నిరసన సెగలు

TRS Leaders Protest For MLA Tickets In Khammam - Sakshi

టీఆర్‌ఎస్‌ అభ్యర్థుల విషయంలో వైరా, సత్తుపల్లి నియోజకవర్గాల్లో నిరసన సెగలు ఎగసిపడుతున్నాయి. వైరాలో తాజా మాజీ ఎమ్మెల్యే బానోత్‌ మదన్‌లాల్, సత్తుపల్లిలో ఎస్సీ కార్పొరేషన్‌ చైర్మన్‌ పిడమర్తి రవి అభ్యర్థిత్వాలను మార్చాలంటూ ఆ పార్టీకి చెందిన కొందరు నేతలు సమావేశాలు నిర్వహిస్తూ.. నిరసన వ్యక్తం చేస్తున్నారు. ప్రదర్శనలు, బైక్‌ ర్యాలీలు నిర్వహిస్తూ.. ప్రస్తుతం ప్రకటించిన అభ్యర్థిత్వాలను పునఃపరిశీలించాలని డిమాండ్‌ చేస్తున్నారు. వైరాలో పలువురు ప్రజాప్రతినిధులు తమ పదవులకు రాజీనామా చేసి.. ప్రతులను సీఎం కేసీఆర్‌కు ఫ్యాక్స్‌ ద్వారా పంపించారు. సత్తుపల్లిలో డాక్టర్‌ మట్టా దయానంద్‌ మాట్లాడుతున్న సభలోనే ఓ వ్యక్తి ఒంటిపై పెట్రోల్‌ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.
 
సత్తుపల్లి: సీఎం కేసీఆర్‌ను చేతులు జోడించి అడుగుతున్నా.. గెలిచే వ్యక్తికి సీటు ఇవ్వండి.. రాజకీయాల్లోకి వచ్చి సంపాదించాలనే ఉద్దేశం లేదు.. ఓడిపోయినా.. ప్రజల మధ్యనే ఉన్నా..  నిజాయితీగా రాజకీయాలు చేశా.. ప్రజల ఆకాంక్ష .. స్థానికుడికే సీటు ఇవ్వాలంటూ డాక్టర్‌ మట్టా దయానంద్‌ విజయ్‌కుమార్‌  విజ్ఞప్తి చేశారు. టీఆర్‌ఎస్‌ పార్టీ టికెట్‌ స్థానికుడికే ఇవ్వాలంటూ మంగళవారం తల్లాడ నుంచి సత్తుపల్లి వరకు భారీ మోటారు సైకిల్‌ ర్యాలీ నిర్వహించారు. అనంతరం సత్తుపల్లిలోని ఎంఆర్‌ఆర్‌ గార్డెన్స్‌లో జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ ఒకసారి సత్తుపల్లి టికెట్‌ పునఃపరిశీలించి న్యాయం చేయాలని కోరారు. గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయాను.. పదవిలో లేకున్నా ప్రజల కోసమే పని చేస్తున్నా. ఉన్నదంతా ఖర్చుపెట్టుకున్నాను.. ఇప్పటికీ నా భార్య డాక్టర్‌ రాగమయి  డబ్బుతోనే తిరుగుతున్నానంటూ భావోధ్వేగానికి లోనయ్యారు.

కందుకూరులో జరిగిన అభివృద్ధి కార్యక్రమంలో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, హరీష్‌రావు పాల్గొన్న సమయంలో ‘దయానంద్‌  మా పార్టీలోకి రండి.. టీఆర్‌ఎస్‌ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ ఇస్తాను అని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్వయంగా చెప్పారు’.దయానంద్‌ సతీమణి డాక్టర్‌ రాగమయి మాట్లాడుతూ  మా సంపాదనలో 90 శాతం ప్రజలకు ఖర్చు చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో లక్కినేని రఘు, ఏనుగు సత్యంబాబు, కోటగిరి శ్రీనివాసరావు, చెక్కిలాల మోహన్‌రావు, మలిరెడ్డి మురళీరెడ్డి, అట్లూరి సత్యనారాయణరెడ్డి, వేమురెడ్డి కృష్ణారెడ్డి, గోపిశెట్టి వెంకటేశ్వర్లు, ఎండీ కమల్‌పాషా, నారాయణవరపు శ్రీనివాస్, మొరిశెట్టి సాంబ, ఫయాజ్‌ అలీ పాల్గొన్నారు.

టికెట్‌ ఇవ్వాలని ఆత్మహత్యాయత్నం 
సత్తుపల్లి:  దయానంద్‌కు టికెట్‌ ఇవ్వాలన్న డిమాండ్‌తో సత్తుపల్లి మండలం రేజర్ల గ్రామస్తుడు సాలి నాగరాజు, బుధవారం  ఒంటిపై పెట్రోల్‌ పోసుకున్నాడు. అగ్గిపుల్ల గీయబోతుండగా కొందరు అడ్డుకున్నారు. నీళ్లు తీసుకొచ్చి అతడిపై పోశారు. ఇలాంటి ప్రయత్నాలు చేయవద్దంటూ నాగరాజును విజయ్‌కుమార్‌ కోరారు.
  
