నేడు జిల్లాకు టీపీసీసీ అధ్యక్షుడు ‘పొన్నాల’ | today ponnala lakshmaiah coming to district | Sakshi
Sakshi News home page

నేడు జిల్లాకు టీపీసీసీ అధ్యక్షుడు ‘పొన్నాల’

Nov 15 2014 3:28 AM | Updated on Aug 17 2018 2:53 PM

జిల్లా కాంగ్రెస్‌లో గ్రూపు విభేదాలు తాత్కాలికంగా సద్దుమణిగినా.. అంతర్గతంగా రగులుతూనే ఉన్నాయి.

సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : జిల్లా కాంగ్రెస్‌లో గ్రూపు విభేదాలు తాత్కాలికంగా సద్దుమణిగినా.. అంతర్గతంగా రగులుతూనే ఉన్నాయి. జిల్లా కాం గ్రెస్ సారథిగా ముందుగా ఆదిలాబాద్ నియోజకవర్గ ఇన్‌చార్జి భార్గవ్‌దేశ్‌పాండే ను నియమిస్తూ అధిష్టానం నిర్ణయిం తీసుకుంది. ఆ సమయంలో ఓ వర్గం భగ్గుమంది. అధిష్టాన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పలువురు పార్టీకి కూడా రాజీనామాలు చేస్తామంటూ ప్రకటించారు. ఇప్పుడు ఆ స్థానాన్ని నిర్మల్ మాజీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డికి ఇవ్వడంపై జిల్లాలోని మరోవర్గం ఆచితూచి వ్యవహరిస్తోంది.

అధిష్టానం తీసుకున్న నిర్ణయంపై అభ్యంతరం చెప్పలేదు.. కానీ, రానున్న రోజుల్లో ఈ రెండు గ్రూపుల మధ్య సమన్వయం ప్రశ్నార్థకంగానే కనిపిస్తోంది. గత ఎన్నికల్లో చావు దెబ్బతిన్న కాంగ్రెస్ పార్టీని  క్షేత్ర స్థాయిలో బలోపేతం చేసేందుకు అధిష్టానం దృష్టి సారించింది. ఇందుకోసం సభ్యత్వ నమోదు కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. అయితే.. శుక్రవారం ఆసిఫాబాద్‌లో నిర్వహించిన తొలి నియోజకవర్గ సమావేశానికి కొత్తగా డీసీసీ అధ్యక్షుడిగా నియామకమైన మహేశ్వర్‌రెడ్డి హాజరుకాకపోవడం విడ్డూరం. ఇందులో సభ్యత్వ నమోదును లాంఛనంగా ప్రారంభించారు.

 ఆ నియోజకవర్గాల్లో సభ్యత్వ నమోదు ప్రశ్నార్థకం..
 జిల్లాలో పలు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీకి నా యకత్వం ప్రశ్నార్థకంగా తయారైంది. ఈ నియోజకవర్గాల నుంచి పోటీ చేసిన నేతలు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఎన్నికలు మరో నాలుగేళ్లు ఉంటడంతో ఇప్పుడే ప్రజల్లోకి రావడం లేదు. ముఖ్యంగా మంచిర్యాల నియోజకవర్గాన్ని పరిశీలిస్తే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసిన గడ్డం అరవింద్‌రెడ్డి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. అలాగే సిర్పూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్‌సాగర్‌రావు కూడా ఎన్నికల తర్వాత కనుమరుగయ్యారు.

కాంగ్రెస్ ఆ ధ్వర్యంలో అడపాదడపా కార్యక్రమాలు నిర్వహిస్తూ నే ఉన్నారు. నెల రోజుల క్రితం రైతుల సమస్యలపై కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఆత్మహత్యలకు పాల్పడిన రైతుల కుటుంబాలను ఆదుకోవాల ని ఇటీవల కోటపల్లిలో ధర్నా నిర్వహించారు. వివిధ జిల్లాల నుంచి వచ్చిన నేతలు ఈ ధర్నాలో పాల్గొ న్నా, జిల్లా ముఖ్య నాయకులు పలువురు దూరంగా ఉన్నారు. కేవలం జిల్లాలోనే కాదు, గాంధీభవన్‌లో జరుగుతున్న కార్యక్రమాలకు కూడా కొన్ని నియోజకవర్గ ఇన్‌చార్జీలు హాజరుకావడం లేదు. ఇప్పుడు ఈ నియోజకవర్గాల్లో సభ్యత్వ నమోదు కార్యక్రమం విజయవంతం కావడం ప్రశ్నార్థకంగా మారింది.

 నేడు నిర్మల్‌కు పొన్నాల రాక
 తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య శనివారం నిర్మల్‌కు వస్తున్నారు. పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా నిర్వహిస్తున్న నిర్మల్ నియోజకవర్గ సమావేశంలో పాల్గొనేందుకు ఆయన ఇక్కడికి వస్తున్నట్లు టీపీసీసీ కార్యదర్శి నరేష్‌జాదవ్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. అసెంబ్లీ, మండలిల సీఎల్‌పీ నేతలు జానారెడ్డి, డి.శ్రీనివాస్‌లు కూడా ఈ సమావేశానికి హాజరుకానున్నట్లు పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement