జడ్జీలనే మోసం చేస్తారా?

Telangana High Court Fires On TSRTC MD Sunil Sharma - Sakshi

ఆర్టీసీ ఇన్‌చార్జి ఎండీ సునీల్‌శర్మపై హైకోర్టు నిప్పులు

ప్రభుత్వం ఆర్టీసీకి బకాయి ఉందని మంత్రికి.. బకాయిలు ఏమీ లేవని హైకోర్టుకు ఎలా చెబుతారు?

ఐఏఎస్‌లంతా ఒకే చోట కూర్చొని లేఖలు రాశారా?

అదీ కోర్టు విచారణ తర్వాతే రాస్తారా?

ప్రజాసమస్యపై వివరాలు ఇస్తున్నామన్న ఆలోచన కూడా లేదా?

ఇది ఏమాత్రం ఉపేక్షించదగ్గ విషయం కాదు

మా నమ్మకాన్ని దెబ్బతీశారు

ఉద్దేశపూర్వక తప్పులకు పర్యవసానాలేంటో మీకు తెలుసు కదా.. ఇక నటనకు తెరదించండి

వివరాల సమర్పణకు 10 రోజుల గడువు కోరిన ఏజీ

నిరాకరించిన కోర్టు.. విచారణ 7వ తేదీకి వాయిదా  

సాక్షి, హైదరాబాద్‌: ‘‘ఆర్టీసీ బకాయిల విషయంలో రవాణా మంత్రికి ఒకలా, కోర్టుకు మరోలా లెక్కలు చెబుతారా? ఇలా చెప్పడానికి ఎంత ధైర్యం ఉండాలి? ఐఏఎస్‌ అధికారులు తెలిసే, కావాలనే, ఉద్దేశపూర్వకంగా తప్పుదోవ పట్టిస్తున్నారని, మోసం చేస్తారని ఊహించనేలేదు’’అని హైకోర్టు మండిపడింది. ‘‘ఆర్టీసీకి ప్రభుత్వం నుంచి రూ. 1,492 కోట్ల బకాయిలు రావాల్సి ఉందని మంత్రికి చెప్పామని సాక్షాత్తూ మాకు చెబుతున్నారు. బకాయిలు ఏమీ లేవని అఫిడవిట్‌లో పూర్తి భిన్నంగా చెబుతున్నారు. మంత్రిని మోసం చేస్తున్నారా లేక జడ్జీలకే తప్పుడు సమాచారం ఇస్తున్నారా? ఏం చేస్తున్నారు మీరు? మీరిచ్చిన వివరాల ఆధారంగా చట్టసభలో మంత్రి ప్రకటన చేసి ప్రజలకు తప్పుడు సమాచారం వెళ్లేలా చేశారా? లేక ప్రభుత్వం నుంచి ఆర్టీసీకి ఎలాంటి బకాయిలు లేవంటూ న్యాయమూర్తులనే మోసం చేస్తున్నారా? నిజాలే చెబుతామని ప్రమాణంతో దాఖలు చేసిన అఫిడవిట్‌ చూస్తే ఐఏఎస్‌ల కచ్చితత్వంపై అనుమానాలు కలుగుతున్నాయి.

ఐఏఎస్‌లు వాస్తవాలు చెబుతారని ఎంతో నమ్మకంతో ఉన్న మా ఆశల్ని వమ్ము చేయకండి. నిజాయతీ, నమ్మకాన్ని నీరుగార్చకండి. అధికారులు దాఖలు చేసిన అఫిడవిట్లు జిగ్సా పజిల్‌లా (ముక్కలుగా ఉన్న వాటిని పేర్చి అసలు చిత్రం ఏర్పడేలా చేయడం) తరహాలో గందర గోళంగా ఉన్నాయి. ఏం చెప్పదల్చారో అది మాత్రమే కోర్టుకు చెబుతున్నారు. ఏదో ఒకటి చెబితే పోనీలే అనుకుంటే నాశనాన్ని కోరుకున్నట్లేనని గుర్తించుకోవాలి. ఐఏఎస్‌లు నిజాయితీగా వాస్తవాలతో కౌంటర్‌ వేస్తారని ఆశించాం. మా నమ్మకాన్ని దెబ్బతీశారు. మోసపూరిత వైఖరి ఉంటుందని అస్సలు ఊహించలేదు. ఈ విధంగా ఉంటారని కనీస ఆలోచన కూడా చేయలేదు. ఐఏఎస్‌లు మౌనం వీడాలి. నిశబ్దంగా ఉంటే ఎలా? ప్రజాసమస్యతో ముడిపడిన వ్యవహారంలో వివరాలు ఇస్తున్నామని కూడా ఆలోచన చేసినట్లుగా లేదు. ఇది ఏమాత్రం ఉపేక్షించదగ్గ విషయం కాదు. ఇక నటనకు తెరదించండి. ఉద్దేశపూర్వకంగా తప్పులు చేస్తే పర్యావసానాలు, కోర్టు ధిక్కార పరిణామాలు ఎలా ఉంటాయో మీకు తెలుసు’’అని ఆర్టీసీ ఇన్‌చార్జ్‌ ఎండీ సునీల్‌ శర్మను ఉద్దేశించి హైకోర్టు ధర్మాసనం నిప్పులు చెరిగింది. 

