దొంగలొస్తారు జాగ్రత్త ..!

Thieves Carefully Village Peoples - Sakshi

వేసవి కావడంతో చోరీలు జరిగే అవకాశం

అప్రమత్తతతోనే నివారించవచ్చు

రాత్రివేళల్లో ఆరుబయట, డాబాలపై పడుకుంటే జరభద్రం

అనుమానితులు కనిపిస్తే సమాచారం ఇవ్వండి

ప్రజలకు సూచిస్తున్న పోలీసులు

సూర్యాపేటరూరల్‌ : వేసవి అంటే కేవలం ఉక్కపోత..వడదెబ్బే కాదు..దొంగతనాల బెడద కూడా ఉంటుంది. ఉక్కపోతకు తట్టుకోలేక రాత్రి సమయంలో జనం హాయిగా ఆరుబయటో.. లేదంటే డాబాలపైనో నిద్రపోవడానికి ఇష్టపడుతుంటారు. ఇదే అదనుగా భావించే దొంగలు ఏంచక్క అందరూ గాఢనిద్రలో ఉన్న సమయంలో వచ్చి ఇళ్లలో చొరబడి బీరువాలు తెరిచి సొత్తు దోచుకెళ్తుంటారు.  వేసవిలో విహార, తీర్థయాత్రలకు వెళ్లే కుటుంబాలే లక్ష్యంగా దొంగలు చెలరేగుతుంటారు. అయితే ప్రస్తుతం వేసవికావడంతో అప్రమత్తంగా ఉంటూ తగిన జాగ్రత్తలు తీసుకుంటేనే చోరీలు జరగకుండా నివారించవచ్చని పోలీసులు చెబుతున్నారు. ఈనేపథ్యంలో ప్రతిఒక్కరూ ఏమరపాటుగా ఉండకుండా జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంది.
ఉదయం రెక్కీ.. రాత్రి దోచేస్తారు.. 
దొంగతనాలకు వేసవి అనువుగా ఉంటుంది. దొంగలు ఎంచుకున్న ఇంటి పరిసరాలను రెండు, మూడు రోజులుగా (రెక్కీ నిర్వహిస్తారు) పరిశీలిస్తారు. అంటే భిక్షగాళ్లుగా లేదా చెత్త కాగితాలు ఏరుకునేవారిలా..లేదంటే చిరువ్యాపారాలు చేసుకునే వారిలా.. బంగారం మెరుగుపెడతామని వీధుల్లో తిరుగుతూ టార్గెట్‌ చేసిన ఇళ్ల పరిసరాలను గమనిస్తారు. అనంతరం పక్కా దొంగ ప్రణాళిక రచించి సులువుగా ఇళ్లలో చొరబడి సొత్తును దోచుకెళ్తుంటారు. 
తీసుకోవాల్సిన జాగ్రత్తలు..

- చోరీలకు వచ్చే దొంగలు ఒకరోజు ముందే రెక్కీ నిర్వహిస్తారు. అనుమానాస్పదంగా కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలి.
- ఇంటి కిటికీలను మూసివేయాలి. వాటికి ఉన్న బోల్టులు సక్రమంగా ఉన్నాయో లేదో ఎప్పటికప్పుడు చూసుకోవాలి.
- దుస్తుల్లో డబ్బులు పెట్టి కిటికీలకు, తలుపులకు తగిలించరాదు.
- ఆరుబయట, మిద్దె (డాబా)లపై నిద్రించేవారు అప్రమత్తంగా ఉండాలి. ఇంటికి ఒకటికి లేక, రెండు తాళాలు వేసుకోవాలి.
- బంగారు అభరణాలు ధరించి ఆరుబయట నిద్రించకూడదు. ఇంట్లో పడుకున్నా.. కిటికీలు తెరిచి ఉండే వైపు పడుకోరాదు.
- వీలైతే ఇంటి ఆవరణలో పెంపుడు కుక్కలను కట్టి వేయాలి. ఇంట్లో ఎలాంటి శబ్దం, అలికిడి వినిపించినా వెంటనే అప్రమత్తం కావాలి. 
- దూరప్రాంతాలకు వెళ్లే వారుతమ ఇంటి చిరునామా, ఫోన్‌నంబర్‌ను సంబంధిత పోలీస్‌స్టేషన్‌కు తెలపాలి.
- రాత్రి సమయంలో కొత్తవారు ఎవరైనా వస్తే వారి వివరాలు తెలుసుకుని నమోదు చేసుకోవడం మంచిది.
- ఊర్లకు వెళ్లేవారు  బంగారం, నగదును బ్యాంక్‌ లాకర్లలో భద్రపర్చుకోవడం అన్ని విధాలా ఉత్తమం.
అంజనాపురి కాలనీలో నిఘా కరువు?
సూర్యాపేట జిల్లా కేంద్రానికి చేరువలో ఉన్న అంజ నాపురి, మానసానగర్‌ కాలనీల్లో పోలీసుల నిఘా కరువైంది. గతంలోనూ ఈ ప్రాంతాల్లో పలువురి ఇళ్లలో చోరీలు జరిగాయి. చోరీలు ఎక్కువగా జరిగే ప్రాంతా లను పోలీసులు గుర్తించి రాత్రి వేళ పెట్రోలింగ్‌ నిర్వహించాలని ఆయా కాలనీల ప్రజలు కోరుతున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top