మెదక్ జిల్లాలో చిత్రమైన ఘటన జరిగింది. ఇద్దరి మరణానికి కారణమైన ఓ ట్రాక్టర్.. తనంతట తానే బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది.

మెదక్ జిల్లాలో చిత్రమైన ఘటన జరిగింది. ఇద్దరి మరణానికి కారణమైన ఓ ట్రాక్టర్.. తనంతట తానే బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. ఇలా ఎందుకు జరిగిందో చూసేవాళ్లెవరికీ అర్థం కాలేదు. విషయం ఏమిటంటే.. మెదక్ జిల్లా శివంపేట మండలం చండి గ్రామంలో కరెంటు స్తంభాల లోడుతో వెళ్తున్న ఓ ట్రాక్టర్.. దారిలో వెళ్తున్న నలుగురిని ఢీకొంది. దాంతో ఇద్దరు మరణించగా, మరో ఇద్దరు గాయపడ్డారు. ట్రాక్టర్ వెనక ఉండే ట్రైలర్ తిరగబడింది. రోడ్డు వారగా ఉన్న ట్రాక్టర్.. ట్రైలర్ రెండూ ట్రాఫిక్‌కు అడ్డంగా ఉండటంతో ఓ పొక్లెయిన్‌ను రప్పించి, దాంతో ట్రైలర్‌ను సరిచేశారు.
ఆ వెంటనే ట్రాక్టర్ దానంతట అదే రోడ్డు దిగువన ఉన్న పొలంలోకి వెళ్లిపోయింది. అక్కడే ఉన్న స్థానికులు దాన్ని ఆపేందుకు చాలా ప్రయత్నించారు. మధ్యలో గట్లు అడ్డు వచ్చినా కూడా ఆగకుండా ట్రాక్టర్ మధ్యమధ్యలో తన దారి కూడా మార్చుకుంటూ.. నేరుగా వెళ్లి పొలంలో ఉన్న ఓ బావిలో పడిపోయింది. దాని వెంట పరుగుపెడుతున్న ప్రజలు ఒక్కసారిగా అక్కడ ఆగిపోయి.. ఇలా జరిగిందేంటబ్బా అని ఆశ్చర్యపోయారు. దీనికి సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.