కారు.. ప్రచార జోరు

TRS Leaders Election Campaign  Nizamabad - Sakshi

అసెంబ్లీ రద్దు రోజే అభ్యర్థులను ప్రకటించిన అధికార పార్టీ.. ప్రచారంలో దూసుకుపోతోంది. అభ్యర్థులు గ్రామాలను చుట్టివస్తున్నారు. ఎన్నికల షెడ్యూల్‌ కూడా విడుదల కావడంతో కారు జోరు మరింత పెంచారు. గెలుపే లక్ష్యంగా సర్వశక్తులను ఒడ్డుతున్నారు. చేసిన అభివృద్ధిని వివరిస్తూనే ప్రత్యర్థులను బలహీనపరచడానికి వలసలను ప్రోత్సహిస్తూ ముందుకు సాగుతున్నారు. 

సాక్షి, కామారెడ్డి: టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు జిల్లాలో ప్రచారాన్ని ఉధృతం చేశారు. నాలుగేళ్లలో చేసిన అభివృద్ధిని చెప్పుకుంటూ జిల్లాలోని నాలుగు నియోజక వర్గాల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులుగా ఉన్న తాజా మాజీ ఎమ్మెల్యేలు ప్రచారంలో దూసుకుపోతున్నారు. వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వారు సర్వశక్తులూ ఒడ్డుతున్నారు. గత నెల 6న ముఖ్యమంత్రి కేసీఆర్‌ శాసన సభను రద్దు చేసి, అదే రోజు అభ్యర్థులను ప్రకటించిన విషయం తెలిసిందే.. అప్పటినుంచి అభ్యర్థులు నియోజక వర్గాల్లో మకాం వేశారు. ప్రత్యర్థులను బలహీన పరిచేందుకు వలసలను ప్రోత్సహిస్తున్నారు. ఎదుటి పార్టీల్లో ఉన్న నేతలు, ప్రజాప్రతినిధులకు గాలం వేయడంతో పెద్ద ఎత్తున వలసలు జరిగాయి. నెల రోజులలో నాలుగు నియోజక వర్గాల్లో వేలాది మందికి గులాబీ కండువా కప్పారు. అసెంబ్లీ రద్దుకు ముందే అభివృద్ధి పనుల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల పేరుతో ఊళ్లను చుట్టివచ్చిన తాజా మాజీ ఎమ్మెల్యేలు.. ఇప్పుడు ఓట్ల కోసం మరోమారు పల్లెబాట పట్టారు.
 
కామారెడ్డిలో.. 
కామారెడ్డి నియోజక వర్గంలో టీఆర్‌ఎస్‌ పార్టీ నుంచి తాజా మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌ పోటీ చేస్తున్నారు. ఆయన నియోజకవర్గంలో విస్తృతం గా పర్యటిస్తున్నారు. ఇతర పార్టీలకు చెందిన జి ల్లా, మండల, గ్రామ స్థాయి నేతలను తమవైపు తి ప్పుకోవడంలో సఫలమైన గంప.. అందరినీ ఏక తాటిపైకి తీసుకువచ్చి ప్రచారాన్ని మొదలుపెట్టా రు. పది రోజులుగా నియోజక వర్గంలోనే పర్యటిస్తూ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరిస్తున్నారు. పనిలో పనిగా విపక్ష పార్టీల నేతలపైనా విరుచుకుపడుతున్నారు. కామారెడ్డిలో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా శాసన మండలి విపక్ష నేత షబ్బీర్‌అలీకి టికెట్టు దాదాపుగా ఖరారైందని భావిస్తున్నారు. ఆయన నియోజకవర్గంలో వలసలను ప్రోత్సహిస్తున్నారు. సభలు, ర్యాలీలు, సమావేశాలు నిర్వహించారు. పనిలోపనిగా అధికార పార్టీ నేతలపై ఆరోపణలు, విమర్శలు సంధిస్తున్నారు. ఇక్కడ బీజేపీ టికెట్టు జెడ్పీ మాజీ చైర్మన్‌ కాటిపల్లి వెంకటరమణారెడ్డికి వచ్చే అవకాశాలున్నాయి. ఆయన వివిధ సమస్యలపై ఉద్యమాల తో జనం నోట్లో నానుతున్నారు. ముఖ్యంగా యు వతను చైతన్యపరిచే కార్యక్రమాలు చేపట్టారు. మహిళల సమస్యలపైనా పోరాటాలు నిర్వహించారు.

బాన్సువాడలో.. 
బాన్సువాడ నియోజకవర్గంలో మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి విస్తృతంగా పర్యటిస్తూ ప్రచారం ని ర్వహిస్తున్నారు. నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో ఆయన చాలా గ్రామాలను చుట్టివచ్చారు. కుల సంఘాలను కలిసి మద్దతు కూడగడుతున్నారు. ఇక్కడ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి ఎవరన్నది తేలకపోవడంతో ఆ పార్టీ ప్రచారం అంతంతమాత్రంగానే ఉంది. ఇతర పార్టీల పరిస్థితీ అంతే..

ఎల్లారెడ్డిలో.. 
ఎల్లారెడ్డి నియోజకవర్గంలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి, తాజా మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి ప్రచారాన్ని ఉధృతం చేశారు. మొదట్లో ఇతర పార్టీల నేతలను తనవైపు తిప్పుకోవడం, అసంతృప్తితో ఉన్న సొంత పార్టీ నేతలను బుజ్జగించడం చేశారు. మాజీ మంత్రి నేరెళ్ల ఆంజనేయులుతో పాటు ఆయన అనుచరులను బీజేపీనుంచి టీఆర్‌ఎస్‌లో చేర్చుకున్నారు. ఇక్కడ కాంగ్రెస్‌ కూడా బలంగానే ఉంది. అయితే అభ్యర్థిని ప్రకటించపోవడంతో ఆ పార్టీ ఆశావహుల్లో టెన్షన్‌ నెలకొంది. అయినప్పటి కీ నలుగురు అభ్యర్థులు కలిసి ప్రచారంలో పా ల్గొంటున్నారు. ఎవరికి టికెట్టిచ్చినా కలిసి ప్రచా రం చేసి, గెలిపించుకుంటామని చెబుతున్నారు.

జుక్కల్‌లో.. 
జుక్కల్‌ నియోజకవర్గంలో తాజా మాజీ ఎమ్మెల్యే హన్మంత్‌సింధే విస్తృతంగా పర్యటిస్తున్నారు. గ్రామాలకు వెళ్లి ప్రజలను కలిసి ఓట్లు అభ్యర్థిస్తున్నారు. తన హయాంలో జరిగిన అభివృద్ధిని చూసి గెలిపించాలని కోరుతున్నారు. పక్షం రోజులుగా ఆయన నియోజకవర్గంలో మకాం వేసి ప్రచారంలో పాల్గొంటున్నారు. ఇక్కడ కాంగ్రెస్‌ పార్టీ నుంచి పలువురు టికెట్టు ఆశిస్తున్నారు. ముఖ్యంగా మాజీ ఎమ్మెల్యేలు గంగారాం, అరుణతారల మధ్య టికెట్టు కోసం పోటీ నెలకొంది. ఇద్దరూ నియోజకవర్గంలో తిరుగుతున్నారు. అయితే టికెట్టు ఎవరిని వరిస్తుందన్న దానిపై సస్పెన్స్‌ కొనసాగుతోంది. మిగతా పార్టీలు అభ్యర్థుల ఎంపిక కసరత్తులోనే ఉండగా.. టీఆర్‌ఎస్‌ మాత్రం ప్రచారంలో దూసుకుపోతోంది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top