కర్ణాటక సీఎం కుమారస్వామికి కేసీఆర్‌ ఫోన్‌

telangana cm kcr phone call to karnataka cm kumaraswamy - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు శుక్రవారం కర్ణాటక సీఎం కుమారస‍్వామితో ఫోన్‌లో మాట్లాడారు. జూరాలకు నీటి విడుదలపై ఆయన ఈ సందర్భంగా కర్ణాటక ముఖ్యమంత్రితో చర్చించారు. జూరాల ప్రాజెక్టుకు మూడు టీఎంసీల నీటిని విడుదల చేయాలని కేసీఆర్‌ కోరారు. దీనిపై సానుకూలంగా స్పందించిన కుమారస్వామి ప్రభుత్వం ...ఒకటి, రెండు రోజుల్లో నీటి విడుదలపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.

కుమారస్వామితో ఫలించిన కేసీఆర్‌ దౌత్యం
కాగా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రజలు ఈ వేసవిలో ఎదుర్కొంటున్న మంచినీటి సమస్యను అధిగమించడానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ కర్ణాటక ప్రభుత్వంతో నడిపిన దౌత్యం ఫలించింది. మహబూబ్ నగర్ జిల్లా ప్రజల మంచినీటి అవసరాలు తీర్చడం కోసం నారాయణపూర్ రిజర్వాయర్ నుంచి జూరాలకు రెండున్నర టీఎంసీల నీటిని విడుదల చేయాలని కర్ణాటక ప్రభుత్వం నిర్ణయించింది. మహబూబ్ నగర్ జిల్లా పరిధిలోని రిజర్వాయర్లలో నీటిమట్టం పూర్తిగా తగ్గిపోవడంతో నీటిని విడుదల చేయాల్సిందిగా కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామిని సీఎం కేసీఆర్ అభ్యర్థించారు.

కేసీఆర్ అభ్యర్థనపై కర్ణాటక అధికారులతో చర్చించిన సీఎం కుమారస్వామి తెలంగాణకు నీరు అందివ్వాలని నిర్ణయించారు. ఈ విషయాన్ని కుమారస్వామి స్వయంగా ఫోన్ చేసి సీఎం కేసీఆర్ కు తెలిపారు. ఇది మహబూబ్ నగర్ జిల్లా ప్రజలకు శుభవార్త అని కేసీఆర్ అన్నారు. మహబూబ్ నగర్ జిల్లా ప్రజల తరఫున  కుమారస్వామికి సీఎం కేసీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. రెండు రాష్ట్రాల మధ్య సుహృద్భావ, స్నేహ సంబంధాలు ఇలాగే కొనసాగాలని ఇద్దరు సీఎంలు అభిప్రాయపడ్డారు. కాగా, ఈ రోజు సాయంత్రం నుంచి జూరాలకు నీటి సరఫరా ప్రారంభం కానున్నది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top