జీరో దందాను అడ్డుకోవడానికి మార్కెట్ వ్యవస్థను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్ శాఖల డెరైక్టర్ డాక్టర్ శరత్ అన్నారు.
►మూడు నెలల్లో మారనున్న యార్డుల రూపురేఖలు
►త్వరలో ఈ-వ్యవస్థ అమలు
►లెసైన్స్‌దారుల లావాదేవీలపై నిఘా పెట్టాల్సింది కార్యదర్శులే..
►సిద్దిపేట, మెదక్ యార్డుల్లో ‘మన కూరగాయలు’ ఔట్‌లెట్లు
►వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ డెరైక్టర్ శరత్
సిద్దిపేట జోన్ : జీరో దందాను అడ్డుకోవడానికి మార్కెట్ వ్యవస్థను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్ శాఖల డెరైక్టర్ డాక్టర్ శరత్ అన్నారు. విధి నిర్వహణలో అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. మంగళవారం సిద్దిపేటలోని పత్తి మార్కెట్ యార్డులో జిల్లా మార్కెటింగ్ అధికారులు, కార్యదర్శులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రాష్ట్ర ప్రభుత్వం మార్కెట్ ఫీజును 25 శాతం పెంచిందని, అదే విధంగా లక్ష్యాలనూ నిర్దేశించిందన్నారు.
మార్కెట్ యార్డుల్లో లెసైన్స్ ఫీజును తప్పనిసరిగా వసూ లు చేయాలన్నారు. సంబంధిత లెసైన్స్ దారుడు ప్రతి నెలా 25లోగా మార్కెట్ కమిటీ కార్యదర్శికి రిటర్న్స్ దాఖలు చేయాలని, లేకపోతే సదరు లెసైన్స్‌దారులపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ప్రతి నెలా మార్కెట్ కమిటీ కార్యదర్శులు లెసైన్స్‌దారుల లావాదేవీలపై నిఘా పెట్టి ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు. లెసైన్స్‌లు జారీ చేసే అధికారమున్న మార్కెట్ కార్యదర్శులు ఎక్కడా తనిఖీలు చేయకపోవడం విచారకరమన్నారు.
రూ.411 కోట్లతో కొత్తగా గోదాంలు..
తెలంగాణలో కొత్తగా గోదాంల నిర్మాణం కోసం ప్రభుత్వం రూ.411 కోట్లను మంజూరు చేసిందని శరత్ తెలిపారు. ప్రస్తుతం పనులు కూడా కొనసాగుతున్నాయన్నారు. వీటి ద్వారా 6.85 లక్షల మెట్రిక్ టన్నుల నిల్వ సామర్థ్యం అందుబాటులోకి రానుందన్నారు. మరోవైపు నాబార్డ్ నిధుల కింద మరో రూ.600 కోట్లతో గోదాముల నిర్మాణానికి ప్రతిపాదనలు రూపొందించినట్టు తెలిపారు. రైతులకు మేలు జరిగేలా రాష్ట్ర వ్యాప్తంగా మార్కెట్ యార్డుల్లో విప్లవాత్మకమైన మార్పులు తేనున్నట్టు ఆయన పేర్కొన్నారు.
యార్డులకు తోరణాలు...
జిల్లాలోని మార్కెట్ యార్డుల ప్రధాన ద్వారాల వద్ద ప్రభుత్వం నిర్దేశించిన మేరకు కాకతీయ తోరణంతో కూడిన ఆర్చ్‌లను నిర్మించాలని ఆ శాఖ డెరైక్టర్ తెలిపారు. త్వరలో వాటికి సంబంధించిన మార్గదర్శకాలను జారీ చేస్తామన్నారు. మార్కెట్ యార్డుల ప్రహరీలన్నీ ఒకే రంగులో ఉండేలా చూడాలని, గోడలపై రైతుకు ఉపయోగపడే, ప్రభుత్వ పథకాలను నినాదాల రూపంలో రాయించాలన్నారు.
ధాన్యం తడిస్తే బాధ్యత మీదే...
జిల్లాలోని వ్యవసాయ మార్కెట్ యార్డుల్లో వర్షానికి రైతు ధాన్యం తడిస్తే కార్యదర్శులే బాధ్యులని డెరైక్టర్ శరత్ అన్నారు. రైతు తెచ్చిన ధాన్యాన్ని ముందుగా షెడ్డు కిందకు చేర్చాలని, ధాన్యం తాకిడి అధికమైతే ముందస్తు చర్యగా కవర్లను అందించాలని సూచించారు. మార్కెట్ కమిటీ పరిధిలో అవసరమైన పనులపై ప్రతిపాదనలను త్వరితగతిన ఉన్నతాధికారులకు అందజేయాలన్నారు. ముఖ్యంగా కవర్ షెడ్‌ల నిర్మాణంపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. మరో మూడు నెలల్లో జిల్లాలోని మార్కెట్ యార్డుల రూపురేఖలను మార్చనున్నట్లు చెప్పారు.
జిల్లా వ్యాప్తంగా గోదాముల నిర్మాణం కోసం అవసరమయ్యే స్థల సేకరణ విషయంలో మార్కెట్ కమిటీ అధికారులు రెవెన్యూ శాఖతో సమన్వయంతో పని చేయాలన్నారు. సిద్దిపేట, మెదక్ వంటి మార్కెట్ యార్డుల్లో ‘మన కూరగాయలు’ ప్రాజెక్ట్ కింద ఔట్‌లెట్లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం యోచిస్తోందన్నారు. మరోవైపు హైదరాబాద్‌కు దగ్గరగా ఉన్న నర్సాపూర్, గజ్వేల్, సంగారెడ్డి, తొగుట మార్కెట్ యార్డుల నుంచి నేరుగా కూరగాయలను తరలించేందుకు ప్రణాళిక రూపొందించాలన్నారు. త్వరలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మార్కెట్ యార్డుల్లో ఈ-వ్యవస్థను అమలు చేయనున్నట్లు చెప్పారు.
ఈ ట్రేడింగ్, ఈ పర్మిట్, ఈ ఆప్షన్స్ వంటి తదితర కార్యక్రమాలను నిర్వహించేందుకు ప్రభుత్వం సమాలోచనలు చేస్తుందన్నారు. సమీక్ష అనంతరం పత్తి మార్కెట్ యార్డులో కొనసాగుతున్న గోదాం నిర్మాణ పనులను శరత్ పరిశీలించారు. ఆయన వెంట మార్కెటింగ్ శాఖ డిప్యూటీ డెరైక్టర్ మల్లేశం, అసిస్టెంట్ డెరైక్టర్ హమీద్, మార్కెటింగ్ శాఖ ఎస్‌ఈ నాగేశ్వర్‌రెడ్డి, సీఈ రామారావు, డీఈ శ్రీనివాస్‌రావుతోపాటు సిద్దిపేట మార్కెట్ కమిటీ కార్యదర్శి సంగయ్య, తహశీల్దార్ ఎన్‌వై గిరి పాల్గొన్నారు.