బకాయిల చెల్లింపులుగా ఎలా చూపుతారు? 
ఆర్టీసీ సమ్మె చట్టవిరుద్ధమని ప్రకటించాలంటూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యాలపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రాఘవేంద్రసింగ్‌ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్‌ ఎ. అభిషేక్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం శుక్రవారం కిక్కిరిసిన కోర్టు హాల్లో విచారణ జరిపింది. విచారణకు ఆర్టీసీ ఇన్‌చార్జ్‌ ఎండీ సునీల్‌శర్మ, ఆర్టీసీ ఈడీలు, ఇతర అధికారులతోపాటు రవాణాశాఖ కమిషనర్‌ సందీప్‌కుమార్‌ సుల్తానియా హాజరయ్యారు. ఆర్టీసీ ఎండీ దాఖలు చేసిన కౌంటర్‌ పిటిషన్‌లో ఆర్టీసీకి ప్రభుత్వం ఎలాంటి బకాయిలు చెల్లించాల్సినవి లేవనే అంశంపై లోతుగా విచారణ జరిపింది. జీవో 229 ద్వారా రూ. 35 కోట్లను గతేడాది మే 3న ఇచ్చిన నగదు బస్సులను కొనుగోలు చేసేందుకైతే వాటిని »బకాయిల చెల్లింపులుగా ఎలా చూపుతారని ధర్మాసనం ప్రశ్నించింది. అలాగే జూన్‌ 6న జారీ చేసిన జీవో 227 కింద ఇచ్చిన మొత్తం రుణం కోసమైతే దానినీ బకాయిల చెల్లింపులుగా చెప్పడాన్ని తప్పుపట్టింది. 

అస్పష్టమైన వాదనలు చేస్తే ఎలా? 
యూనియన్‌ తరఫు సీనియర్‌ న్యాయవాది దేశాయ్‌ ప్రకాష్‌రెడ్డి జోక్యం చేసుకొని ఆర్టీసీకి ప్రభుత్వం రూ.1375 కోట్లు చెల్లించాల్సి ఉందని, కానీ ఇచ్చింది రూ. 130 కోట్లని చెప్పారు. ఆర్టీసీలో సిబ్బంది తగ్గినా ఆక్యుపెన్సీ 69 శాతం నుంచి 73 శాతానికి పెరిగిందని, డీజిల్‌ ధర రూ. 49 నుంచి రూ. 69కి పెరిగిందని, నష్టాలు వచ్చే గ్రామీణ ప్రాంతాల్లో 73 శాతం బస్సులు నడుపుతున్నప్పటికీ అదనంగా రూ. 181 కోట్ల ఆదాయం వచ్చేందుకు సిబ్బంది పనితీరే కారణమని వివరించారు. దీనిపై హైకోర్టు స్పందిస్తూ ప్రభుత్వం ఇవ్వాల్సిన దానికంటే రూ. 622 కోట్లు అదనంగా ఇచ్చేశామని చెబుతోందని వ్యాఖ్యానించింది. ఆర్టీసీ ఇన్‌చార్జ్‌ ఎండీ సునీల్‌శర్మ జోక్యం చేసుకొని వివిధ రకాల పద్దుల కింద ప్రభుత్వం నిధులిస్తుందని, వాటిని అదే పద్దుల కింద ఆర్టీసీ ఖర్చు చేయాల్సిన అవసరం లేదన్నారు. లోన్‌ అయినా గ్రాంట్‌ అయినా తిరిగి ప్రభుత్వానికి ఆర్టీసీ చెల్లించాల్సిన అవసరం లేదనగానే ధర్మాసనం పలు ప్రశ్నలు సంధించింది. ఏ ఖాతా కింద నిధులు వచ్చాయో, ఎలా సర్దుబాటు చేస్తున్నారో ఆధారాలతో చెప్పాలేగానీ అస్పష్టమైన వాదనలు చేస్తే ఎందుకు నమ్మాలో, ఎలా నమ్మాలో అర్థంకావట్లేదని వ్యాఖ్యానించింది. మీరు చెప్పే మాటల్ని ప్రవచనాలుగా ఎలా తీసుకోగలమని నిలదీసింది. ఏది గ్రాంటో, ఏది లోనో ప్రభుత్వం చెప్పాలేగానీ మీరు కాదని తేల్చిచెప్పింది. 

