ఎమ్మెల్యేలకు ‘నివేదన’ పరీక్ష

TRS MLAS Tension Nizamabad - Sakshi

అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించతలపెట్టిన ప్రగతి నివేదన సభకు జన సమీకరణ ఎమ్మెల్యేలకు ఓ పరీక్షలా మారింది. జిల్లాలోని ప్రజాప్రతినిధులు  కేసీఆర్‌ దృష్టిని ఆకర్షించేలా జన సమీకరణ చేపట్టేందుకు సమాయత్తమవుతున్నారు. వచ్చే నెలలోనే ఆయా నియోజకవర్గాలకు పార్టీ అభ్యర్థిత్వాలను ప్రకటిస్తామని అధినేత ప్రకటించడంతో ఎన్నికల వేడి రాజేసి నట్లయ్యింది. సిట్టింగ్‌లందరికీ టిక్కెట్లు ఇస్తామని, రాని వారికి ప్రత్యామ్నాయ పదవులు కేటాయిస్తామని స్పష్టత ఇవ్వడంతో ఎమ్మెల్యేల్లో టిక్కెట్ల టెన్షన్‌ పెరిగింది. ఉమ్మడి జిల్లాలో అధికార పార్టీ ఎమ్మెల్యేలే ఉన్నారు.

సాక్షిప్రతినిధి, నిజామాబాద్‌: అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించతలపెట్టిన ప్రగతి నివేదన సభకు జన సమీకరణ ఎమ్మెల్యేలకు ఓ పరీక్షలా మారింది. వచ్చే నెలలోనే ఆయా నియోజకవర్గాలకు పార్టీ అభ్యర్థిత్వాలను ప్రకటిస్తామని అధినేత కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించడంతో.. జిల్లాలోని ప్రజాప్రతినిధులు పార్టీ శ్రేణులను తరలించడంపై ప్రత్యేక దృష్టి సారించాలని భావిస్తున్నారు. కేసీఆర్‌ దృష్టిని ఆకర్షించేలా జన సమీకరణ చేపట్టేందుకు సమాయత్తమవుతున్నారు. ఎన్నికల జోన్‌లోకి వచ్చేశామని, రేపే ఎన్నికలు అనుకుని సమాయత్తం కావాలి.. అని అధినేత కేసీఆర్‌ దిశానిర్దేశం చేయడంతో ఆ పార్టీ శ్రేణుల్లో ఎన్నికల వేడిని రాజేసింది.

మరోవైపు సిట్టింగ్‌లందరికీ టిక్కెట్లు ఇస్తామని, రాని వారికి ప్రత్యామ్నాయ పదవులు కేటాయిస్తామని కేసీఆర్‌ స్పష్టత ఇవ్వడంతో ఎమ్మెల్యేల్లో టిక్కెట్ల టెన్షన్‌ పెరిగింది. ఈ సంకేతాలు ఒక రకంగా టిక్కెట్ల రేసులో ఉన్న ఆశావహుల్లో ఆశలు రేకెత్తించినట్లయింది. ఉమ్మడి జిల్లా పరిధిలోని తొమ్మిది నియోజకవర్గాల్లోనూ అధికార పార్టీ ఎమ్మెల్యేలే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అభ్యర్థులను మార్పు చేయాల్సిన వారిలో జిల్లాలో ఏ నియోజకవర్గం ఉంటుంది.. అనే అంశంపై పార్టీ శ్రేణుల్లో జోరుగా చర్చ సాగుతోంది.

ఉమ్మడి జిల్లా నుంచి రెండు లక్షల మంది.. 
జాతీయ రాజకీయ వర్గాల దృష్టిని సైతం ఆకర్షించేలా అధికార పార్టీ సెప్టెంబర్‌ 2న రంగారెడ్డి జిల్లా కొంగరకలాన్‌ శివారులో ప్రగతి నివేదన  భారీ బహిరంగ సభను నిర్వహించాలని నిర్ణయిం చారు. ఈ మేరకు శుక్రవారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ లు, రాష్ట్ర కార్యవర్గం నేతల సమావేశం అనంతరం జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్రత్యేకంగా మంత్రి పోచారం నివాసంలో సమావేశమయ్యా రు. నియోజకవర్గానికి 20 వేల నుంచి 25 వేల మందిని తరలించాలని నిర్ణయించారు. హైదరాబాద్‌కు సమీపంలో ఉన్న కామారెడ్డి, ఎల్లారెడ్డి వం టి నియోజకవర్గాల నుంచి ఎక్కువ సంఖ్యలో శ్రే ణులను తీసుకెళ్లేలా ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. లారీలు, అందుబాటులో ఉన్న అన్ని రకా ల వాహనాల్లో తరలివెళ్లేలా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ట్రాక్టర్లలో తరలివెళ్లే వారు ఒక రోజు ముం దుగానే కొంగరకు చేరుకోవాలని భావిస్తున్నారు.
 
జిల్లా సమన్వయ కర్తగా ప్రశాంత్‌రెడ్డి..  
ప్రగతి నివేదన సభకు ఆయా నియోజకవర్గాల్లో జన సమీకరణకు ఇన్‌చార్జిగా జిల్లా మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి వ్యవహరిస్తున్నారు. జిల్లా సమన్వయకర్తగా మిషన్‌ భగీరథ వైస్‌ చైర్మన్‌ వేముల ప్రశాంత్‌రెడ్డిని నియమించారు. ఇద్దరు నేతల పర్యవేక్షణలో శ్రేణుల తరలింపు జరగనుంది. కాగా మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి నివాసంలో శుక్రవారం నిర్వహించిన సమాయత్త సమావేశానికి జిల్లాకు చెందిన రాష్ట్ర కార్యవర్గ నేతలను ఆహ్వానించకపోవడం పట్ల సదరు నేతలు అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం.

అన్ని బస్సులు ఇవ్వండి.. 
ప్రగతి నివేదన సభకు జనాలను తరలించేందుకు ఆర్టీసీ బస్సులను కేటాయించాలని ఆ సంస్థ అధికారులకు విజ్ఞప్తి అందింది. జిల్లా వ్యాప్తంగా ఉన్న అద్దె బస్సులతో సహా.. అన్ని బస్సులను కూడా ఈ సభకు తీసుకెళ్లాలని దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం. రీజియన్‌ పరిధిలోని ఆరు డిపోల్లో ఉన్న 520 బస్సులను తీసుకెళ్లాలని భావిస్తున్నా రు. ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా.. ఒ క్కో డిపోకు 50 నుంచి 60 వరకు బస్సులను కేటాయిస్తామని ఆర్టీసీ అధికారులు పేర్కొంటున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top