
సాక్షి, సిద్దిపేట: ‘ఒక ప్రాంతం అభివృద్ధిలో రోడ్లు, ఇతర రవాణా మార్గాలు కీలక పాత్ర పోషిస్తాయి. అందుకే టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రహదారుల పునరుద్ధరణ, స్థాయి పెంపు, కొత్త మార్గాల ఏర్పాటుకు ప్రభుత్వం విరివిగా నిధులు కేటాయించింది’అని రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. గురువారం సిద్దిపేట కలెక్టర్ కార్యాలయంలో జరిగిన సమీక్షా సమావేశంలో మంత్రి మాట్లాడారు. ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు తెలంగాణలో కేవలం 136 కిలోమీటర్ల మేరకు జాతీయ రహదారి ఉండేదని.. ప్రస్తుతం అది 692 కిలోమీటర్లకు పెరిగిందని తెలిపారు.
కాగా, ఉమ్మడి మెదక్ జిల్లాలో 400 కిలోమీటర్ల పొడవున రోడ్ల ను నాలుగు లైన్ల రహదారిగా అప్‌గ్రేడ్ చేస్తున్నామని వెల్లడించారు. జాతీయ రహదారుల అథారిటీ ఆధ్వర్యంలో ఎల్కతుర్తి, సిద్దిపేట, రామాయంపేట, మెదక్ మీదుగా ఈ రహదారి వెళ్తుందని చెప్పారు. అదేవిధంగా జనగామ, సిద్దిపేట, సిరిసిల్ల మీదుగా మరో రహదారి అభివృద్ధి పనులను త్వరలో ప్రారంభిస్తామని చెప్పారు. దీనికి అవసరమైన భూసేకరణను త్వరితగతిన చేయాలని అధికారులను ఆదేశించారు.
గ్రామాలలో ఫుట్‌పాత్‌లు, డ్రైనేజీ, డివైడర్లు, జంక్షన్లను అభివృద్ధి చేయాలని, రోడ్లు సుందరంగా ఉండేలా చర్యలు చేపట్టాలని ఆర్‌అండ్‌బీ అధికారులను ఆదేశించారు. జాతీయ రహదార్లపై జరిగే ప్రమాదాలను అరికట్టేందుకు సిద్దిపేట సమీపంలోని పొన్నాల వద్ద రూ.30 కోట్లతో ప్లైఓవర్ నిర్మాణం చేపట్టేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని, దీనితోపాటు గజ్వేల్ ఔటర్ రింగ్‌రోడ్డు పనులు వేగవంతం చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. సమావేశంలో రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, కలెక్టర్ వెంకట్రామిరెడ్డి, పోలీస్ కమిషనర్ జోయల్ డేవిస్, ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ రవీందర్‌రావు, ఈఈ సుదర్శన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.