గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ | telangana people waiting for appointed day | Sakshi
Sakshi News home page

గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ

May 6 2014 1:28 AM | Updated on Aug 17 2018 2:53 PM

గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ.. ప్రభుత్వ శాఖల్లోని వెబ్‌సైట్‌లో జూన్ 2 నుంచి ఇదే సర్వర్ కనబడనుంది.

 ఆదిలాబాద్ రిమ్స్, న్యూస్‌లైన్ : గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ.. ప్రభుత్వ శాఖల్లోని వెబ్‌సైట్‌లో జూన్ 2 నుంచి ఇదే సర్వర్ కనబడనుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈనెల 24 వరకు దర్శనమివ్వనుండగా ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆర్థిక వ్యవస్థలో విభజనకు కసరత్తు ముమ్మరమైంది. అపాయింటెడ్ డే కు సర్వం సిద్ధం చేస్తున్నారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఈనెల 24నే ఉద్యోగులకు మే నెల వేతనం అందనుంది. ఉమ్మడి రాష్ట్రంలో లెక్కల విభజన ఈనెల 24తో ముగియనుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక బడ్జెట్ పరిధిలోఉన్న చెల్లింపులు 24వ తేదీతో పూర్తికానున్నాయి. ప్రభుత్వశాఖల పరిధిలోని అన్ని శాఖల ఉద్యోగులకు, పింఛన్‌దారులకు ఇతరత్రా అన్ని చెల్లింపులు అదేరోజు జరగనున్నాయి. జూన్ 2న తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కానుండడంతో వచ్చే నెల నుంచి బడ్జెట్ విధానం ప్రత్యేక రాష్ట్ర పరిధిలోకి రానుంది.

 ఇక వేటికవే..
 మే 24 తర్వాత నుంచి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లెక్కలు వేటికవేనంటూ జిల్లా ట్రెజరీ శాఖకు ముందస్తుగా ఉత్తర్వులు అందాయి. ఈ నేపథ్యంలో ఉద్యోగులు, పింఛన్‌దారులకు నిర్ణీత సమయానికి వేతనాలు, పింఛన్‌లు ఇచ్చేందుకు కసరత్తు వేగవంతం చేస్తున్నారు. జూన్ 2 నుంచి తెలంగాణ ప్రభుత్వం బాధ్యతలు స్వీకరించనుండడంతో 24వ తేదీనే తీసుకునే వేతనం ఆంధ్రప్రదేశ్ చివరిది కానుంది. జిల్లాలో సుమారు 32 వేల మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు. జిల్లా వ్యాప్తంగా 12,080 వేల మంది పింఛన్‌దారులు ఉన్నారు. ప్రభుత్వ వేతనం కింద ఉద్యోగులకు సుమారు రూ.150 కోట్లు, పింఛన్‌దారులకు సుమారు రూ.18.63  కోట్లు చెల్లించాలి. ఈ మేరకు జీవో విడుదల చేస్తూ ఆంధ్రప్రదేశ్ ఖాత నుంచి తెలంగాణలోని ఉద్యోగులకు వేతనం చెల్లించనున్నట్లు పేర్కొంది. ఈ ఉత్తర్వులు అందుకున్న ట్రెజరీశాఖ ఉద్యోగుల జాబితా, బ్యాంకు ఖాతాలను సిద్ధం చేస్తోంది.

 నిధులు సర్ధుబాటయ్యేనా?
 ప్రభుత్వ పథకాల అమలుకు వివిధ శాఖలకు ఖజానా శాఖ ద్వారా నిధులు విడుదలవుతాయి. ఉద్యోగుల జీతాల మాదిరిగానే నిధుల ఖర్చు కూడా ఈనెల 24నే తుదిగడువుగా నిర్ణయించారు. ఆ లోగా వెచ్చించని మొత్తాన్ని అప్పజెప్పాలంటూ ఆదేశాలు వచ్చే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల హడావుడిలో ఉన్న అధికారులు నిధుల వినియోగం ఎలా? అని తలలు పట్టుకుంటున్నారు. 13వ ఆర్థిక సంఘం నిధుల గత ఆర్థిక సంవత్సరం చివరి సమయంలో మంజూరయ్యాయి. జిల్లాలోని 866 గ్రామ పంచాయతీలకు రూ.18 కోట్లు మంజూరు కాగా అన్నింటికీ కేటాయింపులు జరిగినట్లు అధికారులు పేర్కొంటున్నారు.

 ఎన్నికల కోడ్ అమలులో ఉండడంతో ఇప్పటి వరకు పనులకు గ్రహణం ఏర్పడింది. ఈ ప్రక్రియ పూర్తికాకపోతే నిధుల పరిస్థితి ఏమిటన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఎస్సీ విద్యార్థులకు సంబంధించి స్కాలర్‌షిప్ రూ.1.17 కోట్లు, ఫీజు రియింబర్స్‌మెంట్ కింద రూ.1.94 కోట్లు, బీసీ విద్యార్థులకు స్కాలర్‌షిప్ రూ.3.34 కోట్లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ రూ.2.89 కోట్లు, ఈబీసీలకు సంబంధించి విద్యార్థులకు రూ.33.26 లక్షలు కేటాయింపులు జరిగాయి. వీటికి సంబంధించి కూడా ఈ 24 తేదీలోగానే చెల్లింపులు జరగాలి. ఇటీవల ట్రెజరీలో నిధులు విడుదలపై ఆంక్షలు విధించడంతో జిల్లాలోని వివిధ శాఖలకు సంబంధించి రూ.17 లక్షల నిధులు ల్యాప్స్‌కు గురయ్యాయి. అందులో జిల్లా పరిషత్‌కు సంబంధించి రూ.4 లక్షలు, వివిధ శాఖలకు సంబంధించి మిగతా నిధులు ఉన్నాయి. వాటికి సంబంధించి కూడా తిరిగి బిల్లులు పొందుపర్చాల్సిన అవసరం ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement