ఒక్క ఓటుతో ఇద్దరం ఎమ్మెల్యేలుగా పనిచేస్తాం

TPCC Chief Uttam Kumar Reddy Comments on Huzurnagar Byelections - Sakshi

టీపీసీసీ చీఫ్, ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి  

చింతలపాలెం (హుజూర్‌నగర్‌) : హుజూర్‌నగర్‌లో ఒక ఓటుతో ఇద్దరం ఎమ్మెల్యేలుగా పనిచేస్తామని టీపీసీసీ చీఫ్, ఎంపీ ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి అన్నారు. శనివారం హుజూర్‌నగర్‌ క్యాంప్‌ కార్యాలయంలో ఉత్తమ్‌ విలేకరులతో మాట్లాడారు. ఒక ఓటు వేసి పద్మావతిని గెలిపిస్తే తనతో పాటు పద్మావతి పని చేస్తారని పేర్కొన్నారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రుణమాఫీ చేయలేదని, డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లు, నిరుద్యోగ భృతి ఇవ్వలేదని, ప్రజను ఎలా ఓటు అడుతున్నారని ప్రశ్నించారు. మాదిగ సామాజిక వర్గానికి కేసీఆర్‌ మంత్రివర్గంలో చోటు కల్పించలేదని,  అందుకు మాదిగలు టీఆర్‌ఎస్‌ను బొందపెట్టేందుకు సిద్ధంగా ఉన్నారని  పేర్కొన్నారు. ఆర్టీసీ సమ్మెపై ముఖ్యమంత్రి బెదిరింపు మాటలకు ఎవరూ భయపడవద్దని అన్నారు. ఆర్టీసీని లాభాపేక్షతో చూడొద్దని సూచించారు. ఆర్టీసీ ఉద్యోగులకు పూర్తి మద్దతు, సంఘీభావం తెలియజేస్తున్నామని పేర్కొన్నారు.

హుజూర్‌నగర్‌లో రింగ్‌ రోడ్డు, కోర్టు బిల్డింగ్, తహసీల్దార్‌ కార్యాలయం, పోలీస్‌ స్టేషన్‌ తదితర అభివృద్ధి పనులు చేశానని గుర్తు చేశారు. పాలకీడు మండలంలో కాల్వ చివరి భూములకు నీరు రాకపోవడంతో కొత్తలిఫ్ట్‌ నిర్మాణం చేయిస్తానని హామీ ఇచ్చారు.  మిర్యాలగూడ, జగ్గయ్యపేట రైల్వే మార్గంలో ప్యాసింజర్‌ రైలు నడిపిస్తానని అన్నారు. హుజూర్‌నగర్‌ ప్రాంతలో ఈఎస్‌ఐ సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణం చేయిస్తానని చెప్పారు. మిర్యాలగూడెం – ఖమ్మం రోడ్డును విస్తరింపచేయిస్తానని, కేంద్ర ప్రభుత్వ నిధులతో అంతర్జాతీయ స్థాయి స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌ నిర్మాణం చేయిస్తానని చెప్పారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి కైలాష్‌ కుమార్, యరగాని నాగన్న గౌడ్, తన్నీరు మల్లిఖార్జున్‌  పాల్గొన్నారు.    

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top