వెంకటరావు టికెట్‌ రద్దు చేయాలని..
సూపర్‌బజార్‌(కొత్తగూడెం): కొత్తగూడెం టీఆర్‌ఎస్‌ శాసనసభ అభ్యర్థిగా జలగం వెంకటరావుకు ఇచ్చిన టికెట్‌ను రద్దు చేయాలని కోరుతూ ఖమ్మం పార్లమెంట్‌ సభ్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి వర్గీయులు పట్టణంలో మంగళవారం ప్రదర్శన నిర్వహించి బస్టాండ్‌ సెంటర్‌లోని అమరవీరుల స్థూపం వద్ద ధర్నా చేశారు. పోలీసులు ప్రదర్శనను అడ్డుకునే ప్రయత్నం చేసిన సందర్భంలో ఆందోళనకారులకు, పోలీసులకు వాగ్వావాదం జరిగింది.  

టీఆర్‌ఎస్‌ నాయకుడు బండి రాజుగౌడ్, నాగబాబు, రషీద్, రాజేంద్రప్రసాద్‌ మాట్లాడుతూ ప్రజల్లో మమేకమయ్యే వ్యక్తులు ఎమ్మెల్యేగా ఉండాలని అన్నారు. గడిచిన నాలు గున్నర సంవత్సరాల కాలంలో కొత్తగూడెంలో  వెంకటరావు కార్యకర్తలు, ప్రజలతో మమేకం కాలేకపోయారని ఆరోపించారు. కేసీఆర్‌ వద్దకు 50 బస్సుల్లో త్వరలో వెళ్లి జలగంకు టికెట్‌ను రద్దు చేయాలని కోరనున్నట్లు పేర్కొన్నారు. కౌన్సిలర్లు దుంపల అనురాధ, రాజేశ్వరి, ఎంపీటీసీ రుక్మిణి, మాజీ సర్పంచ్‌ గొగ్గెల లక్ష్మి, నాయకులు కనుకుంట్ల శ్రీనివాస్, హుస్సేన్, పప్పు సుబ్బారావు, రవిగౌడ్, లవకుమార్‌  పాల్గొన్నారు.

మదన్‌లాల్‌ అభ్యర్థిత్వాన్ని పునః పరిశీలించాలని సీఎంకు ఫ్యాక్స్‌
వైరా:  వైరా నియోజకవర్గ అభ్యర్థి బాణోత్‌ మదన్‌లాల్‌ అభ్యర్థిత్వంపై నియోజకవర్గ వ్యాప్తంగా వ్యతిరేకత వ్యక్తమవుతుంది. మంగళవారం  నియోజకవర్గంలోని పలువురు ప్రజా ప్రతినిధులు రాజీనామా చేశారు. వారిలో జెడ్పీటీసీ సభ్యులు బొర్రా ఉమాదేవి, తేజావత్‌ సోమ్లా నాయక్‌తో పాటుగా ఎంపీపీలు బాణోత్‌ మాధవి, బాణోత్‌ పద్మావతి, వైస్‌ ఎంపీపీలు తాళ్లూరి చిన్నపుల్లయ్య, ఇమ్మడి రమాదేవి, ఎంపీటీసీ సభ్యులు ముళ్లపాటి సీతారాములు, మడుపల్లి సాయమ్మ, శీలం ఆదినారాయణరెడ్డి, అలోత్‌ ఈశ్వరీబాయి, గుగులోత్‌ హీరాణి, బోడా కృష్ణవేణి, ఖాజా విజయరాణి,  రూతమ్మ, బంకా లేయమ్మ, కేశగాని కృష్ణవేణి, వి.సుహాసిని, గుగులోత్‌ రాందాసు, భూక్యా అబ్రి, గరికపాడు సొసైటీ చైర్మన్‌ శీలం సురేందర్‌రెడ్డి, ఏఎంసీ వైస్‌ చైర్మన్‌లు ముక్తి వెంకటేశ్వర్లు, రాయల పుల్లయ్య రాజీనామా పత్రాలను సీఏం కేసీఆర్‌కు ఫ్యాక్స్‌ ద్వారా పంపించారు.

ఈ సందర్భంగా పలువురు ప్రజా ప్రతిని ధులు మాట్లాడుతూ నియోజకవర్గంలో టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థిగా బాణోత్‌ మదన్‌లాల్‌ ఉంటే పార్టీ గెలవటం అసాధ్యమని, అన్ని మండలాల్లో పార్టీ కార్యకర్తలు వ్యతిరేకతతో ఉన్నారన్నారు.  కార్యకర్తలను ఇబ్బందులకు గురి చేస్తూ పార్టీ కోసం పనిచేసే వారిపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడి వే«ధింపులకు గురిచేశారని, ఆయన అభ్యర్థిత్వాన్ని పునః పరిశీలించాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో  పార్టీ జిల్లా నాయకులు బొర్రా రాజశేఖర్, సూత కాని జైపాల్, గుమ్మా రోశయ్య, కొప్పురావూరి వెంకటకృష్ణ, జాలాది రామకృష్ణ, మండేపూడి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top