టీడీపీలో..నిస్తేజం!

Telangana Election TDP And Congress Alliance Nalgonda - Sakshi

సాక్షిప్రతినిధి, నల్లగొండ : ఉమ్మడి నల్లగొండ జిల్లాపై తిరుగులేని ఆధిపత్యం చెలాయించిన టీడీపీ పరిస్థితి.. ప్రస్తుతం దైన్యంగా తయారైంది. గత ఎన్నికల్లో జిల్లాలోని పన్నెండు నియోజకవర్గాల్లో ఒక్క స్థానంలోనూ గట్టెక్కలేకపోయింది. వాస్తవానికి తెలుగుదేశం పార్టీకి జిల్లాలోమంచి రికార్డే ఉంది. మొన్నటి ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ దక్కించుకున్న భువనగిరి స్థానంలో సుదీర్ఘ కాలం టీడీపీనే ప్రాతినిధ్యం వహించింది. 

జిల్లాలోని తుంగతుర్తి, ఆలేరు, భువనగిరి, నల్ల గొండ, సూర్యాపేట, కోదాడ, నాగార్జునసాగర్‌ నియోజకవర్గాల్లో విజయాలు సాధించిన చరిత్ర ఆ పార్టీకి ఉంది. ఆ పార్టీ మద్దతుతో వామపక్ష పార్టీలు సీపీఐ, సీపీఎం నల్లగొండ, నకిరేకల్, మునుగోడు, దేవరకొండలో పలు తడవులు గెలిచాయి. ఒక విధంగా జిల్లాపై సుదీర్ఘంగా ఆధిపత్యం నిలబెట్టుకుంది. గతం నుంచి వర్తమానంలోకి వస్తే ప్రస్తుతం ఆ పార్టీ దిక్కుతోచని స్థితిలోకి జారిపోయింది.

నిర్వీర్యం చేసిన వలసలు
ప్రత్యేక రాష్ట్రం కోసం తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున జరిగిన సమయంలో ఆ పార్టీ తెలంగాణ, ఏపీలో ఆచరించిన రెండు కళ్ల సిద్ధాంతం ఇక్కడి టీడీపీ నాయకులను ఆత్మరక్షణలోకి నెట్టింది. తె లంగాణ సిద్ధించాక కూడా ఇక, ఆ పార్టీ ఇక్కడ చే యి తిప్పుకోలేక పోయిందన్న అభిప్రాయం ఉంది. దీనికి తగ్గట్టే.. గత సార్వత్రిక ఎన్నికల్లో ఆ పార్టీ పోటీ చేసిన అన్ని స్థానాల్లో ఓటమిని మూటగట్టుకుంది. ఆ తర్వాత టీఆర్‌ఎస్‌ అధికారంలోకి రాడం, రాజకీయ పునరేకీకరణ పేర గులాబీ నాయకత్వం చేపట్టిన ఆపరేషన్‌ ఆకర్‌‡్షకు జిల్లా టీడీపీ కుదేలైంది. జిల్లాల విభజన తర్వాత ఏ జిల్లా కమిటీలు ఆ జిల్లాకు నియమించినా ఫలితం లేకుండా పోయింది. ముందుగా పలువురు నాయకుల టీఆర్‌ఎస్‌ బాట పడితే ద్వితీయార్ధంలో కాంగ్రెస్‌ బాట పట్టారు. జిల్లాలో ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా పనిచేసిన నేతలు సైతం పార్టీని వీడి బయట పడ్డారు. కోదాడ మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్‌రావు చాలా ముందుగానే టీఆర్‌ఎస్‌కు వెళ్లిపోయారు. ఆ తర్వాత మాజీ మంత్రి ఉమామాధవ రెడ్డి సుమారు ఏడాది కిందట గులాబీ కండువా కప్పుకున్నారు.

యాదా ద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుడిగా పనిచేసిన ఆమె తనయుడు పార్టీ మారారు. జిల్లా కేంద్రంలో ఆ పార్టీకి ఏకైక దిక్కుగా ఉన్న కంచర్ల భూపాల్‌ రెడ్డి, అంతకు ముందు మాజీ మున్సిపల్‌ చైర్మన్‌ బోయపల్లి కృష్ణారెడ్డి పార్టీ మారారు. సుదీర్ఘ కాలం ఉమ్మడి జిల్లాకు అధ్యక్షుడిగా పనిచేసిన బడుగుల లింగయ్య యాదవ్‌ సైతం సైకిల్‌ దిగి కారెక్కారు. కొన్నాళ్లకు ఆయనను రాజ్యసభ సభ్యత్వం వరిం చింది. నల్లగొండ జిల్లా అధ్యక్షుడిగా బిల్యానా యక్, సూర్యాపేట జిల్లా అధ్యక్షుడిగా పనిచేసిన పటేల్‌ రమేష్‌రెడ్డి కాంగ్రెస్‌ గూటికి చేరారు. ఇక, ఆఖరుగా ఆ పార్టీ  తెలంగాణలో పెద్దదిక్కు అనదగిన సీనియర్‌ నేత, మాజీ మంత్రి మోత్కుపల్లి న ర్సింహులు కూడా టీడీపీనుంచి బయటకు వచ్చా రు. ఆయన ఏ పార్టీలో చేరకున్నా, ఆలేరు నుంచి బరిలోకి దిగేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. దీంతో ఇప్పుడా పార్టీకి చాలా నియోజకవర్గాల్లో కొత్త వారే దిక్కవుతున్నారు. ఈ పరిస్థితుల్లో ఒం టరిగా పోటీ చేసి నెగ్గుకురావడం కష్టమని భావించిన నాయకత్వం పొత్తులపైనే ఆశలు పెట్టుకుంది.

పొత్తులపైనే ఆధారం
ఈ ఎన్నికల్లో ఆ పార్టీ కాంగ్రెస్‌తో జతకట్టేందుకు రాష్ట్రస్థాయిలో చర్చలు జరుగుతున్నాయి. దీంతో జిల్లాలో కనీసం నాలుగు స్థానాలు అడగాలని నిర్ణయించినట్లు ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఇందులో కోదాడ, నకిరేకల్‌ దక్కుతాయన్న ఆశ వారిలో వ్యక్తం అవుతోంది. మొత్తంగా ఆ పార్టీ జిల్లాను శాసించిన స్థాయి నుంచి చివరకు పొత్తుల్లో కొన్ని స్థానాలు కోరే స్థితికి చేరడాన్ని ఆ పార్టీ కేడర్‌ జీర్ణించుకోలేక పోతోంది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top