జీహెచ్‌ఎంసీ గతంలో బకాయిలెలా చెల్లించింది? 
ఈడీల కమిటీ నాలుగు డిమాండ్ల పరిష్కారానికి రూ. 47 కోట్లు అవసరమని చెబితే ఆ మొత్తం ఇవ్వలేమని చేతులెత్తేసిన ప్రభుత్వం... ఆర్టీసీ బకాయిలన్నీ చెల్లించడమే కాకుండా రూ. 622 కోట్లను ఎక్కువగా ఇచ్చినట్లు వీక్‌ అఫిడవిట్‌ దాఖలు (ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి కె.రామకృష్ణారావు) చేసిందని హైకోర్టు ధర్మాసనం అభిప్రాయపడింది. మరోవైపు ప్రభుత్వం బకాయిలు చెల్లించాలని ఆర్టీసీ యూనియన్‌ చెబుతోందని గుర్తుచేసింది. జీహెచ్‌ఎంసీ చట్టంలోని సెక్షన్‌ 112 (30) ప్రకారం తాము ఆర్టీసీకి బకాయిలు చెల్లించాల్సిన అవసరం లేదంటున్న కార్పొరేషన్‌ అదే సెక్షన్‌ ప్రకారం 2015–16లో రూ. 108 కోట్లు, ఆ తర్వాత ఏడాది రూ. 228 కోట్లను ఆర్టీసీకి బకాయిలుగా ఎలా చెల్లించిందని ధర్మాసనం ప్రశ్నించింది. ఆర్టీసీకి దానం చేసిందా లేక దాతృత్వాన్ని ప్రదర్శించిందా అని ఎద్దేవా చేసింది. జీహెచ్‌ఎంసీ ఔదార్యాన్ని పక్కనపెడితే చట్ట ప్రకారం హైదరాబాద్‌లో సిటీ బస్సులు నడిపినందుకు డబ్బులు ఇవ్వాల్సి ఉందో లేదో చెప్పాలని ఆదేశించింది. ఈ దశలో తిరిగి ప్రకాష్‌రెడ్డి స్పందిస్తూ సిటీ బస్సులు నడిపినందుకు జీహెచ్‌ఎంసీ ఎంత మొత్తం ఇవ్వాలో లేక ఇవ్వకూడదో ప్రభుత్వం నిర్ణయిస్తుందన్నారు.

ఇదే సమయంలో సునీల్‌శర్మ జోక్యం చేసుకొని జీవో 134 ద్వారా ఆ సెక్షన్‌కు సవరణ జరిగిందని, ఆర్టీసీకి జీహెచ్‌ఎంసీ కాకుండా ప్రభుత్వం సాయం చేస్తుందన్నారు. బకాయిలు చెల్లించాలని జీహెచ్‌ఎంసీకి ప్రభుత్వం లేఖ రాస్తే 2018–19కి తాము బకాయిలు చెల్లించాల్సిన అవసరం లేదని 2017 ఏప్రిల్‌ 13న తీర్మానం చేసినట్లు జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ జవాబు ఇచ్చారని సునీల్‌శర్మ చెప్పారు. అయితే బకాయిలు చెల్లించాలో లేదో కమిషనర్‌ నిర్ణయించలేరని, ప్రభుత్వం చెప్పాలని హైకోర్టు చట్ట నిబంధనల్ని గుర్తుచేసింది. ఏ చట్ట నిబంధనల కింద గతంలో జీహెచ్‌ఎంసీ బకాయిలు ఇచ్చిందో దాని ప్రకారమే 2018–19కి రూ. 533 కోట్లు ఇవ్వాలని పిటిషనర్‌ చెబుతున్నారని, మున్సిపల్‌శాఖ ముఖ్య కార్యదర్శికి లేఖ జవాబుల వివరాల్ని అఫిడవిట్‌లో ఎందుకు పేర్కొనలేదని ధర్మాసనం తప్పుబట్టింది. ఆర్టీసీలో నాలుగేళ్లుగా ఆడిట్‌ చేసిన నాథుడే లేడని విమర్శించింది. జీహెచ్‌ంఎసీ బకాయిలపై మున్సిపల్‌ శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్‌కుమార్, ఆర్టీసీ సమ్మెపై కేంద్రానికి వివరిస్తూ ఆర్టీసీ ఎండీ సునీల్‌శర్మ, బకాయిలకు సంబంధించి ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు హైకోర్టులో ఈ కేసు విచారణ జరిగిన మర్నాడే లేఖలు రాయడాన్ని ధర్మాసనం ఎత్తిచూపింది. ఈ లేఖలను ముగ్గురూ ఒకేచోట కూర్చొని రాసినట్లుగా ఉందని అనుమానం వ్యక్తం చేసింది. అయితే ఈ అంశంపై పూర్తి వివరాలు సమర్పించేందుకు 10 రోజుల సమయం కావాలని అడ్వొకేట్‌ జనరల్‌ బీఎస్‌ ప్రసాద్‌ కోరగా హైకోర్టు నిరాకరించింది. తదుపరి విచారణను ఈ నెల 7వ తేదీకి వాయిదా వేసింది.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top