నిఘా నీడన నిమజ్జనం

Telangana DGP Says All Set For Ganesh Immersion - Sakshi

బందోబస్తులో 35 వేల మంది బలగాలు: డీజీపీ మహేందర్‌రెడ్డి 

స్టేషన్ల నుంచి డీజీపీ కార్యాలయం వరకు కమాండ్‌ కంట్రోల్‌ కేంద్రాలు 

గ్రేటర్‌ కమాండ్‌ కంట్రోల్‌ నుంచీ పర్యవేక్షణ

సాక్షి, హైదరాబాద్‌: వినాయక నిమజ్జనం ప్రశాంతంగా జరిగేలా రాష్ట్రవ్యాప్తంగా అన్ని చర్యలు తీసుకున్నామని డీజీపీ మహేందర్‌రెడ్డి అన్నారు. నిమజ్జనం సందర్భంగా బుధవారం డీజీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. నిమజ్జనం నేపథ్యంలో 33 జిల్లాల్లో ప్రతీ పోలీస్‌ స్టేషన్‌ నుంచి డీజీపీ కార్యాలయం వరకు కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్లు ఏర్పాటు చేశామన్నారు. నగరంలో నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయన్నారు.

హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ, మిగిలిన కమిషనరేట్ల పరిధిలోనే 35,000 మంది బలగాలు నిమజ్జన ఏర్పాట్లలో ఉన్నాయన్నారు. సివిల్‌ పోలీసులతోపాటు, ఆర్మ్‌డ్‌ రిజర్వ్‌ (ఏఆర్‌), టీఎస్‌ఎస్‌పీ, ఎక్సైజ్, ఫారెస్ట్, రాపిడ్‌ యాక్షన్‌ ఫోర్స్‌  బలగాలతోపాటు జిల్లాల నుంచి వచ్చిన పోలీసు లు విధుల్లో ఉన్నారని తెలిపారు. జీహెచ్‌ఎంసీ, మున్సిపల్, ఎలక్ట్రిక్, నీటి సరఫరా, పారిశుధ్యం, రవాణా, ఆర్టీసీ ఇలా అన్ని శాఖలను భాగస్వామ్యం చేశామన్నారు.  

50 వేల విగ్రహాలు నిమజ్జనం... 
రాష్ట్రంలో వినాయక చవితి మొదలు బుధవారం వరకు దాదాపు 50 వేల విగ్రహాలు నిమజ్జనం అయ్యాయని, గురువారం ఒక్కరోజే మరో 50 వేల ప్రతిమలు జలప్రవేశం చేస్తాయని వివరించారు. గ్రేటర్‌లో ట్యాంక్‌బండ్‌తో కలిపి మొత్తం 50 చెరువుల్లో నిమజ్జనం జరుగుతుందని, ప్రతీ నిమజ్జన కేంద్రం వద్ద పూర్తిస్థాయిలో క్రేన్లు, లైటింగ్, తాగునీరు, తదితర సదుపాయాలు ఏర్పాటు చేశామన్నారు. ప్రతీ కేంద్రం వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా సీసీ కెమెరాలతో నిత్యం పర్యవేక్షిస్తున్నామని తెలిపారు. ఈసారి మండప నిర్వాహకులు నిమజ్జనమయ్యాక పోలీస్‌ స్టేషన్‌కి వచ్చి రిపోర్టు చేసేలా చర్యలు తీసుకున్నామన్నారు.  

పుకార్లు రేపితే చర్యలు.. 
నిమజ్జనానికి విఘాతం కలిగించేలా పుకార్లు రేపినా, సోషల్‌ మీడియాలో వదంతులు రేపినా చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని డీజీపీ మహేందర్‌రెడ్డి హెచ్చరించారు. దేశవ్యాప్తంగా ఉగ్రవాద అలర్ట్‌ కొనసాగుతున్నప్పటికీ తెలంగాణకు ఇంతవరకూ కేంద్ర నిఘా సంస్థల నుంచి ఎలాంటి హెచ్చరికలు అందలేదని స్పష్టం చేశారు. అయినా.. తాము నిత్యం అప్రమత్తంగానే ఉంటున్నామని తెలిపారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top