూడ మున్సిపల్‌ చైర్మన్‌గా తిరునగరు భార్గవ్‌కు 27మంది టీఆర్‌ఎస్‌ కౌన్సిలర్లతోపాటు ఒక బీజేపీ అభ్యర్థిని, ఎక్స్‌అఫీషియో సభ్యుడైన ఎమ్మెల్యే భాస్కర్‌రావు మొత్తం 29మంది చేతులెత్తారు. కాంగ్రెస్‌ అభ్యర్థి బత్తుల లక్ష్మారెడ్డికి 18 మంది కాంగ్రెస్‌ కౌన్సిలర్లు, ఒక సీపీఎం, ఒక స్వతంత్ర అభ్యర్థి మొత్తం 20 మంది చేతులెత్తారు. దీంతో భార్గవ్‌ను చైర్మన్‌గా ఎన్నికైనట్లుగా  ప్రకటించారు. 
- తిరునగరు భార్గవ్, చైర్మన్‌ (టీఆర్‌ఎస్‌)

► నందికొండ (నాగార్జున సాగర్‌) మున్సిపాలిటీ తొలి చైర్మన్‌గా కర్ణ అనుషారెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. చైర్‌పర్సన్‌గా కర్ణ అనూషారెడ్డిని బిన్ని ప్రతిపాదించారు. హిరేకార్‌ రమేష్‌జీ బలపర్చారు. ఒకటే నామినేషన్‌ రావడంతో అనూషారెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించారు. 
- కర్ణ అనూష, చైర్మన్‌ (టీఆర్‌ఎస్‌)

 దేవరకొండ మున్సిపాలిటీలో టీఆర్‌ఎస్‌ పార్టీ నుంచి 16వ వార్డుకు చెందిన కౌన్సిలర్‌ ఆలంపల్లి నర్సింహ పేరును మున్సిపల్‌ చైర్మన్‌ అభ్యర్థిగా 5వ వార్డు కౌన్సిలర్‌ వడ్త్య దేవేందర్‌ ప్రతిపాదించగా 17వ వార్డు కౌన్సిలర్‌ చిత్రం శ్రీవాణి బలపర్చింది. చైర్మన్‌ అభ్యర్థిగా నర్సింహ ఒక్కడే పోటీలో ఉండడంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవమైంది. 
- ఆలంపల్లి నర్సింహ, చైర్మన్‌ (టీఆర్‌ఎస్‌)

 చిట్యాల మున్సిపల్‌ చైర్మన్‌ ఎన్నికకు నకిరేకల్‌ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యతోపాటు టీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన ఆరుగురు కౌన్సిలర్లు హాజరయ్యారు. కాంగ్రెస్, ఫార్వర్డ్‌ బ్లాక్‌ పార్టీలకు చెందిన కౌన్సిలర్లు ప్రమాణస్వీకారం చేసిన ఆనంతరం బయటికి వెళ్లి తిరిగి రాలేదు. టీఆర్‌ఎస్‌ సభ్యుల బలం ఏడుగురికి చేరడంతో కోమటిరెడ్డి చినవెంకట్‌రెడ్డి చైర్మన్‌గా ఎన్నికైనట్లు ప్రకటించారు.
- కోమటిరెడ్డి చిన వెంకటరెడ్డి చైర్మన్‌ (టీఆర్‌ఎస్‌)

► చండూరు మున్సిపాలిటీలో పది మంది సభ్యులకుగాను ఏడు కాంగ్రెస్, ఒక్కటి బీజేపీ, 2 టీఆర్‌ఎస్‌ గెలుచుకుంది. కాంగ్రెస్‌ సభ్యులతో బీజేపీ జత కలవడంతో వీరి బలం 8కి చేరుకుంది. వీరందరూ కాంగ్రెస్‌ అభ్యర్థులకు అనుకూలంగా చేతులెత్తడంతో చైర్మన్, వైస్‌చైర్మన్లను గెలుచుకుంది.  
- తోకల చంద్రకళ, చైర్మన్‌ (కాంగ్రెస్‌)

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top